Nara Lokesh: జగన్ అక్రమాస్తులు జప్తు చేస్తాం.. తిన్నదంతా కక్కిస్తాం
ABN , Publish Date - Feb 19 , 2024 | 03:24 AM
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అనేక పాపాలు చేశారని, ఈ మధ్య పచ్చి అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. సొంతంగా టీవీ, పేపర్ లేవంటున్నారని, ఒకవిధంగా అది నిజమేనని.. ఎందుకంటే ఆ రెండు ప్రజల

తిన్నదంతా కక్కిస్తాం: లోకేశ్
ఈ సీఎం పాపాలపుట్ట, అబద్ధాలకోరు.. సొంతంగా పేపర్, టీవీ లేవంట!
ఇవి ప్రజాధనంతో తెచ్చినవే.. లక్ష కోట్లు లూటీ చేసి భారతీ సిమెంట్స్ ఏర్పాటు
బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి ప్యాలెస్‌లూ అవినీతి పునాదులపై కట్టినవే
ఉత్తరాంధ్రను బొత్స, వైవీ, సాయిరెడ్డి కుటుంబాలకు సీఎం రాసిచ్చేశాడు
టీడీపీ వస్తే పథకాలు రద్దంటూ తప్పుడు ప్రచారం.. వైసీపీ వచ్చాకే 100 స్కీంలు రద్దు
జాబ్స్ కేపిటల్‌ను గంజాయి రాజధానిగా చేశారు.. లక్షల కుటుంబాలు నాశనం
మేమొస్తే హైదరాబాద్‌కు దీటుగా విశాఖ అభివృద్ధి.. శంఖారావం సభల్లో లోకేశ్ హామీ
చంద్రబాబు హయాంలో ప్రశాంతమైన, సంతోషకరమైన నగరంగా గుర్తింపుపొందిన విశాఖలో ఇప్పుడు రోజుకో కుంభకోణం, కిడ్నాప్, హత్య జరుగుతున్నాయి.
గంజాయి విస్తరించడానికి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారకుడు. తూర్పు గోదావరిలో దాని సాగును ప్రోత్సహించి పెద్దఎత్తున ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. లక్షల కుటుంబాలు నాశనమైపోయాయి.
జగన్ జలగలాంటి వాడు. సైలెంట్‌గా కృష్ణపట్నం, గంగవరం పోర్టులు కొట్టేశాడు. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టులో పది వేల మంది కార్మికులను రోడ్డున పడేశాడు.
- లోకేశ్
విశాఖపట్నం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అనేక పాపాలు చేశారని, ఈ మధ్య పచ్చి అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. సొంతంగా టీవీ, పేపర్ లేవంటున్నారని, ఒకవిధంగా అది నిజమేనని.. ఎందుకంటే ఆ రెండు ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినవేనని వ్యాఖ్యానించారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేసి ఏర్పాటుచేసింది కాబట్టి భారతీ సిమెంట్స్ కూడా ప్రజలదేనన్నారు. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లిలో ప్యాలె్‌సలు ఉన్నాయని.. అవి కూడా అవినీతి పునాదులపై కట్టినవేనని తెలిపారు. ప్రజల డబ్బుతో ఏర్పాటుచేసిన టీవీ, పేపర్, సిమెంట్ కంపెనీ, ప్యాలె్‌సలు మనవేనని.. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటన్నింటినీ జప్తు చేస్తామని ప్రకటించారు. ‘శంఖారావం’ యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం విశాఖ తూర్పు, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. జాబ్స్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా టీడీపీ అభివృద్ధి చేసిన విశాఖను గంజాయి రాజధానిగా మార్చిన ఘనత సీఎం జగన్‌దేనని ఆరోపించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంచేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా చంద్రగిరిలో ఒక తల్లి తనను కలిసిందని, తనకున్న ముగ్గురు కుమార్తెలలో పదో తరగతి చదువుతున్న పెద్దమ్మాయికి వైసీపీ నాయకులు గంజాయి అలవాటు చేసి శారీరకంగా వాడుకున్నారని కన్నీరు పెట్టడం మనసును కలచివేసిందన్నారు. గంజాయి రవాణా వెనుక ఎవరున్నారో బయటకు లాగి ఆ మహమ్మారి నుంచి ప్రజలను రక్షిస్తామని హామీ ఇచ్చారు. తప్పులు చేసిన అధికారులు, వైసీపీ నేతల పేర్లు ‘రెడ్ బుక్’లో ఉన్నాయని చూపిస్తూ.. తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తానెక్కడకూ పారిపోలేదని, విశాఖలోనే ఉన్నానని లోకేశ్ తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..
