Share News

నాడు-నేడుతో ఒరిగిందిలేదు

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:17 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో నాడు-నేడు పథకం పేరుతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఒరిగిందేమిలేదని సర్వత్రా విమర్శలున్నాయి.

నాడు-నేడుతో ఒరిగిందిలేదు
వాల్మీకిపురంలో అసంపూర్తి గదుల్లోనే నేలపై కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థులు

ఆర్భాటం తప్ప పాఠశాలల అభివృద్ధి నామమాత్రమే ఫ అస్మదీయులకే పనులు అరకొర బిల్లులతో ఆగిన వైనం వసతులు సరిగాలేక విద్యార్థుల పాట్లు

మదనపల్లె టౌన, సెప్టెంబరు 24: వైసీపీ ఐదేళ్ల పాలనలో నాడు-నేడు పథకం పేరుతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఒరిగిందేమిలేదని సర్వత్రా విమర్శలున్నాయి. ఇక అభివృద్ధి పనుల పేరుతో అస్మధీయు లను ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పించింది. కాంట్రాక్టర్లకు బదులు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(వైసీపీ నాయకులే) ఆధ్వర్యంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నిధులు ఖర్చు చేసింది. ఇందులో భాగంగా మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజ కవర్గాల్లోని 15 మండలాల్లో నాడు- నేడు పథకంలో రెండు దశల్లో జరి గిన పనులపై ‘ఆంధ్రజ్యోతి విజిట్‌’ చేయగా పలు అంశాలు వెలుగులో కి వచ్చాయి. అర్థాంతరంగా ఆగిపోయిన పనులు, ఈ పనుల కోసం గడ్డకట్టిపోయిన సిమెంటు, మూలన పడిన భవన నిర్మాణ వస్తువులు వెరసి నాడు-నేడు పనులతో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం బదులు, అసౌకర్యాలే పట్టిపీడిస్తున్నాయి.

మదనపల్లె మండలం సీటీఎం గ్రామం రైల్వేగేటు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మొదటి దశలో నాడు-నేడు పనుల్లో రెండు తరగతి గదులు నిర్మించారు. కాగా ఇక్కడ వున్న 78 మంది విద్యార్థులకు గాను ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి ముగ్గురిని మాత్రమే ఉంచి, ఇద్దరిని బదిలీ చేశారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ముగ్గురు ఉపాధ్యాయులే బోధనలు చేస్తున్నారు. దీం తో ఇద్దరు ఉపాధ్యాయులు రెండేసి తరగతులను ఒకే వరండాలో విద్యార్థులను కూర్చోపెట్టి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ క్రమం లో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులకు తాళాలు వేయడంతో వృఽథాగా కనిపిస్తున్నాయి.

మదనపల్లె మండలం కొత్తవారిపల్లె జడ్పీ హైస్కూల్లో రెండో దశ లో రూ.42లక్షలతో నాడు-నేడు పనులు ప్రారంభించారు. రెండు మరు గుదొడ్లు పూర్తి చేసినా, విద్యార్థులు తాగేందుకు పరిశుభ్ర నీటికి ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయలేదు. నాలుగు నెలలుగా విద్యార్థులే ఇంటి నుంచి వాటర్‌ బాటిళ్లు తెచ్చుకుని మధ్యాహ్నబోజనం చేస్తున్నారు. ఇక్కడ పూర్తి చేసిన భవనాలకు, స్కూల్‌ నేమ్‌బోర్డుకు పెయింటింగ్‌లు నిలిపివేశారు.

మదనపల్లె పట్టణంలోని జడ్పీహైస్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచిపోయాయి.

బి.కొత్తకోట మండలం గోళ్లపల్లె జడ్పీహైస్కూల్లో రూ.1.7కోట్లతో ప్రారంభించిన తొమ్మిది అదనపు తరగతి గదుల నిర్మాణాలు జీ ప్లస్‌ 2 స్థాయిలోనే అసంపూర్తిగా మిగిలిపోయాయి.

ములకలచెరువు చౌడసముద్రం జడ్పీహైస్కూల్లో చేపట్టిన నాడు నేడు పనులు అసంపూర్తిగా, నాసిరకంగా ఉన్నాయి. ఇక్కడ తరగతి గదులకు కిటికిలు లేకపోవడం, నాసిరకం నిర్మాణాలతో గోడ నెర్రులు విడవడం కనిపించింది.

పెద్దమండ్యం మండలంలో 23 పాఠశాలల్లో నాడు-నేడు పనుల్లో ప్రహరీ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయాయి. పెద్దతిప్పసముద్రం మండలం లో సిమెంటు కొరతతో పనులు నిలిచిపోయాయి.

నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల్లో 70శాతం నాడు-నేడు పనులు పూర్తి కాగా, 30శాతం చివరి దశ పనులు నిలిచిపోయాయి. దీంతో ఈ నిర్మాణాలు దేనికి ఉపయోగపడే విధంగా లేవు.

పీలేరు నియోజకవర్గం కలకడ మండలంలో నిధులు లేక నాడు-నేడు పనులు నీరసించి పోయాయి. బాటవారిపల్లె స్కూల్లో పై అంతస్థులో నిర్మిస్తున్న గదులు అర్ధాంతరంగా నిలిపివేశారు. ఎర్రయ్య గారిపల్లె జడ్పీహైస్కూల్‌ వద్ద పిల్లర్ల స్థాయిలోనే పనులు నిలిపివేయ డంతో ఇనుప కమ్మీలు తుప్పుపట్టిపోతున్నాయి. మిగిలిన చోట్ల పునా దుల కోసం వేసిన పిల్లర్లు దిష్టిబొమ్మల్లా దర్శమిస్తున్నాయి.

గుర్రంకొండ జడ్పీ తెలుగు హైస్కూల్లో నాడు-నేడు పనులు నిధు లు లేక నిలిచిపోయాయి. కుళాయి పైప్‌లైన్లు వేయకపోవడంతో బోజ నం తిన్న విద్యార్థులు ఆరుబయట చేతులు కడుక్కోవలసి వస్తోంది. మరుగుదొడ్లకు కుళాయిలు లేకపోవడంతో కొత్త మరుగుదొడ్లు నిర్మిం చినా ఉపయోగంలోకి రాలేదు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటు మరమ్మతులకు గురైంది.

వాల్మీకిపురం పట్టణంలోని పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాడు- నేడు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కిటికీలు, తలుపులు బిగించలేదు. దీంతో డెస్కులు వేయలేక ఈ అసంపూర్తి గదుల్లోనే విద్యార్థులను నేల మీద కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Sep 25 , 2024 | 12:17 AM