యజ్ఞం చేస్తున్నాం..!
ABN , Publish Date - Sep 21 , 2024 | 04:39 AM
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టింది. ఇష్టారీతిన లూటీ చేశారు. ఏ శాఖపై సమీక్ష చేసినా అవినీతి, అక్రమాలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి.

రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సహకరించండి
ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు
వంద రోజుల్లో ఏమీ చేయలేదనే వారు..
తొలి 6 నెలల్లో ఒక్కటైనా మంచిపని చేశారా?
ఐదేళ్లలో భ్రష్టుపట్టించారు.. లూటీ చేశారు
ప్రతికూల ఆర్థిక పరిస్థితులను అధిగమించాం
కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాం
నా అనుభవంతో హామీల అమలుకు చర్యలు
పథకాల అమలుకు శ్రీకారం.. వచ్చే నెలలో
గ్రామ సభలు పెట్టి అర్హులందరికీ పెన్షన్లు
నంబర్ వన్ రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం
జనాభా నిర్వహణపై అందరూ దృష్టిపెట్టాలి
‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం
ఈ వంద రోజుల్లో ప్రధానంగా పింఛన్లు పెంచడంతోపాటు ఒకటో తేదీనే అందజేయడం, జగన్ మూసివేసిన అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, ఉచిత ఇసుక సరఫరా, మద్యం ధరల తగ్గింపు, మెగా డీఎస్సీ ప్రకటన వంటి అనేక ప్రజోపకరమైన పనులు చేపట్టాం.
- సీఎం చంద్రబాబు
ఒంగోలు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టింది. ఇష్టారీతిన లూటీ చేశారు. ఏ శాఖపై సమీక్ష చేసినా అవినీతి, అక్రమాలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. అప్పులకుప్పగా చేసి దివాలా తీయించారు. అలాంటి పరిస్థితి నుంచి తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు యజ్ఞం చేస్తున్నాం. దానికి ప్రజలందరూ సహకరించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ఆయన ప్రారంభించారు. తొలుత గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ ఆర్థిక, సామాజిక స్థితిగతులు, సమస్యలతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధి గురించి చంద్రబాబు తెలుసుకున్నారు. అనంతరం కూడలిలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వంద రోజుల పాలనలో తన అనుభవాన్ని ఉపయోగించి ఇచ్చిన హామీల అమలుకు, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ వంద రోజుల్లో ప్రతికూల ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో సంపద సృష్టిస్తూ పలు పథకాల అమలుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. దీపావళికి ఉచిత గ్యాస్ సరఫరా అమలు చేస్తామన్నారు. ఇన్ని కార్యక్రమాలను వంద రోజుల్లో చేస్తే ఏమి చేయలేదంటూ కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, వారి పాలనలో తొలి ఆరు నెలల్లో ఒక్క మంచిపనైనా చేశారా అని నిలదీశారు. ఇంకా ఏం చెప్పారంటే..
ఏ-1, ఏ-2 నుంచి పాలన తెలుసుకోవాలా?
నాకు పరిపాలన తెలియదని ఏ-2 (విజయసాయిరెడ్డి) అంటున్నాడు. ఇన్నేళ్ల రాజకీయ జీవితం, నాలుగోసారి సీఎం అయిన నేను ఏ-1, ఏ-2 నుంచి పాలన తెలుసుకోవాలా..? ప్రతి ఇంటికి లాభం జరగాలని, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. అందుకు కేంద్రం నుంచి కూడా సహకారం అందుతోంది. ఈ వంద రోజుల్లో కేంద్రం నుంచి రూ.15 వేల కోట్లు రాజధాని అమరావతికి, రూ.12,500 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు, రూ.5 వేల కోట్లు మూడు పారిశ్రామిక కేంద్రాలకు, విశాఖ రైల్వే జోన్ సాధించాం.గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో నిలిచిపోయిన కేంద్ర గ్రాంట్లను సాధించి పంచాయతీలకు ఇస్తున్నాం. పెన్షన్లు పెంచి ఇవ్వడమే కాక ప్రతి నెలా ఒకటిన ‘పేదల సేవలో’ పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు వారి ఇళ్లకు వెళ్లి మేమున్నామన్న భరోసా ఇస్తున్నారు. పేదల పట్ల మా ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు వచ్చే నెలలో రాష్ట్రమంతటా గ్రామసభలు నిర్వహిస్తాం. అదే సమయంలో అనర్హులకు తీసేస్తాం. వారికి సహకరించే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఉచిత ఇసుక సరఫరాకు కట్టుబడి ఉన్నాం. ఇసుక అందుబాటులో ఉన్న ప్రాంతాల వారు సొంత అవసరాల కోసం బండ్లు, ట్రాక్టర్లపై నిరంతరంగా తీసుకెళ్లవచ్చు. దగ్గరలో లేని వారు పేర్లు నమోదు చేసుకుని ప్రభుత్వం సూచించిన రవాణా, ఇతర చార్జీలు చెల్లించి తీసుకెళ్లవచ్చు.
ఆ హక్కు ఎవరిచ్చారు?
