కన్నీళ్లు పెట్టిన చల్లగరిగ..
ABN , Publish Date - Apr 20 , 2024 | 10:01 AM
ఇటీవల ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కాంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్, దాసరివాడ సుమన అలియాస్ రజితల అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి.
- ముగిసిన మావోయిస్టు దంపతుల అంత్యక్రియలు
చిట్యాల, ఏప్రిల్ 19: ఇటీవల ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కాంకేర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్, దాసరివాడ సుమన అలియాస్ రజితల అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. సుధాకర్ స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగలో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. 24 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన సుధాకర్... అతని భార్య విగతజీవులుగా ఇంటికి రావడంతో ఆత్మీయులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆదిలాబాద్ జిల్లా బజర్ అత్నూర్ మండలం డేడ్రాకు చెందిన సుమన తల్లి, సోదరులు కడసారి చూపుకోసం చల్లగరిగకు చేరుకున్నారు. కాగా, ఎన్‌కౌంటర్ జరిగిన రెండు రోజుల వరకు స్థానిక పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో గురువారం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కాంకేర్ జిల్లాకు వెళ్లి ఇద్దరి మృతదేహాలను చల్లగరిగకు తీసుకువచ్చారు. అంత్యక్రియల్లో పలువురు ప్రజాసంఘాల, పౌర హక్కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.