అందరికీ ఆయన పాటే!
ABN , Publish Date - May 05 , 2024 | 05:58 AM
ఓ గాత్రం.. మెదక్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు సంబంధించిన ప్రచార రథంలో పాటతో మార్మోగుతోంది. అదే గొంతు.. అదే పార్లమెంటు స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న
అన్ని పార్టీల ప్రచార రథాల్లోనూ ఒకే గొంతు
దుమ్మురేపుతున్న నల్లగొండ గద్దర్ పాటలు
ఏపీలోనూ చంద్రబాబుపై పాడిన నర్సన్న
(ఆంధ్రజ్యోతి, సిద్దిపేట)
ఓ గాత్రం.. మెదక్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు సంబంధించిన ప్రచార రథంలో పాటతో మార్మోగుతోంది. అదే గొంతు.. అదే పార్లమెంటు స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డిపై పాటతో దుమ్మురేపుతోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకూ ఆ గొంతే పాడుతోంది. ఇలా ఒకే గాయకుడు మూడు పార్టీల అభ్యర్థుల తరఫున పాటలు పాడి.. ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఒక్క మెదక్‌లోనే కాదు.. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడ చూసినా, ఏ పార్టీ ప్రచార రథాల్లో విన్నా ఆయన స్వరమే వినిపిస్తోంది.
ఆయనే.. నల్లగొండ గద్దర్‌గా పేరు పొందిన నర్సన్న అలియాస్ కాసాల నర్సిరెడ్డి. తన ప్రత్యేకమైన గాత్రంతో పలు పాటలు ఆలపించడం ద్వారా వెలుగులోకి వచ్చిన నర్సన్న.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పాడిన ‘మూడు రంగుల జెండా పట్టి’ అనే పాట జనంలోకి బాగా వెళ్లింది. కాంగ్రెస్ సభలు నిర్వహించిన చోట జనానికి హుషారు తెప్పించడంతోపాటు ఓ సభలో ప్రియాంకగాంధీతో కూడా స్టెప్పులు వేయించింది. దీంతో తాజాగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలూ నర్సన్నతో పాట పాడించుకునేందుకు క్యూ కట్టారు. అయితే అందరి ప్రచార రథాల్లోనూ నర్సన్న గొంతే వినిపిస్తుండడంతో.. అది ఏ పార్టీ ప్రచార రథమోనని ప్రజలు కొద్దిసేపు అయోమయానికి గురవుతున్నారు. కాగా, ఏపీ ఎన్నికల్లోనూ నర్సన్న.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా పాటలు పాడారు. ఈ పాటలకు అక్కడ విశేష స్పందన వస్తోంది.