Nara Lokesh: విద్యారంగంలో సంస్కరణలు తప్పవు
ABN , Publish Date - Dec 14 , 2024 | 05:03 AM
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడం లక్ష్యంగా సంస్కరణలు అమలుకావాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ఇప్పుడు అమలు చేయకపోతే విద్యావ్యవస్థ మనుగడకే ప్రమాదం
ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో లోకేశ్
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడం లక్ష్యంగా సంస్కరణలు అమలుకావాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. సంస్కరణలు ఇప్పుడు అమలుచేయలేకపోతే రాబోయే పదేళ్లలో విద్యావ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ఉపాధ్యాయ సంఘాలతో ఆయన మొదటి సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్యలోనే అనేక అంశాలపై దాదాపు నాలుగు గంటలపాటు వారితో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా తమకు ఎలాంటి పరదాలు ఉండవని, సీఎం నుంచి ఎమ్మెల్యే వరకూ అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. సంస్కరణల అమలులో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు. అపార్ ఐడీల రూపకల్పనలో ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించామని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోందని, డ్రాపౌట్లు కూడా పెరుగుతున్నారని ఈ నేపథ్యంలో సంస్కరణలు అమలుచేయక తప్పదని స్పష్టం చేశారు. ఫలితాల విషయంలో ప్రైవేటు పాఠశాలలో పోటీపడాలని నిర్దేశించారు.
ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలపై మరింత శ్రద్ధ అవసరమన్నారు. రాష్ట్రంలో 20 కంటే తక్కువ మంది విద్యార్థులున్న బడులు 30 శాతం ఉన్నాయని, 300 పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు వచ్చాయని తెలిపారు. యువగళం పాదయాత్రలో జీవో 117 తన దృష్టికి వచ్చిందని, చిన్నపిల్లలు నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లడం కష్టమని, అందుకే ఆ జీవోను రద్దుచేసి ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామని వివరించారు. టీచర్లపై యాప్‌ల భారం తగ్గించామని, ఇంకా అమలులో ఉన్న విద్యేతర యాప్‌లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఆంధ్రా మోడల్ విద్యా విధానం టీచర్లతోనే సాధ్యమని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడకూడదని మంత్రి లోకేశ్ ఆదేశించారని తెలిపారు. ఫలితాల సాధన, హాజరుశాతం పెంపునకు టీచర్లు కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఉన్నతాధికారులు వి.విజయరామరాజు, బి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎల్.సాయి శ్రీనివాస్, ఎం.రఘునాథరెడ్డి, ఏజీఎస్ గణపతిరావు, కె.ప్రకాశ్‌రావు, ఎన్.వెంకటేశ్వర్లు, కేఎ్‌సఎస్ ప్రసాద్, పీవీ రమణ, వి.శ్రీనివాసరావు, జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి, సీహెచ్.మంజుల, కె.భానుమూర్తి ఎస్.బాలాజీ, జీవీ సత్యనారాయణ ఎ.ఎం.గిరిప్రసాద్ పాల్గొన్నారు.