Share News

పన్ను రాయితీలతో ఆర్థికాభ్యుదయమా?

ABN , Publish Date - Feb 05 , 2025 | 06:34 AM

పాత పార్లమెంట్ భవనంలోని రీడింగ్ రూమ్ పై భాగంలో వివిధ సంస్థానాధీశుల రాచరిక చిహ్నాలు కనపడతాయి. స్వాతంత్ర్యం రాకముందు ఈ రీడింగ్ రూమ్ సంస్థానాధీశుల ఛాంబర్‌గా ఉండేది. రాజులు పోయారు, రాచరిక...

పన్ను రాయితీలతో ఆర్థికాభ్యుదయమా?

పాత పార్లమెంట్ భవనంలోని రీడింగ్ రూమ్ పై భాగంలో వివిధ సంస్థానాధీశుల రాచరిక చిహ్నాలు కనపడతాయి. స్వాతంత్ర్యం రాకముందు ఈ రీడింగ్ రూమ్ సంస్థానాధీశుల ఛాంబర్‌గా ఉండేది. రాజులు పోయారు, రాచరిక చిహ్నాలు పోయాయి. స్వాతంత్ర్యం తర్వాత సామాన్యులు పార్లమెంట్‌లో ప్రవేశించడం ప్రారంభమైంది. పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలు సైకిల్‌పై కూడా పార్లమెంట్‌కు వచ్చేవారు. మరి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంస్థానాధీశులకు బదులు ఇప్పుడు కోట్లకు పడగెత్తినవారు పార్లమెంట్‌లో ప్రవేశిస్తున్నారు. తెలుగుదేశం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్‌పై పార్లమెంట్‌కు వస్తే అది ఒక అరుదైన దృశ్యంలా కనిపిస్తోంది. అసలు సంపన్నులు కాని వారు పార్లమెంట్ సభ్యులు కావడం అరుదుగా మారింది. 18వ లోక్‌సభలో 93 శాతం మంది ఎంపీలు కోటీశ్వరులైతే, కోటీశ్వరులు కానివారు పార్లమెంట్‌కు రావడం అసాధ్యమని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. రూ.10 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించిన ఎంపీలు 42 శాతం మంది ఉన్నారు. లోక్‌సభ పరిస్థితి ఈ విధంగా ఉంటే, రాజ్యసభలో సంపన్నులు కానివారు ప్రవేశించడం అతి కష్టంగా మారింది. మొత్తం రాజ్యసభ సభ్యుల ఆస్తుల సగటు విలువ రూ.87 కోట్లు దాటితే బీజేపీకి చెందిన 90 మంది రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువ రూ.37 కోట్లకు పైగా ఉంటుంది. పట్టణాల్లో నివసించేవారి సగటు ఆస్తుల విలువ కంటే ఎంపీల ఆస్తులు 27 రెట్లు ఎక్కువ ఉంటుందని ఒక అధ్యయనం పేర్కొంది.


భారతదేశంలో సంపన్నులూ–మధ్యతరగతికీ మధ్య సంపద విషయంలో వ్యత్యాసం చట్టసభల్లోనే స్పష్టంగా కనబడుతుంది. ఒకప్పుడు కేవలం రూ. 10 కోట్లతోనే దేశం మొత్తం ఎన్నికలు జరిగేవి. ఇప్పుడు వేల కోట్లు ఎన్నికల్లో ప్రవహిస్తున్నాయి. సంపన్నులకు అన్ని రకాల రాయితీలు, లక్షల కోట్ల రుణాలు, ప్యాకేజీలు, నల్లధనం పెంచుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు. వారు ఎన్నికలను ప్రభావితం చేసేందుకు, చట్ట సభల్లో ప్రవేశించేందుకు దోహదం చేస్తుంటే, సామాన్యులను శాంతింపచేసేందుకు రేషన్‌తో పాటు రకరకాల ఉచితాలు, పథకాలు, మహిళా సమ్మాన్ యోజన వంటి తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇదీ మన దేశ రాజకీయాల్లో పరిఢవిల్లుతున్న ప్రజాస్వామ్యం!


