Share News

Rain Alert: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. ఏపీలో వర్షాలు..

ABN , Publish Date - Oct 16 , 2024 | 07:21 AM

వాయుగుండం గురువారం చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Rain Alert: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. ఏపీలో వర్షాలు..

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) వాయుగుండంగా బలపడింది. వాయువ్య దిశగా గంటకు 10 కిమీ వేగంతో వాయుగుండం కదులుతోంది. చెన్నైకి (Chennai) 440 కి.మీ., పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో ఉంది. వాయుగుండం గురువారం తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ (Ronanki Kurmanath) తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు.


కాగా బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి మంగళవారం రాత్రికి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు ముప్పు పొంచి ఉంది. బుధవారం ఆ ఆరు జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టిగా, మరికొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నెల్లూరు, చిత్తూరు, కడప, తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్‌ జిల్లాలకు మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకూ ఆకస్మిక వరదలు సంభవిస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారం నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి రాత్రికి వాయుగుండంగా బలపడింది. మంగళవారం సాయంత్రానికి చెన్నైకు 500 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, నెల్లూరుకు 590 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 17వ తేదీ ఉదయం నెల్లూరు, పుదుచ్చేరి మధ్య తీరం దాటనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుఫాన్‌గా మారుతుందని రెండు రోజుల క్రితం వాతావరణ నిపుణులు సూచించారు. అయితే తుఫాన్‌గా మారే అవకాశం లేదని, వాయుగుండంగానే తీరం దాటుతుందని, తరువాత దక్షిణ భారతం మీదుగా పయనించి అరేబియాసముద్రంలో ప్రవేశిస్తుందని తాజాగా అంచనా వేశారు. ఇదిలావుండగా దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనికితోడు మంగళవారమే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించడంతో బంగాళాఖాతం నుంచి తేమ మేఘాలు తీరం వైపు రావడంతో దక్షిణకోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా విద్యానగర్‌లో 80.75, ఏర్పేడులో 68.25 మి.మీ. వర్షపాతం నమోదైంది.


పెరగనున్న వర్షాలు

తీవ్ర అల్పపీడనం నుంచి తీరం వైపు వస్తున్న మేఘాల ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురవనున్నాయి. బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ ఎలర్ట్‌ ప్రకటించింది. అలాగే బాపట్ల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. వాయుగుండం తీరం దాటే సమయంలో అంటే గురువారం నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 40నుంచి 60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మత్స్యకారులు ఈ రెండు రోజులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది. అలాగే వర్షాల నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రీల్‌ లైఫ్‌ ప్రేమికులు.. రియల్‌ లైఫ్‌ దంపతులు..

మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 16 , 2024 | 07:51 AM