ఆ ఎంపీ నీతులు చెబుతున్నారు..
విశాఖ ఎంపీ సొంత కుటుంబ సభ్యులే కిడ్నా్‌పనకు గురికావడం చూశాం. అందుకు కారణమేమిటో ఆయనే చెప్పాలి. ఇప్పుడాయన కుటుంబం హైదరాబాద్ పారిపోయి బతుకుతున్న విషయం చెప్పకుండా మాకు నీతులు చెబుతున్నాడు. నగరంలో వైసీపీ నేతల భూదందాలకు అడ్డుచెబుతున్నారన్న కారణంతో తహసీల్దారు రమణయ్యను అతి కిరాతకంగా చంపేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఆయనకు పట్టిన గతే పడుతుందని హెచ్చరికలు చేస్తున్నారు.
ఎవరు పేదవాడు?
రాష్ర్ట్రంలో పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధమని జగన్ తరచూ అంటున్నాడు. రూ.లక్షల కోట్లు ఆస్తి, రూ.లక్ష విలువైన చెప్పులు వేసుకుని, రూ.1,000 వాటర్ బాటిల్ తాగేవాడు.. బెంగళూరు, హైదరాబాద్, ఇడుపులపాయ, తాడేపల్లి, విశాఖల్లో ప్యాలె్‌సలు ఉన్న వ్యక్తి పేదవాడా? రెండు నెలల్లో జగన్మోహన్‌రెడ్డి అహంకారానికి, పేద ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగబోతోంది.
కళాశాలల ఖాతాల్లోకి..
జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమ వ్యాపారంతో రోజుకు రూ.3 కోట్ల వంతున ఐదేళ్లలో రూ.5,400 కోట్లు దోచుకున్నాడు. వెయ్యికి దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు ఏకంగా ఆరు వేలయింది. ఇప్పుడు ఏ పందికొక్కు ఇసుక తింటున్నాడో జగన్ చెప్పాలి. ఆయన అన్నం తినడం మానేసి ఇసుక తింటున్నాడు. రెండు నెలలాగితే ఆయన తిన్నదంతా కక్కిస్తాం. జగన్ నిలిపివేసిన విదేశీ విద్యను తిరిగి అందుబాటులోకి తెస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కళాశాలల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటాం.
సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్
వైసీపీ హయాంలో సుమారు 100 సంక్షేమ పథకాల ను జగన్ రద్దు చేశాడు. పైగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తారని వలంటీర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమానికి ఆద్యుడు నందమూరి తారకరామారావు. ఆయన తర్వాత చంద్రబాబు సుమారు 100 పథకాలు అమలుచేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్‌కు దీటుగా విశాఖను అభివృద్ధి చేస్తాం. చంద్రబాబు హయాంలో ఆంధ్ర యూనివర్సిటీ అత్యుత్తమ పనితీరుతో జాతీయ స్థాయిలో 29వ స్థానంలో ఉండేది. ప్రసాదరెడ్డిని వైస్ చాన్సలర్ చేసిన తరువాత 76వ స్థానానికి దిగజారిపోయింది. ఆయన యూనివర్సిటీని ధ్వంసం చేస్తున్నాడు. బాలయ్య, పవన్‌ను చూస్తే జగన్‌కు అసూయ. అందుకే యాత్ర-2 తీశాడు. కానీ ఫస్ట్ షో కు కూడా జనాలు లేరు. జగన్ నవ్వు, మాట, నడక అం తా అబద్ధం. ఈ మధ్య జోకులు వేస్తూ జోకర్‌గా మారా డు. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అనేక కంపెనీలను తీసుకొచ్చాను. వాటిని కొనసాగించి ఉంటే ఇప్పటికి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. కానీ గుడ్డు మంత్రి ఆమ్లెట్లు వేసుకునే పనిలో ఉన్నాడు. ప్రజల కష్టాలు తీర్చేందుకు సూపర్ సిక్స్‌తో ప్రజలకు ముందుకు వస్తు న్నాం. వారంతా మాకు అండగా ఉండాలి. పార్టీ నాయకు లు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన అధికారులు, వైసీపీ నాయకుల పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయి.