కేవలం సైద్ధాంతిక నిర్ణయాల ద్వారా భావోద్వేగాలను రేకెత్తించి మధ్యతరగతిని ఆకట్టుకోవడం సాధ్యపడదని బీజేపీ గ్రహించినట్లు కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ చట్టం, రామమందిర నిర్మాణం వంటివి ఎన్ని జరిగినా 2024 సార్వత్రక ఎన్నికల్లో బీజేపీకి అంతగా ప్రయోజనం కలగలేదు. ఏమీ ఖర్చుపెట్టకుండానే, రకరకాల పన్నుల ద్వారా వారి జేబులకు కత్తెర వేస్తూ, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ, నిత్యావసర వస్తువులు ఆకాశానికి పెరిగిపోయినా విస్మరిస్తూ ఉంటే మధ్యతరగతి ఎంతకాలం మౌనం పాటిస్తారు? మెజారిటీ జీఎస్టీ వసూళ్లు మధ్యతరగతి నుంచే లభిస్తున్నాయని ఒక అంచనా. స్కూలు ఫీజుల్లో కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. కార్పొరేట్లు చెల్లించే పన్నులకంటే వ్యక్తిగత పన్నుల వసూళ్లు దాదాపు రూ. 2లక్షల కోట్లు ఎక్కువ. వ్యక్తిగత పన్నుల వసూళ్లు 19 శాతం పెరిగితే కార్పొరేట్ పన్ను వసూళ్లు 7 శాతమే పెరిగాయి. ఇందుకు కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలే. ఉదాహరణకు 2019 సెప్టెంబర్‌లో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టిన సంపన్నులను ఏమీ చేయడం లేదనే ఒక అభిప్రాయం నెలకొని ఉన్నది. కార్పొరేట్లు తాము ఆర్జించిన మొత్తాన్ని పెట్టుబడులు పెడతారని, ఉద్యోగాలు కల్పిస్తారని ప్రభుత్వం ఆశించింది కాని అది జరగలేదు సరికదా. వారు తమ ఖజానాలు నింపుకున్నారు. గత దశాబ్దంలో తీవ్రమైన ద్రవ్యోల్బణం రీత్యా మధ్యతరగతి తమ ఆదాయాలు పెరగకపోవడాన్ని గమనించారు. వచ్చిన డబ్బులన్నీ మళ్లీ ఏదో రూపేణా లాగేసుకుంటున్నట్లు వారు గమనించారు.

బహుశా అన్ని విధాల నష్టపోతున్నది మధ్యతరగతి వారేనన్న అభిప్రాయం గత కొద్ది సంవత్సరాలుగా నెలకొని ఉన్నది. ఆ మధ్యతరగతిని శాంతింపచేయడం కోసమే రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు స్పష్టమవుతోంది. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోని మధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చినప్పుడే ఆర్థిక ప్రగతి సుసాధ్యమవుతుందని ప్రకటించారు. ‘ఈ దేశ మధ్యతరగతి ప్రజలు, పేదలకు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని ఆశిస్తున్నాను..’ అని బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజే మోదీ మీడియాతో అన్నారు.


బీజేపీ పట్ల మధ్యతరగతిలో ఒక రకమైన ఉదాసీనత పెరుగుతూ వస్తోంది. ఈ విషయం గ్రహించినందువల్లే బీజేపీ తన మార్గాన్ని మార్చుకుంది. ఒకప్పుడు ఉచితాలను వ్యతిరేకించిన మోదీ రాష్ట్రాల ఎన్నికల్లో ఉచితాలను ప్రకటించడానికి అనుమతించారు. ఇప్పుడు మధ్యతరగతిని కూడా ఆకట్టుకోవడం తప్పనిసరి అని బీజేపీ గ్రహించింది. ఢిల్లీ ఎన్నికలను మాత్రమే కాదు, రాబోయే ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని దేశ వ్యాప్తంగా తన ఆర్థిక విధానాలపై అభిప్రాయాన్ని మార్చేందుకు మోదీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. ‘నేను కూడా మనిషిని. తప్పులు చేయడం సహజం. నేనేమీ దేవుడిని కాదు..’ అని జనవరి మొదటి వారంలో ఒక పాడ్‌కాస్ట్‌లో నరేంద్రమోదీ అనడంలో అంతరార్థం ఆయన తదుపరి చర్యల్లో కనపడుతోంది. గత పదేళ్లుగా లేని ఆదాయపన్ను మినహాయింపులను ప్రకటించడం ఇందుకు నిదర్శనం. మొత్తానికి మోదీ, ఆయన బృందం తమ తప్పులు సరిదిద్దుకోవడానికి పెద్దగా సమయం తీసుకోరని, రాజకీయంగా పట్టుకోల్పోకుండా చూడడమే వారి ప్రధాన లక్ష్యమని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే గిగ్ వర్కర్లతో సహా తమ ఓటు బ్యాంకుతో ముడివడి ఉన్న పలు వర్గాలను సంతృప్తిపరిచేందుకు త్వరితంగా చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించింది. ఒక్క బీమా రంగంలో వంద శాతం పెట్టుబడులను అనుమతించడం తప్ప ఏ రంగంలోనూ విధానపరమైన మార్పులు చేయలేదు. అభివృద్ధి పగ్గాలను ప్రైవేట్ రంగానికి అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు తయారు చేసిన ఆర్థిక సర్వే చెప్పినప్పటికీ ప్రభుత్వం బడ్జెట్‌లో మాత్రం ఆచితూచి చర్యలు తీసుకుంది. ఈ సారి పన్ను చెల్లించేవారికి రాయితీలు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంగా చెప్పారని ఫైనాన్స్ సెక్రటరీ తెలిపారు.

