Stored Water: ఆ నీటిని వాడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు రావడం ఖాయం..
ABN , Publish Date - Mar 29 , 2025 | 10:47 AM
రోజుల తరబడి నీటిని నిల్వ చేస్తే చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుల తరబడి స్టోర్ చేయడం మంచి పద్ధతి కాదని అంటున్నారు. ఆ నీటితో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎండాకాలంలో నీటి కొరత ఏర్పడుతుంది. తాగు, సాగు నీరు లేక ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక పట్టణాలు, నగరాల విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాగటానికి కాదు కదా.. వాడుకునేందుకు సైతం నీళ్లు దొరకవు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో కుళాయి నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. దీంతో అనేక మంది బకెట్లు, టబ్బులు వంటి వాటిల్లో నీటిని పట్టుకుని నిల్వ చేసుకుంటారు.
ఆరోగ్య సమస్యలు ఇవి..
అయితే రోజుల తరబడి నీటిని నిల్వ చేస్తే చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుల తరబడి స్టోర్ చేయడం మంచి పద్ధతి కాదని అంటున్నారు. ఆ నీటితో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. స్నానం, బట్టలు ఉతకడం లేదా ఇతర పనుల నిమిత్తం ముందుగానే నీళ్లు స్టోర్ చేసి పెట్టుకుంటే అందులో ప్రమాదకర బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
బకెట్‌లో నీళ్లు 48 గంటలకు మించి నిల్వ ఉంటే డెంగీ, మలేరియా వంటి వ్యాధులను వ్యాపింప చేసే దోమలకు గూడుగా మారుతుందని చెబుతున్నారు. ఇటీవల విజయవాడలో ఒక కుటుంబం బాత్‌రూంలో నిల్వ చేసిన నీటి వల్ల దోమలు వృద్ధి చెంది డెంగీ బారిన పడినట్లు పలు వార్తాపత్రికలు కథనాలు ప్రచురించాయి. అంతేకాదు, స్థిరంగా ఉన్న నీటిలో బ్యాక్టీరియా, శిలీంద్రాలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
రోజుల తరబడి నీళ్లను బడెట్‌లో ఎక్కువ రోజులు ఉంచితే అందులో దుమ్ము, ధూళి చేరి కలుషితం అవుతాయని చెబుతున్నారు. ఇలాంటి నీటితో స్నానం చేస్తే చర్మ సమస్యలు, అలర్జీలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదం మూత లేని బకెట్‌లో రెట్టింపవుతుందని అంటున్నారు.
సమస్యలు రాకుండా ఉండాలంటే..
వీలైనంత ఎక్కువగా తాజా నీటినే వాడాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నీటిని నిల్వ చేయాల్సి వస్తే పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నిల్వ చేసిన నీటిని 24 గంటల్లోపు వాడితే, ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావని చెబుతున్నారు. అలాగే నీటిపై మూత పెట్టి శుభ్రమైన చోట ఉంచితే సమస్యలు తలెత్తే అవకాశం తక్కువని చెబుతున్నారు. బకెట్‌ను రోజూ శుభ్రం చేయాలని, ఖాళీ అయినా వెంటనే బోర్లా పెట్టాలని చెబుతున్నారు. వాడిన బకెట్ చివర్లో నీళ్లు ఏమైనా ఉంటే వెంటనే పారబోయాలని సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Summer Tips: వేసవిలో రోజుకు ఎంత నీరు తాగాలి.. తక్కువ తీసుకుంటే ఏ సమస్యలు వస్తాయి..