ఉత్తమ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు
పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవులిస్తాం. ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్త్‌కు గ్యారంటీ’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వారికి ఉత్తమకార్యకర్త అవార్డు అందించాం. ఈ అవార్డు కాగితం మాదిరిగా కనిపించవచ్చు. కానీ భవిష్యత్‌లో చంద్రబాబును, నన్ను కలిసేందుకు రాచమార్గంగా ఉపయోగపడుతుంది. ఈ అవార్డు గ్రహీతలు మమ్మల్ని కలవడానికి ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. రానున్న రెండు నెలలు కష్టపడి పనిచేసే వారికి మంచి అవకాశాలు కల్పిస్తాం. క్లస్టర్, బూత్ అధ్యక్షులకు ‘సూపర్ సిక్స్’ కిట్లు ఇచ్చాం. వాటిని ప్రజలకు అందించాలి. రానున్న రెండు నెలలు ప్రజల్లో ఉండాలి. టీడీపీకి భారీ మెజారిటీ వచ్చే సీట్లలో విశాఖ తూర్పు టాప్-3లో ఉండాలి.
అప్పన్నను దర్శించుకున్న లోకేశ్
సింహాచలం: లోకేశ్ ఆదివారం సింహాచలం లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు దేవాలయ ఏఈవోలు భ్రమరాంబ, పాలూరి నరసింగరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండప ప్రదక్షిణ చేసి అంతరాలయంలోకి వెళ్లారు. పూజ ల అనంతరం పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. డిప్యూటీ ఈవో ఎన్.సుజాత స్వామివారి చిత్ర పటం జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు. కాగా.. నందమూరి తారకరత్న ప్రథమ వర్ధంతి సందర్భం గా లోకేశ్ ఘనంగా నివాళులు అర్పించారు. తారకరత్న చిత్రపటానికి అంజలి ఘటించారు.
ఉత్తరాంధ్రను దోచేస్తున్నారు
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కుటుంబాలకు జగన్ రాసిచ్చేశాడు. ఈ మూడు కుటుంబాల చేతుల్లోకి వేల ఎకరాలు వెళ్లాయి. అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. జగన్‌రెడ్డి ఏ ముహూర్తంలో విశాఖ రాజధాని అని అన్నాడో గానీ అప్పటి నుంచి ఇక్కడ ఇబ్బందులు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కెమికల్ ఫ్యాక్టరీలో లీకేజీలు ఏర్పడ్డాయి. బాయిలర్స్ పేలిపోయాయి. ఒక్క వ్యక్తి ఉండడానికి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. చంద్రబాబు ఇల్లు ఆ ప్యాలె్‌సలో బెడ్‌రూమ్ అంత ఉంటుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో భూ కబ్జాలు, నేరాలు పెరిగిపోయాయి. ఆయన కటింగ్, ఫిటింగ్ మాస్టర్. బులుగు బటన్ నొక్కి పది రూపాయిలు ఇస్తే, రెడ్ బటన్ నొక్కి చార్జీల రూపంలో వంద రూపాయలు లాగేస్తున్నాడు.
అంతిమయాత్ర మొదలు..
జగన్మోహన్‌రెడ్డిని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తుకొస్తున్నాడు. రూ.కోట్లు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా తీసి, థియేటర్లకు జనాలను తీసుకొచ్చేలా టికెట్లు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యేలకు టార్గెట్లు ఇచ్చారు. అయినా ఎవరూ సినిమా చూసేందుకు రావడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలకు అంతిమయాత్ర మొదలైంది. జగన్ అర్జునుడు, అభిమన్యుడు కాదు. ఆయనొక సైకో.. భస్మాసురుడు.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్.