భారతదేశంలో మధ్యతరగతి జనాభా రోజురోజుకూ పెరుగుతుందని ఒక అంచనా. జనాభాలో 31 శాతం మధ్యతరగతి వారే కాగా వారి సంఖ్య 2031 నాటికి 38 శాతం, 2047 నాటికి 70శాతానికి చేరుకుంటుందని, దాదాపు వందకోట్ల మేరకు మధ్యతరగతి ప్రజలే ఉంటారని పీపుల్ రీసర్చ్ ఆన్ ఇండియన్ ఎకానమీ (ప్రైస్) వంటి సంస్థలు చెబుతున్నాయి. అందుకే పాశ్చాత్య బహుళ జాతి సంస్థల యజమానులు ప్రధానంగా ఎఫ్ఎంసిజి రంగానికి చెందిన వారి దృష్టి భారతదేశంపై పడుతోంది. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నష్టపోవడానికి కారణం మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఓటర్లు బీజేపీకి దూరం కావడమేనని లోక్‌నీతి– సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సిఎస్‌డిఎస్) ఎన్నికల అనంతరం నిర్వహించిన సర్వేలో తేల్చింది. తక్కువ ఆదాయవర్గాలవారు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతున్న కొద్దీ వారు బీజేపీకి ఎడం అవుతున్నారని ఈ సర్వే పేర్కొంది. మధ్యతరగతి ఓట్లలో మొత్తంగా 3 శాతం తగ్గినప్పటికీ లోక్‌సభలో మెజారిటీ సాధించలేకపోయింది. బీజేపీ పట్ల బలంగా ఉన్న 11 శాతం మధ్యతరగతి ఓటు దూరమైతే ఆ పార్టీ సమస్యలో పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2004లో మధ్యతరగతి ఓట్లు దూరమైనందువలన అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం ఓడిపోయిందని వారి అభిప్రాయం.


అయితే పన్ను మినహాయింపులు ప్రకటించినంత మాత్రాన మధ్యతరగతి సంతృప్తి చెందుతుందా అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేము. 2024లో దేశంలో కేవలం 8.6 కోట్ల మంది మాత్రమే ఆదాయపన్నును చెల్లించారు. అయినప్పటికీ ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా మారిందనే అభిప్రాయం ఏర్పర్చేందుకు ఈ చర్య ఉపయోగపడింది.. అనేకమంది పేదలు మధ్యతరగతి వర్గానికి మారుతున్నారని, అందువల్ల మధ్యతరగతిని సంతోషపెట్టే చర్యలు తీసుకోవడం సరైనదేనని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడ్జెట్‌పై ఢిల్లీలో వ్యాఖ్యానిస్తూ అన్నారు. అయితే అత్యధిక సంపన్నులు అట్టడుగు వర్గాలకు చేయూతనిచ్చే మార్గాలపై చర్చ జరగాలని, జీఎస్టీని సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. అదే సమయంలో సంపద సృష్టించకుండా సంపదను పంచిపెట్టే విధానాలపై చర్చించాలని ఆయన కోరారు. ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు సూచనలను ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా పట్టించుకునే అవకాశాలు లేకపోలేదు.


అదే సమయంలో దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, శ్రామిక శ్రేణుల్లో నవీన నైపుణ్యాలు కొరవడడం వంటివాటిపై కూడా వాస్తవప్రాతిపదికన ఒక రోడ్ మ్యాప్ (మార్గదర్శక ప్రణాళిక) రూపొందించాల్సిన అవసరం ఉన్నది. చట్టసభల్లో సామాన్యులు, మధ్యతరగతివారు ప్రవేశించేందుకు తగిన రాజ్యాంగ సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా స్పష్టంగా కనిపిస్తోంది. బిలియనీర్ల సంఖ్య పెరిగిపోతోంది. చట్టసభల్లో సంపన్నుల సంఖ్య సైతం అధికమవుతోంది. ఈ పరిణామాలు వ్యవస్థలకూ ప్రజలకూ మధ్య అంతరాలకు సూచికలు కావా? కేవలం పన్ను రాయితీలు, మినహాయింపులతో ఈ అగాధాలను అధిగమించగలుగుతామా?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 05 , 2025 | 06:34 AM