వికసిత్ భారత్‌కు ఆరంచెల వ్యూహం ఈ ఏడాది వృద్ధి 6.5%
ABN , Publish Date - Jul 23 , 2024 | 05:39 AM
ద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2024-25)కి వృద్ధి రేటు అంచనాను కుదించింది. ప్రపంచంలో పెరిగిన భౌగోళిక, రాజకీయ సంఘర్షణల ప్రభావం వృద్ధి రేటుపై పడుతుందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరపు వృద్ధి రేటు అంచనాను 6.5 శాతం నుంచి 7 శాతానికే పరిమితం...
ద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2024-25)కి వృద్ధి రేటు అంచనాను కుదించింది. ప్రపంచంలో పెరిగిన భౌగోళిక, రాజకీయ సంఘర్షణల ప్రభావం వృద్ధి రేటుపై పడుతుందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరపు వృద్ధి రేటు అంచనాను 6.5 శాతం నుంచి 7 శాతానికే పరిమితం చేసింది. వడ్డీ రేట్లను నిర్ణయించే సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకూడదని సూచించింది. ఆర్థిక వ్యవస్థలో మరిన్ని ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదంటూ ఎగుమతులు ఉత్తేజితం చేయడానికి చైనా నుంచి మరిన్ని ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణకు మద్దతు ప్రకటించింది. ప్రస్తుత అమృత కాలానికి, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు ఆరంచెల వ్యూహాన్ని ప్రతిపాదించింది. ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ రూపొందించిన 2023-24 ఆర్థిక సర్వే నివేదికను ఆర్థిక మంత్రి నిర్మల సోమవారం పార్లమెంటుకు సమర్పించారు. విభిన్న అంశాలపై ఆర్థిక సర్వే ప్రకటించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
వృద్ధికి ప్రపంచ సవాళ్ల అవరోధం
ఈ ఏడాది వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం మధ్యన ఉండవచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 8.2 శాతం వృద్ధిరేటు కన్నా ఇది తక్కువే. అలాగే ఆర్‌బీఐ ప్రకటించిన అంచనా 7.2 శాతం కన్నా కూడా తక్కువ. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉండవచ్చని వాతావరణ పరిశోధనా శాఖ అంచనా. నైరుతి రుతుపవనాల గమనం ఇప్పటివరకు సంతృప్తికరంగానే ఉంది. దీనివల్ల వ్యవసాయ రంగం పనితీరు మెరుగుపడి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండు పెరగవచ్చు. జీఎ్‌సటీ, ఐబీసీ వంటి వ్యవస్థాత్మక సంస్కరణలు కూడా సత్ఫలితాలనిస్తున్నాయి. అయితే ప్రపంచ స్థాయిలో పెరిగిన భౌగోళిక, రాజకీయ సంఘర్షణలు వృద్ధికి సవాలు విసురుతున్నాయి. వీటి ప్రభావం వల్ల సరఫరా వ్యవస్థలో అంతరాయాలు పెరగవచ్చు. కమోడిటీ ధరలు కూడా పెరిగి ద్రవ్యోల్బణ ఒత్తిడులకు కారణం కావచ్చు. ఫలితంగా ద్రవ్య విధాన సడలింపు సైతం జాప్యం అయ్యే ఆస్కారం ఉంది.
రిటైల్ ఇన్వెస్టర్ల హల్‌చల్...తస్మాత్ జాగ్రత
స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరిగింది. రిటైల్ భాగస్వామ్యం పెరగడం మాత్రం ఆహ్వానించదగ్గ అంశమే. దీని వల్ల వారు పొదుపు మొత్తాలపై అధిక రాబడులు పొందగలుగుతారు. వారి రాకతో పెట్టుబడి మార్కెట్లలో స్థిరత్వం వచ్చినా వాస్తవిక మార్కెట్ పరిస్థితులతో ప్రమేయం లేకుండా అధిక రాబడులకు ఆశ పడి అతి విశ్వాసంతో పెట్టుబడులు పెడుతూ పోవడం మాత్రం ఆందోళనకరం. ప్రధానంగా డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో వారి ఆసక్తి పెరిగడంపై ఒక కన్నేసి ఉంచాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ నగదు విభాగం టర్నోవర్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 35.9 శాతానికి పెరిగింది. దేశంలోని రెండు డిపాజిటరీల వద్ద నమోదైన డీమ్యాట్ ఖాతాల సంఖ్య 1145 లక్షల (2022-23 ఆర్థిక సంవత్సరం) నుంచి 1514 లక్షల కోట్లకు (2023-24 ఆర్థిక సంవత్సరం) పెరిగింది. ఎన్‌ఎ్‌సఈలో నమోదైన ఇన్వెస్టర్ల సంఖ్య 2020 మార్చితో పోల్చితే 2024 మార్చి 31 నాటికి 9.2 కోట్లకు పెరిగింది. అంటే 20 శాతం మంది గృహస్థులు తమ పొదుపును ఆర్థిక మార్కెట్లకు తరలించారు. ‘‘ఈ పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాలి. మితిమీరిన విశ్వాసంతో స్పెక్యులేషన్‌కు పాల్పడే ప్రమాదం అధికంగా ఉంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి’’. ప్రధానంగా మ్యూచువల్ ఫండ్ల మార్గంలో రిటైల్ భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. 2024లో ఎంఎ్‌ఫల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.14 లక్షల కోట్లు (35 శాతం)పెరిగి రూ.53.4 లక్షల కోట్లకు చేరింది.