ప్రజలకు వారసత్వంగా వచ్చిన భూములు, పాసుపుస్తకాలపైనా జగన్ తన ఫొటో వేసుకున్నారు. ఆ హక్కు ఎవరిచ్చారు? మీరంటూ (ప్రజలు) కూటమిని గెలిపించకపోతే మీ ఆస్తులు మీ వద్ద ఉండేవే కావు. అందుకే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుచేశాం. రాజముద్రతో ఉన్న పుస్తకాలు అందజేస్తాం. నిరుద్యోగుల ఉపాధి, ఉద్యోగాల కల్పన కోసం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. తొలిగా మెగా డీఎస్సీ ప్రకటించాం. గతంలో జనాభా నియంత్రణకు విస్తృత ప్రచారం చేసిన నేను ప్రస్తుతం జనాభా పెంపునకు పిలుపిస్తున్నాను. సంతానోత్పత్తి రేటు 2.1 శాతం ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 1.6 శాతానికి పడిపోయింది. దీనివల్ల సమతుల్యత దెబ్బతింటుంది. చాలామంది డబుల్ ఇన్‌కం, నోకిడ్స్, ఎంజాయ్ ధోరణిలో పోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జనాభా నిర్వహణపై అందరూ దృష్టిసారించాలి. ప్రజల్లో దానిపై అవగాహన కల్పించాలి.
నేడు పార్టీ కార్యాలయానికి బాబు
అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఇక్కడి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన వస్తారని టీడీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. సందర్శకులను కలవడంతోపాటు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారని పేర్కొన్నాయి. విజయవాడ వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యల స్వీయ పర్యవేక్షణలో ఉన్న సీఎం చంద్రబాబు.. రెండు వారాలుగా పార్టీ కార్యాలయానికి రాలేకపోయారు.
భవిష్యత్‌కు బాబు భరోసా
మద్దిరాలపాడులో 3 పేద కుటుంబాలతో భేటీ
ముస్లిం మహిళకు అప్పటికప్పుడు 65,150కి చెక్కు
నాగులుప్పలపాడు సెప్టెంబరు 20: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు శుక్రవారం ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు వచ్చిన సీఎం చంద్రబాబు.. మూడు పేద కుటుంబాలను కలిశారు. వారితో మాట్లాడి కుటుంబ స్థితిగతులను తెలుసుకున్నారు. తొలుత ముస్లిం కాలనీకి చెందిన పఠాన్ ఖాజావలీ, బీబీసారా ఇంటికి వెళ్లారు. బీబీసారా మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణానికి రెండు బిల్లులు మంజూరయ్యాయని, మిగిలిన మొత్తం ఆగిపోయాయని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కుమారుడు, కుమార్తె చదువు మధ్యలో మానేసి పనికి వెళ్తున్నారని సీఎం దృష్టికి చెప్పగా.. ఇంటినిర్మాణ బిల్లుల మొత్తం రూ.65,150కి అప్పటికప్పుడు చెక్కు అందజేశారు. ఇద్దరు పిల్లల చదువులకు హామీ ఇచ్చారు. జీవనోపాధికి కుట్టుమిషన్ అందించాలని కలెక్టర్‌కు సూచించారు. దివ్యాంగుడికి బ్యాటరీ వీల్ చైర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తర్వాత కల్లుగీత కార్మికుడు ఆలుదాసు శ్రీను, రేణుక ఇంటికి సీఎం వెళ్లారు. తమకు నివాసగృహం మంజూరుచేయాలని, ఇద్దరు పిల్లల చదువులకు ప్రభుత్వ సాయం అందేలా చూడాలని వారు కోరారు. నూతన మద్యం పాలసీ విధానంలో భాగంగా కల్లుగీత కార్మికుల కోటాలో మద్యం దుకాణం మంజూరు చేయాలని కోరగా తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
క్రమం తప్పకుండా పెన్షన్ వస్తోంది
అనంతరం చిన్నకారు రైతు తాళ్లూరి శ్రీనివాసరావు ఇంటికి సీఎం వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛను అందుతోందా అని శ్రీనివాసరావు తల్లిని అడిగారు. అమ్మకు ప్రతినెలా అందుతోందని అతడు చెప్పారు. బీబీసారా కుటుంబంతో మాట్లాడేందుకు వెళుతున్న సీఎంను ముస్లిం కాలనీకి చెందిన షేక్ జిలానీ అనే మహిళ మధ్యలో ఆపి.. తమ రేకుల ఇల్లు దెబ్బతిని, వర్షాలకు నీరు చేరుతోందని, పక్కా ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంది. మురుగు కాలువల్లో పాములు తిరుగుతూ తమ నివాసాల్లోకి వస్తున్నాయని, భయంతో గడపాల్సి వస్తోందని చెప్పింది. అన్ని సమస్యలూ పరిష్కరిస్తానని.. తనలాగా గత సీఎం ఎప్పుడైనా ప్రజల మధ్యకు వచ్చాడా అని ప్రశ్నిస్తూనే సదరు మహిళ వివరాలను నమోదు చేసుకుని ఇల్లు మంజూరుచేయాలని కలెక్టర్‌కు సూచించారు. ‘ఇది మంచి ప్రభుత్వం’లో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, మంత్రులు డాక్టర్ డీఎ్‌సబీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.