Share News

Minister Narayana : పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే అమరావతి

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:48 AM

రాజధాని అమరావతి నిర్మాణ పనులను త్వరలోనే చేపడతామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు.

Minister Narayana : పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే అమరావతి

  • 15 రోజుల్లో అధ్యయనం చేసి కాలపరిమితి నిర్దేశం

  • తొలి దశలో 48 వేల కోట్ల ఖర్చు.. 3 విడతల్లో కలిపి లక్ష

  • కోట్ల వ్యయం.. రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తాం

  • మంత్రి నారాయణ స్పష్టీకరణ.. బాధ్యతల స్వీకారం

అమరావతి, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణ పనులను త్వరలోనే చేపడతామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు. మరో 15 రోజుల్లో అధ్యయనం చేసి ఏయే పనులుఎప్పటిలోగా పూర్తి చేస్తామో కాలపరిమితి నిర్దేశిస్తామని తెలిపారు. ఆదివారం వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.48 వేల కోట్లతో అమరావతి నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టామన్నారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ప్రపంచంలో టాప్‌ టెన్‌ నగరాల్లో నూతన రాజధాని నిలిచేలా పనులు చేశామని తెలిపారు. చిన్న లిటిగేషన్‌ కూడా లేకున్నా.. గత జగన్‌ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘భూములిచ్చిన రాజధాని రైతులను నిలువునా మోసం చేసింది. మూడు రాజధానుల పేరు చెప్పి రాజధాని అమరావతిని ధ్వంసం చేసింది. దాని అరాచక పాలనతో ప్రజలు విసుగు చెంది టీడీపీ కూటమికి అధికారం ఇచ్చారు. త్వరలోనే రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభిస్తాం. మూడు దశల్లో రాజధాని అమరావతిని నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు రూపొందించి అమలు చేశాం. తొలి దశ పనులకు రూ.48 వేల కోట్లు ఖర్చవుతాయి. మూడు దశల్లో కలిపి రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు వ్యయమవుతాయి’ అని వివరించారు. రాజధానిపై కోర్టులో ఉన్న కేసులపై అధ్యయనం చేసి సానుకూల చర్యలు తీసుకుంటామన్నారు. రాజధాని రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తామని తెలిపారు. రాజధానిలో రోడ్ల ధ్వంసం సహా దొంగతనాలపై కచ్చితంగా చర్యలుంటాయని.. కమిటీ వేసి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

మంత్రి పేషీలో శ్రీలక్ష్మి హల్‌చల్‌

రెండు రోజుల కిందట ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులందరూ సీఎం చంద్రబాబును కలిసినప్పుడు ఆయన పురపాలక శాఖ ప్రత్యేక సీఎస్‌ శ్రీలక్ష్మి ఇచ్చిన పుష్పగుచ్ఛం తీసుకునేందుకు నిరాకరించారు. ఆ తర్వాత వైసీపీతో అంటకాగిన ఐఏఎస్‌లు అడ్డగోలుగా ఫైళ్లు నడిపిన తీరును ప్రస్తావించారు. ఆది వారం మంత్రి నారాయణ పేషీలో శ్రీలక్ష్మి హల్‌చల్‌ చేశారు. ఆ శాఖకు ప్రత్యేక సీఎస్‌ అయినందున.. నారాయణ సతీమణి వద్ద ఎక్కువ సేపు ఉండి కలుపుగోలుగా మాట్లాడే యత్నాలు చేశారు. ప్రతిదానికీ మంత్రి వద్దకు వెళ్లి మాటలు కలపడం చూస్తే మళ్లీ ఇదే శాఖలో కొనసాగే కోరిక ఆమెకు ఉందేమోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత ఏదో ఫైలుపై సంతకాల కోసం ఆమె వస్తే నారాయణ పక్కనపెట్టారు.

Updated Date - Jun 17 , 2024 | 04:53 AM