Share News

పబ్లిక్‌ ఇష్యూకి ప్రీమియర్‌ ఎనర్జీస్‌

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:22 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సోలార్‌ సెల్‌ కంపెనీ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలు..

పబ్లిక్‌ ఇష్యూకి ప్రీమియర్‌ ఎనర్జీస్‌

రూ.1,500 కోట్ల సమీకరణకు సన్నాహాలు

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సోలార్‌ సెల్‌ కంపెనీ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వస్తోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా రూ.1,500 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయటంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 2.82 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)లో కంపెనీ పేర్కొంది. ఓఎ్‌ఫఎ్‌సలో భాగంగా సౌత్‌ ఏషియా గ్రోత్‌ ఫండ్‌ 2 హోల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌సీ 2.38 కోట్ల షేర్లు, సౌత్‌ ఏషియా ఈబీటీ ట్రస్ట్‌ 1.53 లక్షల ఈక్విటీ షేర్లు, ప్రమోటర్‌ చిరంజీవ్‌ సింగ్‌ సలూజా 43 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌లో భాగంగా కంపెనీ రూ.300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఒకవేళ ప్రీ-ఐపీఓ ద్వారా నిధులు సమీకరిస్తే కొత్త ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సమీకరించే మొత్తం రూ.1,168 కోట్లకు తగ్గనుంది. ఈ ఇష్యూకి కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

హైదరాబాద్‌లో కొత్త ప్లాంట్‌ ఏర్పాటు: పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ అనుబంధ సంస్థ ప్రీమియర్‌ ఎనర్జీస్‌ గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టడంతో పాటు 4గిగావాట్స్‌ సోలార్‌ పీవీ టాప్‌కాన్‌ (టన్నెల్‌ ఆక్సైడ్‌ ప్యాసివ్డ్‌ కాంట్రాక్ట్‌) ఏర్పాటుకు అవసరమైన నిధులు అందించటం సహా హైదరాబాద్‌ 4 గిగావాట్ల సోలార్‌ పీవీ టాప్‌కాన్‌ మాడ్యుల్‌ తయారీ కేంద్రం ఏర్పాటుకు వెచ్చించనుంది. మిగిలిన మొత్తాలను సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనుంది.

1995లో ఏర్పాటైన ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సమీకృత సోలార్‌ సెల్‌, మాడ్యుల్‌ తయారీదారుగా ఉంది. ప్రస్తుతం కంపెనీ 2 గిగావాట్స్‌ సెల్స్‌ ఉత్పత్తి సామర్థ్యంతో పాటు 3.36 గిగావాట్స్‌ మాడ్యుల్స్‌ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్‌గా ఈపీసీ సొల్యూషన్స్‌, ఓ అండ్‌ ఎం సర్వీసులను అందిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో మొత్తం ఐదు ప్లాంట్స్‌ను నిర్వహిస్తోంది.

Updated Date - Apr 21 , 2024 | 04:22 AM