Share News

YCP: వైసీపీ పార్టీ ఆఫీసుల వెనక జగన్మాయ..!!

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:17 AM

వైసీపీ కార్యాలయాల నిర్మాణాల వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. భూముల కేటాయింపు నుంచి నిర్మాణాల వరకు అడ్డగోలుగా వ్యవహరించారని స్పష్టమవుతోంది.

 YCP: వైసీపీ పార్టీ ఆఫీసుల వెనక జగన్మాయ..!!
jagan

పార్టీ ఆఫీసుల వెనుక జగన్మాయ!

జగన్‌ ఆఫీసుకు ఓనర్‌ రాంకీ సంస్థ

తెర వెనుక భారీ ‘క్విడ్‌ ప్రో కో’ ఆరోపణలు

జగన్‌ ప్రభుత్వంలో మేళ్లు పొందిన కంపెనీలు

సొంత డబ్బుతో రాంకీ ద్వారా నిర్మాణాలు?

అనుమతుల్లేకుండా మహళ్ల నిర్మాణం

900 కోట్ల భూములు కారుచౌకగా లీజుకు

మున్సిపల్‌ నివేదిక సాక్షిగా వెల్లడైన నిజం

అత్యధిక నిర్మాణాలు చేపట్టిందీ రాంకీనే

తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి

రికార్డుల్లో లేని కాంట్రాక్టు ఒప్పందాలు

లెక్కల్లో చూపని వ్యయం వివరాలు

అయినా ఆ సంస్థ ఫ్రీగా ఎందుకు కడుతున్నట్టు?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ కార్యాలయాల నిర్మాణాల వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. భూముల కేటాయింపు నుంచి నిర్మాణాల వరకు అడ్డగోలుగా వ్యవహరించారని స్పష్టమవుతోంది. నిబంధనల ఉల్లంఘనే గాక తెర వెనుక సాగిన ‘క్విడ్‌ ప్రో కో’ అంశం తెర మీదకు వస్తోంది. తాడేపల్లిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు శనివారం కూల్చివేసిన సంగతి తెలిసిందే. ‘వైసీపీ ఆఫీసు ’ను కూల్చివేశారని జగన్‌ రోత పత్రిక కూడా గగ్గోలు పెట్టింది. అక్రమ కట్టడానికి సంబంధించి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ తనిఖీ నివేదిక, ఇచ్చిన నోటీసులో దాని యజమాని రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అని పేర్కొనడం వైసీపీ ఆఫీసుల వెనుక పెద్ద బాగోతమే ఉందని చెప్పకనే చెప్పింది. యజమాని రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అయితే.. వైసీపీ ఆఫీసు పేరిట దాన్ని ఎందుకు కడుతున్నట్టు? నిబంధనలన్నీ గాలికొదిలి స్థలాన్ని కేటాయించిందేమో వైసీపీ ఆఫీసు కోసం కానీ యజమానిగా ఉన్నదేమో రాంకీ సంస్థ. ఇదెలా సాధ్యమైంది? రాంకీకి ఆ స్థలాన్ని వైసీపీ అమ్మేసిందా? లేదా సబ్‌ లీజుకు ఇచ్చిందా? నిర్మాణ ఒప్పందం మేరకు అప్పగించిందా? అలా ఇస్తే ఆ ఒప్పందం ఎక్కడ? వ్య వహారం ఇక్కడితో అయిపోలేదు. జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణ పనులను దాదాపు రాంకీ సంస్థే చేపడుతోంది. కాంట్రాక్టు ఇచ్చినట్టుగా ఎలాంటి రికార్డులు లేవు. అయినా రూ.వందల కోట్ల వ్యయంతో రాంకీ సంస్థ వైసీపీ కార్యాలయ భవనాలను సొంత ఖర్చుతో ఎందుకు నిర్మించి ఇస్తోంది? ఏ ప్రయోజనాలు ఆశించి ఇలా చేస్తోంది? లేదా ముందే పొందిన ప్రయోజనాలకు ప్రతిగా ‘క్విడ్‌ ప్రో కో’ తతంగం సాగుతోందా?


రాంకీనే ఎందుకు?

రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ పార్టీ అడ్డగోలుగా కార్యాలయాలు నిర్మిస్తోంది. సుప్రీం కోర్టు, గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా నీటి కుంటలు, చెరువులు కూడా నామమాత్రపు లీజుల పేరిట ధారాదత్తం చేసేసింది. అనుమతులు తీసుకోకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతోంది. ఆయా శాఖల అనుమతులు, పంచాయతీలు, మున్సిపాలిటీల అనుమతులు, లీజు ఒప్పందాలు లేకుండా ఆఫీసుల నిర్మాణం చేపట్టారు. భవనాల్లో అత్యధిక శాతం రాంకీ గ్రూప్‌తో నిర్మాణం చేయిస్తున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడైన అయోధ్య రామిరెడ్డికి చెందిన సంస్థే ఈ రాంకీ. వైసీపీ ఎంపీ అయినంత మాత్రాన ఆ పార్టీ ఆఫీసులను సొంత ఖర్చుతో నిర్మించాల్సిన అవసరం లేదు. ఇదే అసలు ట్విస్ట్‌. జగన్‌ తీసుకున్న అనేకానేక నిర్ణయాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందిన పెద్దలు రాంకీ ద్వారా వైసీపీ ఆఫీసుల నిర్మాణం కోసం చేయూతనిచ్చినట్టు తెలుస్తోంది. అంటే.. క్విడ్‌ ప్రో కో అన్న మాట. మొన్నటిదాకా అధికారాన్ని అనుభవించిన వైసీపీ సొంతంగా ఆఫీసులు ఎందుకు కట్టుకోలేకపోయింది? ఓ కంపెనీతో ఎందుకు నిర్మాణాలు చేయిస్తోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే క్విడ్‌ ప్రో కో బయటికొస్తోంది. ఆఫీసుల నిర్మాణం కోసం భూములు తీసుకున్న వైసీపీ ఆ పనులు చేపట్టాలి. వాటిని తన వార్షిక ఆర్థిక పురోగతి నివేదికలో చూపించుకోవాలి. ఆదాయ పన్ను రిటర్న్స్‌లో పేర్కొనాలి. వైసీపీ ఆ పనిచేయలేదు. 2022లో రూ.183 కోట్లుగా ఉన్న ఆస్తులను 2023 మా ర్చి నాటికి రూ.167 కోట్లకు తగ్గినట్లుగా చూపించింది. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములు, నిర్మాణాలు, వ్యయం వివరాలేవీ ప్రస్తావించలేదు. 2022 నుంచే వైసీపీకి భూముల కేటాయింపు, ఆఫీసుల నిర్మా ణం జరుగుతోంది. అయినా ఆదాయపన్ను వివరాల్లో గోప్యంగా ఉంచారు. వైసీపీ వద్ద రిజర్వ్‌ నిధులు రూ.వందల కోట్లున్నాయి. వాటితోనే ఆ పార్టీ సొంతంగా ఆఫీసుల నిర్మాణం చేపట్టవచ్చు. వైసీపీకి బదులుగా రాంకీ గ్రూప్‌ చేపడుతోంది. ఆ సంస్థ ఆఫీసులు నిర్మించాలని వైసీపీ కాంట్రాక్టు ఒప్పందాలు చేసుకోలేదు. అలాంటివేవీ రిజిస్టర్‌ కాలేదు.


ఇది ‘క్విడ్‌ ప్రో కో’నే

రాష్ట్రవ్యాప్తంగా అధికారిక సమాచారం ప్రకారం 11 జిల్లాల్లో ఆఫీసులను వైసీపీకి బదులు రాంకీ గ్రూప్‌ నిర్మిస్తోంది. ఆ సంస్థ ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి వ్యయం చేస్తోంది? ఉదారంగా ఆఫీసులు నిర్మిచేంత బడ్జెట్‌ ఆ సంస్థ వద్దలేదు. మరి ఆ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడే మతలబు ఉంది. జగన్‌ నుంచి వివిధ రకాల మేళ్లు పొందిన కంపెనీలు, సంస్థలు నేరుగా పార్టీ ఆఫీసులు కడితే వెంటనే తెలిసిపోతుంది. లేదా ఎలక్టోరల్‌ బాండ్స్‌, ఇతర రూపంలో నిధులు ఇచ్చినా గుట్టు రట్టవుతుంది. మధ్యేమార్గంగా రాంకీ సంస్థను ముందుపెట్టి, ఆయా కంపెనీల నిధులతో నిర్మాణాలు చేపడితే.. చేతికి మట్టి అంటదు. సరిగ్గా ఇదే ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. దీన్నే క్విడ్‌ ప్రోకో అంటారు. ప్రభుత్వం నుంచి మేళ్లు పొందినందుకు ప్రతిఫలంగా పరోక్షంగా డబ్బులు సమకూర్చడం. ఈ విద్యను ప్రదర్శించడంలో జగన్‌ ఆరితేరారని సీబీఐ అనేక కేసుల్లో వెల్లడి చేసింది. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా.. ‘మా పార్టీ రాజ్యసభ సభ్యుడి కంపెనీ మా ఆఫీసుల నిర్మాణం చేస్తోంది? ఇందులో మీకొచ్చిన నష్టం ఏమిటి’ అని తెలివిగా తప్పించుకోవచ్చు. ఇది జగన్‌ మాస్టర్‌ మైండ్‌.


