Share News

మోదీని కాంగ్రెస్‌ అడ్డుకోగలదా?

ABN , Publish Date - Feb 12 , 2025 | 02:10 AM

‘రాజుకు ఒకటే నిబంధన వర్తిస్తుంది. అతడు బలంగా ఉండాలి, విస్తరిస్తూనే ఉండాలి’ అని చాణక్యుడు చెప్పినట్లుగా మౌర్య సామ్రాజ్యం దేశమంతటా విస్తరించినట్లే భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్రమోదీ...

మోదీని కాంగ్రెస్‌ అడ్డుకోగలదా?

‘రాజుకు ఒకటే నిబంధన వర్తిస్తుంది. అతడు బలంగా ఉండాలి, విస్తరిస్తూనే ఉండాలి’ అని చాణక్యుడు చెప్పినట్లుగా మౌర్య సామ్రాజ్యం దేశమంతటా విస్తరించినట్లే భారతీయ జనతా పార్టీ కూడా నరేంద్రమోదీ సారథ్యంలో దేశమంతటా విస్తరించేందుకు దండ యాత్రలు చేస్తున్నట్లు కనపడుతోంది. ఏడాది ఏడాదికీ ఆయన సారథ్యంలో ప్రతిపక్ష రాష్ట్రాల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. రెండేళ్ల క్రితం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ కైవశం కాగా క్రమంగా ఒడిషా, ఆంధ్రప్రదేశ్, హరియాణాతో పాటు ఇటీవలి కాలంలో దేశ రాజధాని ఢిల్లీ కూడా బీజేపీ లేదా బీజేపీ మిత్రపక్షాల పాలనలోకి వచ్చాయి. ప్రస్తుతం 15 రాష్ట్రాలు బీజేపీ పట్టులోకి పూర్తిగా రాగా మొత్తం 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది. మోదీ బలగాలు పశ్చిమ బెంగాల్, తెలంగాణతో పాటు సాధ్యమైనన్ని రాష్ట్రాల్లో చొచ్చుకువచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి.

నిజానికి ఢిల్లీలో బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్‌ను బలోపేతం చేయడంలో అటల్ బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ ఆడ్వాణీ కీలక పాత్ర పోషించారు. 1957లో ఎంపీగా ఉన్న అటల్ బిహారీ వాజపేయికి సహాయపడేందుకు ఢిల్లీ వచ్చిన లాల్‌కృష్ణ ఆడ్వాణీ ఢిల్లీలో జనసంఘ్ బాధ్యత కూడా చేపట్టారు. 1958లో తొలిసారి ఏర్పడిన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ఆయన తీవ్ర కృషి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జనసంఘ్ తన తొలి సంకీర్ణ రాజకీయాలు ఢిల్లీలో కమ్యూనిస్టులతో ప్రారంభించింది. మేయర్, ఉపమేయర్ పదవులను రొటేషన్ ప్రకారం పంచుకునేందుకు జనసంఘ్, సీపీఐల మధ్య ఒప్పందం కుదరడమే అందుకు నిదర్శనం. 1970వ దశకంలో కార్పొరేషన్ ఎన్నికల్లో జనసంఘ్‌ను గెలిపించేందుకు వాజపేయి, ఆడ్వాణీతో పాటు వందలాది జనసంఘ్ కార్యకర్తలు రాత్రింబగళ్లు కృషిచేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జనసంఘ్ విజయం సాధించలేదు. ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం ‘ఛలో కోయీ సినిమా దేఖ్ నే చల్తీ హై’ అని అటల్, ఆడ్వాణీ పహాడ్ గంజ్‌లోని ఇంపీరియల్ సినిమా థియేటర్‌కు వెళ్లి ఒక హిందీ సినిమా చూశారు. ఆ సినిమా పేరు ‘ఫిర్ సుబా హోగీ’ (మళ్లీ ఉదయం వస్తుంది)! ఒకప్పుడు ఢిల్లీ సింహంగా పేరొందిన మదన్‌లాల్ ఖురానా. ఆడ్వాణీ మాదిరే పాకిస్థాన్ నుంచి కట్టుబట్టలతో వచ్చినవాడే. విజయ్‌కుమార్ మల్హోత్రా, కేదార్‌నాథ్ సహానీ లాంటి నేతలతో కలిసి ఢిల్లీలో జనసంఘ్ విభాగాన్ని స్థాపించిన ఖురానా తర్వాతి కాలంలో బీజేపీని కూడా బలోపేతం చేశారు. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 47.82 శాతం ఓట్లతో 49 సీట్లు సాధించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఆ తర్వాత బీజేపీ అంతర్గత కలహాలతో కూరుకుపోయింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది.


ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సామ దానభేద దండోపాయాలను ప్రయోగించింది. గత పదేళ్లుగా మోదీ, షాలు ఎంత ప్రయత్నించినా కేజ్రీవాల్‌ను ఢీకొనలేకపోయారు. కాని ఈ సారి ఢిలీలో అధికారంలోకి వచ్చేందుకు మోదీ, షాలు చేయని ప్రయత్నమంటూ లేదు. అన్ని రకాల ఎన్నికల వ్యూహాల్ని అవలంబించడమే కాదు, కేజ్రీవాల్‌ను ప్రజల దృష్టిలో దిగజార్చేందుకు బీజేపీ తీవ్రయత్నాలు చేసింది. అతడి అవినీతి కార్యకలాపాలను బయటపెట్టి అతడు నిజాయితీపరుడన్న భ్రమలు తొలిగేలా చేసి అధికారంలోకి రాగలిగింది. నిజానికి ఢిల్లీలో బీజేపీకి చెప్పుకోదగ్గ నాయకుడు లేనేలేడు. బీజేపీ మోదీ పేరుతోనే ఎన్నికల్లో గెలిచింది. మోదీ హయాంలో బీజేపీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న దానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. కేజ్రీవాల్ లాంటి బలమైన నేతలు కూడా మోదీని ఢీకొనలేకపోవడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామం.


స్పష్టంగా చెప్పాలంటే కేజ్రీవాల్ తనకు తిరుగులేదన్న అహంతో ఎన్నో వ్యూహాత్మక తప్పిదాలకు పాల్పడ్డారు. తనపై మారుతున్న ప్రజాభిప్రాయాన్ని పసిగట్టలేకపోయారు. ‘ఒక మద్యం సీసా బాటిల్ కొంటే మరో మద్యం సీసా ఉచితంగా ఇచ్చి మా సంసారాన్ని నాశనం చేశాడు సార్’ అని ఒక పనిమనిషి చెప్పింది. మద్యం కుంభకోణమే అన్ని అవినీతి కార్యకలాపాలకన్నా కేజ్రీవాల్ ప్రతిష్ఠను బాగా దెబ్బతీసింది. ఈ కుంభకోణంలో తనను అరెస్టు చేసినప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ లా రాజీనామా చేయకుండా జైలుకు వెళ్లి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగడంతో కేజ్రీవాల్‌పై సానుభూతి అన్నది లేకుండా పోయింది. జైలు నుంచి రాగానే తనను తాను మళ్లీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఆయన జైలులో ఉన్నప్పుడు కేజ్రీవాల్ భార్య ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని సందేశాలివ్వడం, ముఖ్యమంత్రి అయిన అతిషీ ఆ కుర్చీలో కూర్చోకుండా మితిమీరిన భక్తి ప్రదర్శించడం తప్పుడు సంకేతాలు ఇచ్చింది. అంతే కాదు, పార్టీకోసం పనిచేసిన వారిని విస్మరించి దాదాపు 30 స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేజ్రీవాల్‌ సీట్లు ఇచ్చారు. మనీష్ సిసోడియా లాంటి వ్యక్తికి సీటు మార్చి అతడి ఓటమికి కారణమయ్యారు. రాజ్యసభ సీట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నారన్న అపఖ్యాతి మూటగట్టుకున్నారు. అభివృద్ధి జన జీవనాలను మెరుగుపరచడంపై కాకుండా ఉచితాలను అధికంగా నమ్ముకున్నారు. ఉచిత విద్యుత్, ఉచిత నీరు, మహిళలకు ఉచిత బస్‌పాస్‌లు గెలిపిస్తాయనుకున్నారు. యమునలో మురికినీరు ప్రవహిస్తున్నా, రహదారులు దెబ్బతిన్నా, వాయుకాలుష్యం పెరిగిపోతున్నా, రహదారులు, కాలనీల్లో ఆక్రమణలు పెరిగిపోతున్నా పట్టించుకోలేదు. స్వంత కాళ్ల క్రింద నేల కరిగిపోతున్నా గ్రహించకుండా ఇతర రాష్ట్రాల్లో విస్తరించి జాతీయ నాయకుడుగా ఎదగాలన్న తహతహను ప్రదర్శించారు. సహజంగా ప్రాంతీయ పార్టీల అధినేతలు చేసే తప్పులనే కేజ్రీవాల్ చేశారు. ఆ తప్పుల్ని బీజేపీ పూర్తిగా సద్వినియోగపరుచుకుంది.


తమ విస్తరణ లక్ష్యాలలో మోదీ విజయవంతం కావడం అనేక ప్రశ్నలకు తావిస్తున్నది. క్రమంగా భారతదేశమంతటా బీజేపీ విస్తరించగలుగుతుందా? బీజేపీ, కాంగ్రెస్‌లతో చేతులు కలపని ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడుతుందా? అసలు కాంగ్రెస్ ఎంత వరకు బీజేపీ ధాటిని తట్టుకుని నిలబడగలుగుతుంది? ఇప్పటి వరకూ బీజేపీని అడ్డుకోవాలంటే ప్రాంతీయ పార్టీలకే సాధ్యమన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు అదికూడా జరిగేటట్లు కనపడడం లేదు. కేజ్రీవాల్ లాంటి నేతలు కాంగ్రెస్ ఓటు బ్యాంకును కబళించి అధికారంలోకి వచ్చిందని తెలిసినా ఆ ఓటు బ్యాంకును తిరిగి సాధించేందుకు కాంగ్రెస్ బలంగా ప్రయత్నించలేదు. కేజ్రీవాల్ ప్రభ తగ్గిపోతోందని గమనించినా ఢిల్లీలో కాంగ్రస్‌ ఉధృతంగా పనిచేయనేలేదు.

