CM Chandrababu: జేసీబీపై నాలుగున్న గంటలు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
ABN , Publish Date - Sep 03 , 2024 | 10:01 PM
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్న ఆయన.. ఇవాళ (మంగళవారం) కూడా మరిన్ని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ రోజు జేసీబీపై నాలుగున్నర గంటలపాటు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.
అమరావతి: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్న ఆయన.. ఇవాళ (మంగళవారం) కూడా మరిన్ని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ రోజు జేసీబీపై నాలుగున్నర గంటలపాటు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా వాంబే కాలనీలో నివసించే 31 ఏళ్ల లక్ష్మి అనే గర్భిణి హాస్పిటల్‌కు వెళ్లలేక ఇబ్బందిపడుతున్న విషయాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు ఆమెకు సాయం చేయాలని సీఎంవో సిబ్బందిని ఆదేశించారు. దీంతో సీఎంవో సిబ్బంది ఆమెను ఒక ట్రాక్టర్‌లో ఎక్కించుకొని మెయిన్ రోడ్ వరకు తీసుకెళ్లి వదిలారు. సీఎం ఆదేశాలతో అక్కడ నుంచి అంబులెన్స్‌లో పాత గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి అధికారులే స్వయంగా అడ్మిట్ చేశారు. సీఎం ఆదేశాలతో ఆయన కార్యదర్శి రాజమౌళి స్వయంగా గర్భిణీని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. దీంతో లక్ష్మి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఆయన సిబ్బంది తక్షణ స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
విద్యుత్ లేక వరద బాధితుల ఇబ్బందులు
వరదల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇబ్రహీంపట్నం వరద ముంపు ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి విద్యుత్ లేక ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద తీవ్రత తగ్గినప్పటికీ ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, మూలపాడు, జూపూడి, కోటికలాపూడి ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉన్నారు. అయితే రేపు ఉదయానికి విద్యుత్ సమస్య పరిష్కారం అవుతుందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.
ఏలూరు కాలువలోకి బుడమేరు నీరు
బుడమేరు నీరు ఏలూరు కాలువలోకి పారుతోంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. మధురానగర్, రామవరప్పాడు, ప్రసాదంపాడు ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏలూరు కాలువలో వరద ప్రవాహం పెరగడంతో కట్టలు తెగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాలువ గట్టున ఉంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మైక్ ద్వారా ప్రచారం చేశారు. కాగా ఏలూరు కాలువ గట్ల ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.