Share News

‘మహా’ యుద్ధంలో గెలుపు ఎవరిది?

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:46 AM

హరియాణా ఎన్నికల ఫలితాల తర్వాత సర్వేలు నిర్వహించేవారు చాలా స్తబ్దంగా కనపడుతున్నారు. నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర ఎన్నికల గురించి అడిగితే చాలా ఆచితూచి స్పందిస్తున్నారు. సర్వేలు నిర్వహించేవారు మాత్రమే కాదు...

‘మహా’ యుద్ధంలో గెలుపు ఎవరిది?

హరియాణా ఎన్నికల ఫలితాల తర్వాత సర్వేలు నిర్వహించేవారు చాలా స్తబ్దంగా కనపడుతున్నారు. నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర ఎన్నికల గురించి అడిగితే చాలా ఆచితూచి స్పందిస్తున్నారు. సర్వేలు నిర్వహించేవారు మాత్రమే కాదు, ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించేవారికి కూడా ఏమీ అంతుబట్టడం లేదు. మహారాష్ట్రలో వారు యథా ప్రకారం ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించే సాహసం చేస్తారా లేదా అన్నది చెప్పలేం. హరియాణాలో బీజేపీ హ్యట్రిక్ సాధిస్తుందని ఒక్క సర్వే కానీ, ఎగ్జిట్‌పోల్స్ కానీ వెల్లడించలేదు. అదే విధంగా జమ్ముకశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా వేసినవారు కూడా నేషనల్ కాన్ఫరెన్స్–కాంగ్రెస్ కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తుందని ఊహించలేకపోయాయి. ఇప్పుడే కాదు, 2024 సార్వత్రక ఎన్నికల్లో కూడా ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించిన 12 సంస్థలు ఎన్డీఏ 400 సీట్లు దాటుతుందని చెప్పి బోల్తా పడ్డాయి. అసలు మన దేశంలో ఎగ్జిట్‌పోల్స్, సర్వే సంస్థలు ఎందుకు విశ్వసనీయత కోల్పోతున్నాయి? గల్లీకొక్కటిగా పుట్టగొడుగుల్లా ఏర్పడిన సంస్థల గురించి పెద్దగా మాట్లాడనక్కర్లేదు కాని ఒకప్పుడు కచ్చితంగా అంచనా వేయగలవని గుర్తింపు తెచ్చుకున్న సంస్థలు కూడా ఎందుకు విఫలమవుతున్నాయి? వాటిలో వృత్తి నైపుణ్యం లోపించిందా? లేదా ఈ సంస్థలు కూడా సోషల్ మీడియా సంస్థల్లాగా గాలివాటంగా జనంలో వినపడుతున్నది బయటకు వదిలేస్తున్నాయా? అన్న అనుమానం వస్తోంది. యూట్యూబ్‌ల్లో సర్వేరాయుళ్లు, ఏదో ఒకటి మాట్లాడే విశ్లేషకులు ఆవిర్భవించాక వారిని కూడా మేనేజ్ చేసే నేతల పీఆర్ బృందాలు బయలుదేరాయి. ‘మీరు ఆయనను గొప్ప విశ్లేషకుడు అనుకుంటారు.. ఆయనకు గత ఎన్నికల్లో ఎంత చెల్లించామో తెలుసా?’ అని రాష్ట్రంలో ఒక నేతకు పనిచేసిన పీఆర్వో ఒకరు అడిగారు. అందువల్ల మనకు వచ్చే సమాచారం విశ్వసనీయతను గ్రహించడం చాలా కష్టం.