డెరివేటివ్స్ జోలికి పోవద్దు
మానవుల్లో సహజసిద్ధంగా ఉండే జూద లక్షణంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఎఫ్ అండ్ ఓ విభాగంలో ప్రవేశిస్తున్నారు. అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న భారత్ వంటి వర్థమాన దేశంలో స్పెక్యులేటివ్ వ్యాపారాలకు తావుండకూడదు. స్టాక్ మార్కెట్లలో ఏ మాత్రం కరెక్షన్ ఏర్పడినా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఎవరో కనిపించని వ్యక్తులు తమను మోసం చేశారన్న భావన వారిలో పెరిగి దీర్ఘకాలం పాటు పెట్టుబడి మార్కెట్ల వైపు చూడకపోవచ్చు.
భారత వృద్ధిలో మార్కెట్ల పాత్ర కీలకం
భారత వృద్ధి గాధలో పెట్టుబడి మార్కెట్ల పాత్ర కీలకంగా ఉంది. భారత మార్కెట్ అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలను తట్టుకుంటూ పురోగమిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన మార్కెట్‌గా భారత మార్కెట్ ఉంది. బీఎ్‌సఈ సెన్సెక్స్, ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు అందించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 26.8 శాతం, సెన్సెక్స్ 25 శాతం వృద్ధిని నమోదు చేశాయి. భారత మార్కెట్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యంగా ప్రపంచ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. పబ్లిక్ ఇష్యూల జారీ కార్యకలాపాలు కూ డా నిలకడగా సాగుతూ ఉండడంతో మార్కెట్ విలువపరంగా భారత మార్కెట్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మే నెలలో ఈక్విటీ మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.415 లక్షల కోట్లు) మైలురాయిని తాకింది.
గత ఐదేళ్ల కాలంలో భారత జీడీపీలో మార్కెట్ విలువ వాటా 124 శాతానికి పెరిగింది. భారత మార్కెట్లో వృద్ధి అన్ని ఉప విభాగాలకు విస్తరించడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో 9.5 కోట్ల మంది రిటైల్ ఇన్వెస్టర్లున్నారు. వారంతా కలిసి 2,500 లిస్టెడ్ కంపెనీల్లో 10 శాతం ప్రత్యక్ష వాటా కలిగి ఉన్నారు. దేశీయంగా ఆర్థిక స్థితి మెరుగ్గా ఉండడం, సానుకూల పెట్టుబడి వాతావరణం నేపథ్యంలో 2023-24లో పెట్టుబడుల సమీకరణ రూ.10.9 లక్షల కోట్ల స్థాయిలో ఉంది.
ఆహార ద్రవ్యోల్బణంపై ఫోకస్ తగ్గించాలి
వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునే సమయంలో ఆర్‌బీఐ ఆహార ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకునే వైఖరి మార్చుకోవాలి. అధిక ఆహార ధరల నుంచి పేదలకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం ఫుడ్ కూపన్లు, ప్రత్యక్ష నగదు బదిలీ వంటి అవకాశాలు అన్వేషించాలి. ఆహార ధరలను మినహాయించి ఇతర విభాగాల్లో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం మంచిది. తయారీ రంగంలో ద్రవ్యోల్బణం 2023-24 సంవత్సరంలో నాలుగు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి తగ్గింది. మెరుగైన నిల్వల నిర్వహణ, ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు, నిత్యావసర వస్తువులపై సబ్సిడీ, వాణిజ్య విధాన చర్యల ద్వారా ఆహార ద్రవ్యోల్బణాన్ని చాలా వరకు అదుపులో ఉంచగలిగారు.