Sharmila : కుమిలిపోతున్న అమ్మ..!
ABN , Publish Date - Oct 27 , 2024 | 05:13 AM
‘‘ఆస్తి కోసం.. కన్న కొడుకే కోర్టుకు ఈడ్చి, కేసు పెట్టడంతో అమ్మ కుమిలిపోతోంది. ఇదంతా చూసేందుకే నేను ఇంకా బతికి ఉన్నానా అని రోదిస్తోంది’’
కన్న కొడుకే కేసు పెట్టి కోర్టుకు లాగేసరికి...
ఇంకా ఎందుకు బతికున్నానా అని రోదిస్తోంది
అన్న కోసం పాదయాత్ర చేశా.. సమైక్య ఉద్యమం నడిపా
నా కోసం ఒక్క మేలైనా ఆయన చేశారా?
‘నీ తర్వాత షర్మిల మేలు కోరేది నేనే’ అని నాన్నతో చెప్పాడు
నా పిల్లలపై ప్రమాణం చేసి ఇదంతా చెబుతున్నా
వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయగలరా?: షర్మిల
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆస్తి కోసం.. కన్న కొడుకే కోర్టుకు ఈడ్చి, కేసు పెట్టడంతో అమ్మ కుమిలిపోతోంది. ఇదంతా చూసేందుకే నేను ఇంకా బతికి ఉన్నానా అని రోదిస్తోంది’’ అని వైఎస్ విజయలక్ష్మి కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ రద్దు అవుతుందని తల్లిపై కేసు పెట్టానని జగన్ అనడం దుర్మార్గమని, తన ప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు లాగే దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా అంటూ మండిపడ్డారు. శనివారం విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. జగన్‌కూ .. తనకూ మధ్య ఏర్పడిన ఆస్తుల వివాదం మీడియా ప్రస్తావించగానే... షర్మిల కన్నీరు పెట్టుకున్నారు. ‘‘అన్నగా జగన్ ఆదేశించిన వెంటనే ఆనాడు పాదయాత్ర చేశాను. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేశాను. కానీ, నాకు ఒక్క మేలైనా జగన్ చేశాడా? ’’ అని గద్గద స్వరంతో ప్రశ్నించారు. జగన్ కోసం అమ్మ ఎంతో చేశారని, మోకాళ్ల నొప్పులు ఉన్నా .. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆ నొప్పులకు ఐస్ రుద్దుకుని మరీ తిరిగారని గుర్తు చేశారు. అలాంటి అమ్మ మీద ఆస్తికోసం జగన్ కేసు పెట్టారని ఆగ్రహించారు. ‘‘నాకు మా అన్న అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఆదేశించగానే పాదయాత్ర చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడాను. జగన్ కోసం నేను ఏదైనా చేసేందుకు సిద్ధపడ్డాను. జగన్ ఆదేశిస్తే చనిపోతానని తెలిసినా సూర్యుడిని తాకేదానిని. నాకు ఏం మేలు చేశాడో జగన్ చెప్పాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.
వైవీ ప్రమాణం చేయగలరా?
ఆస్తుల వ్యవహారానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులకు రాసిన లేఖలో ఉద్దేశపూర్వకంగానే, బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్లు రాశానని షర్మిల అన్నారు. ‘‘జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని తెలిసే ఆ లేఖలో వైవీ పేరు ప్రస్తావించాను. నా లేఖకు వైవీ స్పందించిన తీరుతోనే ఆయన నైజం .. నిజస్వరూపం అమ్మకు తెలిసిపోయాయి. నేను చెబుతున్నదంతా నిజమని నా పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నాను. సుబ్బారెడ్డి ప్రమాణం చేయగలరా? నా పిల్లలు సుబ్బారెడ్డి కళ్ల ముందే పెరిగారు. కనీసం వారిపై మమకారం లేదా? వైవీ, ఆయన కుమారుడు.... జగన్ వల్ల లబ్ధి పొందారు’’ అని షర్మిల విమర్శించారు. జగన్ పేరిట ఆస్తులున్నందునే ఆయన జైలుకు వెళ్లారని వైవీ అంటున్నారని .. అదే నిజమనుకుంటే .. తన పేరు మీద ఇవే ఆస్తులు ఉన్న భారతీ ఎందుకు జైలుకు వెళ్లలేదని షర్మిల ప్రశ్నించారు. ఆస్తులున్నందుకు ఎవరూ జైలుకు వెళ్లరని, చేసిన పనుల వల్ల వెళతారని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఎంవోయూ రాసుకుంటారా అని వైవీ సుబ్బారెడ్డిని నిలదీశారు. ఎంవోయూ రాశారంటేనే ఇవ్వాల్సిన బాఽధ్యత ఉన్నదని అర్థమన్నారు. దీనికి వైవీ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.
నాన్న ముందే అన్న చెప్పాడు...
ఆస్తుల బదలాయింపు జరగకపోవడంపై ఒకరోజు జగన్‌ను తన తండ్రి రాజశేఖర రెడ్డి పిలిచి ఆరా తీశారని షర్మిల తెలిపారు. ‘‘నాన్నకు అప్పుడు మూడు అడుగుల దూరంలోనే జగన్ ఉన్నారు. ‘నీ తరువాత పాప (షర్మిల) మేలు కోరేది నేనే’ అని నాన్నతో జగన్ చెప్పారు.