కారుచౌకగా ఖరీదైన భూములు

రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు, ప్రధాన పట్టణాలు, నగరాల్లో జగన్‌ ప్రభుత్వం వైసీపీ ఆఫీసుల కోసం 2 ఎకరాల చొప్పున అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను కట్టబెట్టింది. ఇందులో నిషేధిత భూములు, ప్రభుత్వ ప్రయోజనాల కింద 22(ఏ)లో ఉంచిన భూములు, సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఉన్నవి, చెరువు భూ ములు, ఎయిర్‌పోర్టుల కోసం సేకరించి రిజర్వ్‌ చేసిన భూములున్నాయి. మార్కెట్‌ రేటు ప్రకారం ఆ భూముల విలువ 900 కోట్ల పైమాటే అని రెవెన్యూ వర్గాల అంచనా. వాటిని లీజు పేరిట కారుచౌక ధరకు వైసీపీకి జగన్‌ కట్టబెట్టారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కేటాయింపునకు వీలుకాని భూములను ఏపీఎల్‌ఎమ్‌ఏలో ఆమోదింపచేసి లాక్కున్న వైనం బయటపడింది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం తాడేపల్లిలోని సెంట్రల్‌ ఆఫీసే. వందల కోట్ల విలువైన భూ ములను తీసుకొని వాటికి ఏటా వందల రూపాయల్లో లీజు ఫీజు చెల్లించేలా అనుకూల ఉత్తర్వులు రెవెన్యూ నుంచి తీసుకున్నారు. దేశంలో ఇలాంటి భూముల లీజులు మరెక్కడా చోటు చేసుకోలేదని నిపుణులు చెబుతున్నారు.


ఇది తీవ్రమైన నేరం కాదా?

తాడేపల్లిలో వైసీపీ సెంట్రల్‌ ఆఫీసు కోసం ఇరిగేషన్‌ శాఖకు చెందిన అత్యంత ఖరీదైన భూమిని ఇచ్చారు. రెవెన్యూ శాఖ జీఓ 52తో ఆ భూమిని కేటాయించినా దానికి ఇరిగేషన్‌ శాఖ అనుమతి తప్పనిసరి అని చెప్పింది. ఆ భూమి ఇచ్చేది లేదని ఇరిగేషన్‌ విభాగం స్పష్టంగా చెప్పింది. దీంతో భూకేటాయింపు చట్టప్రకారం చెల్లదు. అయినా సరే ఆఫీసు నిర్మాణం చేశారు. ఇది చట్టవ్యతిరేకమని జగన్‌కు తెలియదా? లీజు ప్రాతిపదికన వైసీపీకి కేటాయించిన భూమిపై గుంటూరు జిల్లా అధికార వ్యవస్థతో లిఖిత ఒప్పందం చేసుకోవాలి. ఇరిగేషన్‌తో ఒప్పందం చేసుకోవాలి. అవేవీ చేయలేదు. అయినా ఆఫీసు నిర్మాణం చేస్తున్నారు. ఇది నేరం కాదా? గుంటూరు కలెక్టర్‌గా ఉన్న వేణుగోపాల్‌రెడ్డికి ఈ మాత్రం తెలియదా? లీజు ఒప్పందం లేకుండా ఆఫీసు నిర్మాణం చేయకూడదని ఆయన ఎందుకు వైసీపీకి నోటీసు ఇవ్వలేదు? దీన్నిబట్టి ఆ పార్టీకి ఆయన కొమ్ముకాశారని ఇప్పుడు స్పష్టమవుతోంది.


రాంకీ నిర్మిస్తున్న ఆఫీసులివే

తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్‌ ఆఫీసు భారీ వ్యయంతో రాంకీ గ్రూప్‌ నిర్మిస్తోంది. తాడేపల్లి నగర పాలక సంస్థ తనిఖీ రిపోర్టులో ఆ భవన యజమానిగా రాంకీ ఇన్‌ఫ్రాను చేర్చింది.

విశాఖలో వైసీపీ భవన నిర్మాణం. వ్యయం 2 కోట్ల నుంచి 4 కోట్లకు చేరుకోనుందని అంచనా.

అనకాపల్లిలో పార్టీ ఆఫీసు

అన్నమయ్య జిల్లా పార్టీ ఆఫీసు. నిర్మాణ వ్యయం 2.75 కోట్ల రూపాయలు. ఇప్పటికే 1.75 కోట్ల పనులు పూర్తిచేశారు.

బాపట్ల, పశ్చిమగోదావరిలో ఆఫీసులు

నరసారావుపేట కార్యాలయం. నిర్మాణ వ్యయం 2 కోట్ల రూపాయలపైనే

కర్నూలు, నెల్లూరు, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లోని ఆఫీసులను ఈ సంస్తే నిర్మిస్తోంది. రాంకీ ఇంజనీర్లు ఆయా సైట్ల వద్ద నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 07:17 AM