Share News

ఇది జగన్‌ పాపమే!

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:20 AM

జగన్మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాతే 2019, 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్‌ సహా పోలవరం ప్రాజెక్టు కీలక నిర్మాణాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీఈవో) స్పష్టం చేసింది.

ఇది జగన్‌ పాపమే!

పోలవరానికి ఆయన జమానాలోనే ప్రధాన నష్టం

2019, 20ల్లో వచ్చిన వరదలకే దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌

ప్రధాన డ్యాం ప్రాంతంలో భారీ గుంతలు

తేల్చిచెప్పిన అంతర్జాతీయ నిపుణులు.. ప్రాజెక్టు అథారిటీకి నివేదిక

(అమరావతి-ఆంధ్రజ్యోతి) జగన్మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాతే 2019, 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్‌ సహా పోలవరం ప్రాజెక్టు కీలక నిర్మాణాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీఈవో) స్పష్టం చేసింది. ఆయన హయాంలోనే ప్రాజెక్టుకు ప్రధాన నష్టం జరిగిందన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టాక నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించి ఉంటే.. డయాఫ్రం వాల్‌పై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాంను నిర్మించి ఉంటే.. 2020 వరదలకు వాల్‌ దెబ్బతినేది కాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి పంపిన సమగ్ర నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ దెబ్బతినడంతో.. మరమ్మతులు చేయాలా, కొత్తది నిర్మించాలా అనే సందేహాల నివృత్తికి అమెరికా, కెనడా దేశాలకు చెందిన ఇద్దరేసి నిపుణులను కేంద్ర జలశక్తి శాఖ నియమించింది.

అమెరికాకు చెందిన ప్రాజెక్టుల నిర్మాణ నిపుణులు జియాన్‌ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్‌ బి పాల్‌.. కెనడా నిపుణులు సీన్‌ హించ్‌బెర్గర్‌, రిచర్డ్‌ డొనెల్లీ జూన్‌ 30, జూలై మొదటివారంలో ప్రాజెక్టు ప్రాంతంలో 4 రోజులు పర్యటించి స్వదేశాలకు వెళ్లిన వీరు.. తర్వాత ప్రాథమిక నివేదిక పంపారు. అందులోని కొన్ని అంశాలపై కేంద్ర జల సంఘం, రాష్ట్ర జల వనరుల శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధానంగా 2016లో ప్రారంభించిన వాల్‌ 2018లోనే పూర్తయితే.. 2018లోనే దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక నివేదికలో పేర్కొనడాన్ని ఆక్షేపించాయి. సమగ్ర అధ్యయనం చేశాక.. స్పష్టమైన నివేదిక ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణులను కోరుతూ లేఖ రాశాయి. దీనిపై స్పందించి అధ్యయనం చేసిన వారు.. సోమవారం పీపీఏకి సమగ్ర నివేదిక పంపారు.

2019, 2020ల్లో వచ్చిన భారీ వరద ప్రవాహాన్ని స్పిల్‌వేతో పాటు ప్రధాన డ్యాం ప్రాంతం మీదుగా వదిలేయడం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని అందులో స్పష్టం చేశారు. 2020లో వచ్చిన భారీ వరద ప్రవాహ సుడుల కారణంగా 485 మీటర్ల మేర వాల్‌కు నష్టం జరిగిందని.. గ్యాప్‌-2 ప్రాంతంలో భారీ గుంతలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఇలా దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు మరమ్మతు చేయడం కంటే.. కొత్తది నిర్మించడమే ఉత్తమమని తెలిపారు. ఈ దిశగా ఎప్పుడో నిర్ణయం తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మేఘా ఇంజనీరింగ్‌ సంస్థకు నిర్మాణ బాధ్యతను అప్పగించాయి కూడా.

మరిన్ని సూచనలివీ..

2023 జూలై 21న ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య బూడిద రంగులో ఉన్న బురదతో కూడిన సీపేజీని గుర్తించారు. ఈ బురద 7.91 మీటర్ల ఎత్తులో నిల్వ ఉంది. గత ఏడాది ఆగస్టు రెండో తేదీన 7.91 మీటర్లు, ఈ ఏడాది జూలై 21న 15.57 మీటర్లు, జూలై 22న 13.76 మీటర్లు, జూలై 29వ తేదీన 11.31 మీటర్ల మేర సీపేజీ వరద రెండు కాఫర్‌ డ్యాంల మధ్య నిల్వ ఉంది. ఈ సీపేజీని తగ్గించేందుకు పంపింగ్‌ ద్వారా డీవాటరింగ్‌ చేయాలని నిపుణులు పేర్కొన్నారు. ‘కొత్త వాల్‌ నిర్మాణం సందర్భంగా ఫ్లాక్సిస్‌, సిగ్మా, అన్సిస్‌ పరీక్షలు నిర్వహించాలి. దాని నిర్మాణం ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌కు దిగువ భాగాన నిర్మించాలి.

ఇప్పుడున్న వాల్‌ నిర్మాణ విధానాన్నే కొత్త వాల్‌కూ అనుసరించాలి. పొడి వాతావరణంలో, నేత చిత్తడిగా లేనప్పుడు దాని నిర్మాణం చేపట్టాలి’ అని సూచించారు. ఈ ఏడాది నవంబరులో మొదలుపెట్టి.. 2025 జూలైలోగా డయాఫ్రం వాల్‌ను నిర్మించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంచేసిన కార్యాచరణ ప్రణాళికను నిపుణులు ఆమోదించారు. ఒకే సీజన్‌లో వాల్‌ నిర్మాణం పూర్తి చేయడం మంచిదన్నారు. ప్రధాన డ్యాం నిర్మాణ సమయంలో.. జలసంఘం, పీపీఏ, కాంట్రాక్టు సంస్థ నిరంతరం చర్చించుకుంటూ సమన్వయంతో పనులు పూర్తి చేయాలని, డిజైన్లపై వర్క్‌షాపు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు.

Updated Date - Sep 25 , 2024 | 08:12 AM