రాజకీయ నాయకులు తమ పార్టీని, అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రైవేట్ సంస్థల్ని నియమించుకుని విజయం కోసం ప్రయత్నించే ప్రక్రియ మన దేశ రాజకీయాల్లో ఆలస్యంగా ప్రవేశించింది. కాని సంస్థల్ని నిర్వహించే వ్యూహకర్తల విశ్వసనీయత కూడా క్రమక్రమంగా తగ్గడం ప్రారంభమైంది. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ తాను అఖండ విజయం సాధిస్తానని భావించింది. తమ తరఫున వ్యూహరచన చేసిన సంస్థ ప్రతినిధులను వైసీపీ అధినేత ఫలితాలు రాకముందే సత్కరించారు. కాని వైసీపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్‌లో చక్రం తిప్పిన ఒక ప్రైవేట్ వ్యూహకర్తకు సలహాదారుగా కేబినెట్ హోదా కూడా కల్పించారు. నేతలు టిక్కెట్ల కోసం ఆయన చుట్టూ తిరిగారు. కాని రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణాలో ఆయన వ్యూహం ఫలించలేదు. సర్వేల ఆధారంగా టిక్కెట్లు పొందినవారు అనేకమంది పరాజయం పాలయ్యారు. ఇందుకు వ్యూహకర్తనే తప్పుపట్టలేం కాని ఇలా ఎందుకు జరుగుతోంది? నిజానికి ఏపీలో ఏ వ్యూహకర్తతో నిమిత్తం లేకుండా ప్రజలు తీర్పు చెప్పారు. తెలంగాణలో కూడా కేసిఆర్ చేసిన తప్పిదాల వల్ల బీఆర్ఎస్ ఓటమి పాలైందని స్పష్టంగా తేలింది కాని ఏ వ్యూహకర్తవల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పలేం. ప్రజలు వ్యూహకర్తలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ పాలనపై, రాజకీయ పార్టీల తీరుతెన్నులపై ఆధారపడి తీర్పునిస్తారన్న విషయం అనేక సందర్భాల్లో వెల్లడైంది. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ విజయానికి ఏ వ్యూహకర్తా కారణం కాలేదు. 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభంజనానికి కానీ, 2024లో బీజేపీ సీట్లు తగ్గడానికి కూడా పూర్తిగా వ్యూహకర్తలు కారణమని చెప్పలేము. కాకపోతే ఒక పార్టీకి ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంటే ఆ వాతావరణాన్ని సంఘటితం చేసేందుకు కొన్ని సంస్థలు తోడ్పడవచ్చు కాని ఈ సంస్థలే రాజకీయ పార్టీల తలరాతల్ని నిర్ణయించలేవు. అందువల్ల నేతలు ఎప్పుడూ ప్రజలతో నిత్యసంబంధాలు ఏర్పర్చుకుంటూ, వారికోసం పనిచేస్తూ ఉండక తప్పదు.


ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఏ కూటమి గెలుస్తుంది అన్న విషయంపై అనేకమంది రాజకీయ పరిశీలకుల్లోనే అయోమయం నెలకొన్నది. నాలుగు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 సీట్లలో కేవలం 9 సీట్లలోనే బీజేపీ విజయం సాధిస్తే ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 7, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి ఒక సీటు లభించాయి. మరో వైపు కాంగ్రెస్‌కు 12, ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేనకు 9, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి 8 సీట్లు లభించాయి. ఉత్తరప్రదేశ్‌లో మాదిరి మహారాష్ట్రలో కూడా మోదీ ప్రభంజనం అంతగా పనిచేయలేదు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈ ఎన్నికల్లో 12 సీట్లు కోల్పోయింది. దేశంలో రెండుసార్లు బీజేపీకి పూర్తి మెజారిటీ సాధించిన సందర్భాల్లో కూడా మోదీ మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం రాకుండా చేయలేకపోయారు. 1995 నుంచి దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. కేవలం ఒకే ఒక్కసారి బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. రెండోసారి దొడ్డి దారిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి అయిదు రోజుల్లోనే ఇంటి దారి పట్టింది. ఆ తర్వాత శివసేనను, ఎన్‌సీపీని చీల్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అధికారం మాత్రం శివసేన చీలిక వర్గానికి చెందిన ఏకనాథ్ షిండేకు అప్పగించక తప్పలేదు. ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన దేవేంద్రనాథ్ ఫడ్నవీస్‌ ఉప ముఖ్యమంత్రి పదవితో సంతృప్తిపడాల్సి వచ్చింది. ఇప్పుడైనా ఒకవేళ బీజేపీ అత్యధిక సీట్లు సాధించి గెలిచినా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదా? లేదా ఏక్‌నాథ్ షిండేకే మళ్లీ ముఖ్యమంత్రి పదవి అప్పగించక తప్పదా?


లోక్‌సభ ఎన్నికల ఫలితాల తీరు తెన్నులను బట్టి చూస్తే షిండే ముఖ్యమంత్రిగా ఉన్న మహాయుతితో పోలిస్తే ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అగాధి బలంగా ఉన్నదని చెప్పవచ్చు. శివసేన, ఎన్‌సీపీని బీజేపీ చీల్చిన తీరు, ప్రతిపక్షాలపై ఈడీ, ఆదాయపు పన్ను కేసులు మోపిన తీరు పట్ల జనం తమ వ్యతిరేకతను లోక్‌సభ ఎన్నికల్లో ప్రదర్శించారు. అధిక ధరలు, నిరుద్యోగంతో పాటు వ్యవసాయ సంక్షోభం, మంచి నీటి కొరత, మరాఠా కోటా, ధారవి మురికివాడల అభివృద్ధి పథకం వంటి స్థానిక సమస్యలు అనేకం ఉన్నాయి.

