Share News

బీటీ గ్రూప్‌లో భారతికి 24.5% వాటా

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:49 AM

టెలికాం దిగ్గజం సునీల్‌ భారతి మిట్టల్‌ నాయకత్వంలోని భారతి ఎంటర్‌ప్రైజెస్‌ తన కార్యకలాపాలను బ్రిటన్‌కు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఆ దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌, మొబైల్‌ టెలికాం సేవలు అందించే బ్రిటిష్‌ టెలికాం (బీటీ) గ్రూప్‌లో...

బీటీ గ్రూప్‌లో భారతికి  24.5% వాటా

బీటీ గ్రూప్‌లో భారతికి 24.5% వాటా

డీల్‌ విలువ రూ.33,590 కోట్లు

  • రెండో అతిపెద్ద వాటాదారుగా కంపెనీ జూ బ్రిటన్‌కు కార్యకలాపాలు విస్తరించిన సునీల్‌ మిట్టల్‌

న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం సునీల్‌ భారతి మిట్టల్‌ నాయకత్వంలోని భారతి ఎంటర్‌ప్రైజెస్‌ తన కార్యకలాపాలను బ్రిటన్‌కు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఆ దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌, మొబైల్‌ టెలికాం సేవలు అందించే బ్రిటిష్‌ టెలికాం (బీటీ) గ్రూప్‌లో 24.5 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఆల్టైస్‌ యూకే అనే సంస్థ నుంచి భారతి గ్రూప్‌ ఈ వాటాను కొనుగోలు చేసింది. అయితే ఇందుకు ఎంత మొత్తం ఖర్చు చేసిందీ కంపెనీ వెల్లడించలేదు. మార్కెట్‌ వర్గాలు మాత్రం ఈ డీల్‌ విలువ ఎంత లేదన్నా 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.33.590 కోట్లు) వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాయి. డీల్‌లో భాగంగా బీటీ గ్రూప్‌ విలువను 15,000 కోట్ల డాలర్లుగా లెక్కించారు.


డీల్‌ విజయవంతమైతే ఒక భారతీయ కంపెనీ.. విదేశాల్లో ఇంత పెద్ద మొత్తం పెట్టుబడిగా పెట్టడం ఇదే మొదటిసారి అవుతుంది. భారతి ఎంటర్‌ప్రైజెస్‌ తన అనుబంధ సంస్థ భారతి గ్లోబల్‌ ద్వారా ఈ కొనుగోలు జరిగింది. ఈ డీల్‌తో బీటీ గ్రూప్‌లో భారతి గ్రూప్‌ రెండో అతిపెద్ద వాటాదారుగా అవతరించనుంది. కాగా పెట్టుబడి లాభాల కోసమే బీటీ గ్రూప్‌లో వాటా కొనుగోలు చేసినట్లు భారతి ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది.

అరుదైన అవకాశం

‘బీటీ గ్రూప్‌లో ఇంత పెద్ద వాటా కొనుగోలు చేయడం అరుదైన అవకాశం’ అని సునీల్‌ మిట్టల్‌ కుమారుడు, భారతి గ్లోబల్‌ కంపెనీ ఎండీ శ్రవిన్‌ భారతి మిట్టల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక ఇన్వెస్టర్‌గా బీటీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. భారతి గ్రూప్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ కూడా ఈ కొనుగోలుపై హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది ఆకర్షణీయమైన దీర్ఘకాలిక పెట్టుబడి కొనుగోలు’ అన్నారు. హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌, ఫైబర్‌, మొబైల్‌, ఎంటర్‌ప్రైజెస్‌ ఆఫరింగ్‌ రంగాల్లో బీటీ గ్రూప్‌నకు మంచి పట్టు ఉన్న విషయాన్ని సునీల్‌ మిట్టల్‌ గుర్తు చేశారు. బీటీ కంపెనీ, యూకే మార్కెట్‌ను లోతుగా అర్థం చేసుకోవడమే ప్రస్తుతం తమ ప్రాధాన్యత అన్నారు. ఐరోపా దేశాల టెలికాం రంగంలో అవకాశం వస్తే, భవిష్యత్‌లో మరిన్ని కొనుగోళ్లకూ తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.


టాటా, మహీంద్రా సరసన భారతి గ్రూప్‌

భారత కంపెనీలు బ్రిటిష్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కొత్తేమీ కాదు. టాటా గ్రూప్‌ ఇప్పటికే ఆ దేశ ఆటోమొబైల్‌, స్టీల్‌ రంగాల్లో ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన న్యూ ఎనర్జీ సోలార్‌ లిమిటెడ్‌ అనే అనుబంధ సంస్థ ద్వారా బ్రిటన్‌కి చెందిన బ్యాటరీ టెక్‌ కంపెనీ ఫరాడియాన్‌ లిమిటెడ్‌ను 13.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్‌ బ్రాండ్స్‌ కూడా ఆ దేశానికి చెందిన ప్రముఖ టాయ్స్‌ స్టోర్‌ చెయిన్‌ హామ్లే్‌సను 2019లోనే కొనుగోలు చేసింది. విప్రో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, వెల్‌స్పన్‌, టీవీఎస్‌ గ్రూప్‌లు.. బ్రిటన్‌కు చెందిన బీఎ్‌సఏ, నార్టన్‌ కంపెనీలను కొనుగోలు చేశాయి. తాజాగా భారతి ఎంటర్‌ప్రైజెస్‌ ఈ కంపెనీల సరసన చేరింది.

Updated Date - Aug 13 , 2024 | 04:49 AM