Share News

Andhra Pradesh: వైసీపీ-టీడీపీ మధ్య ‘ర్యాగింగ్’పై వార్.. అసలు సంగతి ఇదీ..

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:42 PM

ర్యాగింగ్‌ (Ragging) పేరిట జూనియర్లపై సీనియర్‌ విద్యార్థులు పైశాచికత్వాన్ని ప్రదర్శించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనమే అయ్యింది. హాస్టల్‌ గదుల్లో జూనియర్లను కర్రలతో చితకబాదిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో..

Andhra Pradesh: వైసీపీ-టీడీపీ మధ్య ‘ర్యాగింగ్’పై వార్.. అసలు సంగతి ఇదీ..

పల్నాడు జిల్లా/అమరావతి: ర్యాగింగ్‌ (Ragging) పేరిట జూనియర్లపై సీనియర్‌ విద్యార్థులు పైశాచికత్వాన్ని ప్రదర్శించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనమే అయ్యింది. హాస్టల్‌ గదుల్లో జూనియర్లను కర్రలతో చితకబాదిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్‌ఎస్ఎన్‌ కళాశాల బాయ్స్‌ హాస్టల్‌లో (శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల) జరిగిన దారుణం వెలుగుచూసింది. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ-టీడీపీ మధ్య ట్విట్టర్ వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇంత జరుగుతున్నా హోం మంత్రి వంగలపూడి అనిత ఏం చేస్తున్నట్లు అని వైసీపీ ప్రశ్నించగా.. అసలు ఈ ర్యాగింగ్ వ్యవహారం ఎవరి హయాంలో జరిగింది..? తీసుకున్న చర్యలు ఏంటి..? అనే విషయాలను నిశితంగా ట్విట్టర్ వేదికగా వివరించారు.


Vangalapudi-Anitha.jpg

అనిత ట్వీట్ సారాంశం ఇదీ..

ఫిబ్రవరి 2024 గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన పల్నాడు జిల్లా నరసరావుపేటలోని SSN కాలేజ్‌లో జరిగిన ర్యాగింగ్‌పై ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు యాక్షన్ తీసుకోవడం వలన బయటకు వచ్చింది. Cr.No.91/2024 u/s 324 r/w 34 IPC, Sec 4(3) AP Prohibition of Ragging Act and Sec 3 (2)(v)(a) of SC/ST POA Act 2015 of Narsaraopeta-01 Town PS. వైయస్సార్సీపి ప్రభుత్వంలో జరిగిన దారుణాలను ఇప్పటి ప్రభుత్వానికి అంట కట్టడం అబద్దాలు ప్రచారం చేయడం వైసీపీ వాళ్లు మానుకుంటే మంచిది. వైసీపీ ప్రభుత్వంలో పట్టాలు తప్పిన లా అండ్ ఆర్డర్‌ను ఇప్పుడిప్పుడే గాడిలోకి తెస్తున్నాం. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల చేత ఛీ కొట్టించుకోవడం వైసీపీ పార్టీ వాళ్లకి కొత్తేమీ కాదు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పు చేసినా చర్యలు కఠినంగా తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాము అని హోం మంత్రి వంగలపూడి అనిత ట్వీట్ చేశారు.


TDP-And-YSRCP-Logo.jpg

వైసీపీ ట్వీట్ ఇదీ..!

ఏపీలో ఎప్పుడూ లేని విధంగా ర్యాగింగ్ శృతి మించుతున్నది!. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని SSN కాలేజీలో NCC ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను అర్ధరాత్రి వేళలో పిలిచి కర్రలతో చితక బాదిన విద్యార్థులు. నడిరోడ్డు మీద హత్య చేస్తేనే పోలీసులు ఏమీ చేయలేదు.. ఇంక కర్రలతో కొడితే ఏమవుద్ది అనుకుని ఉంటారు హోం మంత్రి వంగలపూడి అనిత. ఇది మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అని వైసీపీ తన అధికారిక ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.


Ragging-Issue-In-Andhra-Pra.jpg

అసలేం జరిగింది..?

పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన విద్యార్థి ఒకరు ఎస్‌ఎస్ఎన్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈ విద్యార్థి ఎస్‌సీసీలో చేరి.. కొన్ని రోజులకే మానేశాడు. అతని తల్లిదండ్రులు ఎన్‌సీసీ చేస్తే ఉపయోగం ఉంటుందని, మళ్లీ అందులో చేరాలని ఆ విద్యార్థిపై ఒత్తిడి చేశారు. దీంతో ఆ విద్యార్థి ఎస్‌సీసీ జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్‌ పేరిట వేధిస్తున్నారని, హాస్టల్‌ గదుల్లో పడేసి చితకబాదుతున్నారని చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియోలను వారికి చూపించాడు. ఆ తల్లిదండ్రులు ఆ వీడియోలను తెలిసిన వారికి చూపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదికాస్తా పోలీసు అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు దాన్ని సీరియస్‌గా తీసుకొన్నారు. ఈ మేరకు వన్‌టౌన్‌ సీఐ చింతల కృష్ణారెడ్డి విచారణ చేపట్టారు. ఈ వీడియోలోని దృశ్యాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినవని తెలిసిందని చెప్పారు. దీనిపై హాస్టల్‌ వార్డెన్‌ను వివరణ కోరగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. ర్యాగింగ్‌ ఘటనకు సంబంధించి ఆరుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Jul 25 , 2024 | 07:36 PM