Health: పిల్లల్లో డయాబెటిస్.. ఈ అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయొద్దు!
ABN , Publish Date - Sep 03 , 2024 | 01:43 PM
టైప్ 1 డయాబెటీస్‌తో బాధపడే చిన్నారుల్లో కొన్ని అసాధారణ సమస్యలు కనిపిస్తాయి. వీటిని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. మరి ఈ లక్షణాలు ఏంటో ఓసారి చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: శరీరంలో ఇన్సూలిన్ సరిగా ఉత్పత్తి కాకపోయినా, లేదా ఉత్పత్తి అయినదాన్ని సరిగా వినియోగించుకోలేకపోయినా డయాబెటిస్ వ్యాధి బారిన పడతారు. రక్తంలో చక్కెర స్థాయిలు పరిమితిని దాటి రకరకాల ఇతర రోగాలకు దారి తీస్తాయి. ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన షుగర్ వ్యాధి ఇప్పుడు పల్లల్ని కాటేస్తోంది. ముఖ్యంగా పిల్లల్లోనూ టైప్ 1 డయాబెటిస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కాబట్టి, చిన్నారుల్లో డయాబెటిస్ వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసుకుంటే వ్యాధిని తొలి దశలోనే గుర్తించొచ్చని అంటున్నారు (Health).
Types of Salt: ఉప్పులో రకాలు.. వాటి వల్ల కలిగే ఉపయోగాలు!
డయాబెటిస్ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవనేది వైద్యులు చెప్పే మాట. కొందరు చిన్నారుల్లో ఈ వ్యాధికి సంబంధించి అసాధారణ లక్షణాలు కూడా కనిపిస్తాయట (Symptoms of Type1 Diabetes in Kids).
చిన్నారుల చర్మంపై, బాహుమూలాల్లో నల్లటి మచ్చలు కనిపిస్తుంటే సందేహించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. ఇన్సూలిన్ అధికమవడంతో చర్మంలో కణాల సంఖ్య పెరిగి ఈ పరిస్థితికి దారి తీస్తుందని అంటున్నారు.
డయాబెటిస్‌తో రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. పిల్లల్లో ఈ పరిస్థితి వస్తే వారు తరచూ రకరకాల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు తెల్ల రక్తకణాలకు అడ్డంకులు వస్తాయని, ఫలితంగా సూక్ష్మక్రిములను ఎదుర్కొనే శక్తి సన్నగిల్లుతుందని అంటున్నారు.
డయాబెటిస్ రోగుల్లో సాధారణంగా కనిపించే లక్షణం నీరసం. పిల్లలు కూడా ఇందుకు అతీతం కాదు. రోజంతా ఆటలు ఆడి వచ్చే చిన్నారులకు నీరసం సహజమే కానీ నిత్యం అలసటతో ఇబ్బంది పడే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటే కంటి లెన్స్‌కు సాగే గుణం తగ్గుతుంది. దీంతో, చూపు మసకబారుతుంది. డయాబెటిస్ ఉన్న పిల్లల్లో ఈ సమస్య కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
రక్తంలో చక్కెరలు ఎగుడుదిగుడుకు లోనైతే అది భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, పిల్లల్లో మూడ్ స్వింగ్స్, తరచూ చిరాకు పడటం, ఏకాగ్రత లోపించడం వంటివన్నీ డయాబెటిస్ వ్యాధికి సంకేతాలుగా భావించొచ్చు
నియంత్రణలో లేని డయాబెటిస్ కారణంగా శరీరంలోని నాడులు దెబ్బతింటాయి. దీంతో, దురదలు తలెత్తుతాయి. కాబట్టి, నిత్యం దురదలతో చిన్నారులు ఇబ్బంది పడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.