Share News

Nimmala Ramanaidu: వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం

ABN , Publish Date - Aug 23 , 2024 | 01:52 PM

వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ, ప్రజా సంక్షేమం నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో ఉపాధి హామీ పథకం గ్రామసభలో పాల్గొన్నారు.

Nimmala Ramanaidu:  వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ  నిర్వీర్యం

పశ్చిమగోదావరి: వైసీపీ విధ్వంసక పాలనలో పంచాయతీ వ్యవస్థ, ప్రజా సంక్షేమం నిర్వీర్యం అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో ఉపాధి హామీ పథకం గ్రామసభలో పాల్గొన్నారు. ప్రజా నిర్ణయాలకు గ్రామసభలతో శ్రీకారం చుట్టి వారికి జవాబుదారీగా ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జగన్ పాలనలో సర్పంచులు సైతం బిచ్చమెత్తుకున్న దుస్థితిని చూశామని అన్నారు. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సైతం మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తన అకౌంట్లోకి మళ్లించుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపణలు చేశారు.


జగన్ ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసింది: మంత్రి బీసీ. జనార్ధన్ రెడ్డి

నంద్యాల: గ్రామాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వ కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ. జనార్ధన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని తెలిపారు. జగన్ ప్రభుత్వం గ్రామపంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శలు చేశారు. గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని మంత్రి బీసీ. జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు.


పనులను నిలిపివేసింది: బడేటి చంటి

ఏలూరు జిల్లా: ఏలూరు తంగెళ్లమూడిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రీసైక్లింగ్ సిస్టమ్ ట్రైల్ రన్‌ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. అమృత్ పథకంపై రీసైక్లింగ్ ప్రాజెక్ట్‌కు 2018లో టీడీపీ ప్రభుత్వం సుమారు రూ. 38 కోట్లు కేటాయించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పనులను ఎక్కడికక్కడే నిలిపివేసిందని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులను పునః ప్రారంభించిందని చెప్పారు. ఏలూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురికి కాల్వల్లో నీటిని శుద్ధిచేసి..ఆ నీటిని వ్యవసాయానికి పలు అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ రీసైక్లింగ్ సిస్టం మూడు నెలల్లో పూర్తిస్థాయి అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు.


ఏపీని అప్పులు పాలు చేశారు: పులపర్తి రామాంజనేయులు

పశ్చిమగోదావరి: ఏపీని అప్పులు పాలు చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోయారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆరోపించారు. వీరవాసరంలో గ్రామ సభలో ఎమ్మెల్యే రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. సీఎం కుర్చీని కూడా అమ్మేసి, 30 సంవత్సరాలు తాకెట్టు పెట్టారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో ఒక సీసీ రోడ్డు కూడా వేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పనికి రాకుండానే వచ్చినట్లు హాజరు వేయించుకున్నారని ఆరోపించారు. అది నేరం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎన్‌ఆర్‌జీ‌ఎస్ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాలని పులపర్తి రామాంజనేయులు అన్నారు.

Updated Date - Aug 23 , 2024 | 02:03 PM