కాని హరియాణాలో అనూహ్యంగా బీజేపీ గెలిచిన తర్వాత మహారాష్ట్ర గురించి ఇదమిత్థంగా చెప్పేందుకు అనేకమంది పరిశీలకులు వెనుకాడుతున్నారు. హరియాణాలో మాదిరి కాంగ్రెస్ విజయావకాశాలు చేజార్చుకోవడం, శివసేనతో సీట్ల ఒప్పందం తేలకపోవడం, ముఖ్యమంత్రి సీటు కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడడం మొదలైనవి కాంగ్రెస్‌కు ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం స్థానిక కాంగ్రెస్ నేతలతో కాకుండా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుపుతోంది.

మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు మహాయుతి కూటమి వరాల వర్షం కురిపిస్తోంది. ఉచితాలను వ్యతిరేకిస్తూ మోదీ అనేక ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ దేశ వాణిజ్య రాజధాని అయిన మహారాష్ట్రలో అధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ రాజీపడక తప్పడం లేదు. ఎన్నికలు సమీపిస్తుండగానే తేలికపాటి మోటార్ వెహికల్స్‌కు టోల్ రాయితీతో పాటు దాదాపు 1500 నిర్ణయాల అమలు ప్రారంభించింది. అన్నిటికన్నా ముఖ్యమైనది రూ. 46వేల కోట్ల లడ్కీ బహనా యోజన. ఈ పథకం క్రింద మహారాష్ట్రలోని 4.5 కోట్ల మంది మహిళల్లో 2.5 కోట్ల మందికి నెలకు రూ. 1500 చొప్పున చెల్లిస్తారు. ఇప్పటికే మహిళలకు రూ. 7500 చొప్పున అయిదు నెలల అడ్వాన్స్‌ను వారి ఖాతాల్లో జమ చేశారు. దీన్నే ‘గేమ్ ఛేంజర్’గా పరిశీలకులు భావిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలు వల్ల ఏక్‌నాథ్ షిండే సర్కార్‌పై ప్రజల్లో సానుకూలత ఏర్పడిందని తాజాగా లోక్‌నీతి–సిఎస్‌డిఎస్ –తదితర సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే ఎన్నికల్లో ఏ కూటమి గెలుస్తుందో మాత్రం ఈ సంస్థలు తేల్చలేదు.


హరియాణా ఎన్నికల ఫలితాల వల్ల కాంగ్రెస్ శిబిరంలో ఆత్మవిశ్వాసం తగ్గింది. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించినప్పటికీ హరియాణాలో ముఖాముఖి పోటీలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసిన సీట్లలో ఓడిపోవడం వల్ల మిత్రపక్షాల్లో ఆ పార్టీ విలువ తగ్గిపోయింది. అందువల్ల ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో సీట్ల విషయంలో కాంగ్రెస్ ధైర్యంగా బేరసారాలు జరుపలేకపోతోంది. అయితే అదే సమయంలో హరియాణా ఎన్నికలు ఒకరకంగా కాంగ్రెస్‌కు, మిత్రపక్షాలకు గుణపాఠం నేర్పాయనే చెప్పవచ్చు. ఐకమత్యంతో పనిచేస్తేనే మోదీని ఢీకొనగలమని వారికి అర్థమయ్యే ఉంటుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఒంటరిగా కాక ఇతర పార్టీలతో కలిసి పనిచేయడం వల్ల హరియాణా ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పలేం.

కేవలం 90 సీట్లున్న హరియాణాలో బీజేపీ గెలవడం ఆ పార్టీకి లోక్‌సభ ఎన్నికల తర్వాత నైతిక స్ఫూర్తిని ఇచ్చి ఉండవచ్చు కాని ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లతో మాత్రమే అక్కడ బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. అంతే కాదు, మహారాష్ట్రతో పాటు 48 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో యూపీలోని 9, రాజస్థాన్‌లోని 7 సీట్లు బీజేపీకి ప్రతిష్ఠాత్మకమైనవి. అందువల్ల మహారాష్ట్రలో పోటీ చేస్తున్న 156 సీట్లతో పాటు ఉపఎన్నికలు జరుగుతున్న సీట్లలో అత్యధిక సీట్లను, ఓట్ల శాతాన్ని దక్కించుకున్నప్పుడే దేశంలో బీజేపీ హవా తగ్గలేదని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఈ ఎన్నికలపై దేశం దృష్టి కేంద్రీకృతమైంది. దేశమంతటా ప్రతి ఏడాదీ ఎన్నికల వాతావరణం ఏర్పడడం ఒకరకంగా మంచిదే. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తన గ్రాఫ్ పడిపోతుందో లేదో ఎప్పటికప్పుడు తేల్చుకోవడానికి ఈ ఎన్నికలు దోహదపడతాయనడంలో సందేహం లేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Oct 23 , 2024 | 01:46 AM