ముఖాముఖి పోటీల్లో బీజేపీని ఓడించడం కాంగ్రెస్‌కు సాధ్యపడదని హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కులగణన, రాజ్యాంగం, సామాజిక న్యాయం అంటూ ఎన్ని సైద్ధాంతిక అంశాలను లేవనెత్తినా బీజేపీ ఉధృతిని కాంగ్రెస్ అడ్డుకోలేకపోతోంది. వచ్చే సార్వత్రక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అడ్డుకోగలుగుతుందా అన్న సందేహాలు కాంగ్రెస్ శిబిరంలోనే వ్యక్తమవుతున్నాయి. ఎవరితో చర్చించినా ‘కాంగ్రెస్‌కు బీజేపీని ఎదుర్కోగల శక్తి ఎక్కడుంది? హరియాణాలో జరిగింది చూశారు కదా?’ అన్న ప్రశ్నలు వేస్తున్నారు. నిజానికి సార్వత్రక ఎన్నికల్లో సీట్లు తగ్గిన తర్వాత నరేంద్రమోదీ దెబ్బతిన్న బెబ్బులిలా ప్రతి రాష్ట్రంలోనూ గెలవాలన్న కసితో సర్వశక్తులు ఒడ్డారు. వేర్వేరుగా ఎన్నికలు జరిపించి ఒక్కో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. హరియాణా, మహారాష్ట్రలను గెలుచుకోవడంతో మోదీకి తిరుగులేదన్న అభిప్రాయం కల్పించారు. ఇక ఢిల్లీ విజయంతో అనితరసాధ్యుడని నిరూపించుకున్నారు. రాజకీయాల్లో తమ సిద్ధాంతాలు, తమ ఉపన్యాసాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా ప్రత్యర్థి బలంపై దృష్టి కేంద్రీకరించి వ్యూహరచన చేయడం అవసరం. కాంగ్రెస్ ఈ విషయంలో వెనుకబడి పోతోంది.


కేజ్రీవాల్ ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. కనుక కాంగ్రెస్ ఇప్పటి నుంచే బలంగా పనిచేసి ఢిల్లీలో తాను కోల్పోయిన ఓటు బ్యాంకును మళ్లీ సంపాదించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆఖరులో జరిగే బిహార్ ఎన్నికల్లో తమకు రావాల్సిన సీట్లను ఇప్పుడే నిర్ణయించుకుని అన్నిటిలో గెలిచే ప్రయత్నం చేయవచ్చు. ఆ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లకు పోటీ చేసి కేవలం 19 స్థానాలలో మాత్రమే విజయం సాధించి మహాఘట్ బంధన్ సర్కార్ ఓటమిలో కీలక పాత్ర పోషించింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించి ఒకరకంగా కాంగ్రెస్‌కు మేలే చేసారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయిన కాంగ్రెస్ ఈసారి బెంగాల్‌లో ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఏమి చేయాలో ఇప్పటి నుంచే దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఒడిషాలో బీజేడీ ఓడిపోవడం కాంగ్రెస్ బలోపేతం అయ్యేందుకు అవకాశాన్నిచ్చినట్లయింది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ ఆ పార్టీ తమ భావి విజయానికి అడ్డురాకుండా ఏమి చేయాలో కాంగ్రెస్ దృష్టి పెట్టాలి. ప్రాంతీయ పార్టీలు బలహీనపడడం ఒక రకంగా కాంగ్రెస్‌కు సదవకాశంగా భావించాలి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో ఇప్పటికే ఉన్న పార్టీలతో స్నేహ సంబంధాలు పటిష్ఠం చేసుకుంటూనే కూటమి ఉనికిలో లేని రాష్ట్రాల్లో బీజేపీతో ముఖాముఖి పోరుకు కాంగ్రెస్ బలంగా సిద్ధపడితే కాని ఆ పార్టీ కోలుకునే అవకాశాలు లేవు. విచిత్రమేమంటే నరేంద్రమోదీ ఇప్పటికీ కాంగ్రెస్‌ను తన బలమైన ప్రత్యర్థిగానే భావిస్తున్నట్లున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ పార్లమెంటు ఉభయ సభల్లో చేసిన ప్రసంగాల్లో అత్యధిక సమయాన్ని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల తప్పుల్ని ఎండగట్టేందుకే వినియోగించుకున్నారు. మోదీ విమర్శలను సవాలుగా తీసుకొని బీజేపీతో బలమైన పోరుకు కాంగ్రెస్‌ తనను తాను సమాయత్తం చేసుకోగలదా?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 02:10 AM