Share News

Water Intoxication: అతిగా నీరు తాగుతున్నారా? వాటర్ ఇంటాక్సికేషన్ గురించి తెలిస్తే..

ABN , Publish Date - Oct 29 , 2024 | 09:06 AM

నీరు అతిగా తాగితే వాటర్ ఇంటాక్సికేషన్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా చేరే నీరుతో శరీరంలోని ద్రవాలు పలచబడి ఫ్ల్యూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఇది అంతిమంగా కోమా, మరణానికి కూడా దారి తీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Water Intoxication: అతిగా నీరు తాగుతున్నారా? వాటర్ ఇంటాక్సికేషన్ గురించి తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: చర్మకాంతి ఇనుమడించాలంటే నీరు తాగాలి.. ఆరోగ్యం, ఫిట్‌‌నెస్‌కు నీరు అత్యవసరం.. ఇలా నిత్యం నీరుకు సంబంధించి అనేక ప్రకటనలు చూస్తుంటారు. దీంతో, కొందరు అతిగా నీరు తాగేస్తుంటారు. ఇలా చేస్తే చాలా రిస్క్‌లో పడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీరు ఎంతగా అవసరమైనప్పటికీ దీనికీ ఓ పరిమితి ఉందని చెబుతున్నారు (Water Intoxication).

Viral: రోజూ ఈ టైంలో 15 నిమిషాల పాటు ఎండలో నిలబడితే సమృద్ధిగా విటమిన్ డీ!


అతిగా నీరు తాగినా ప్రమాదమే. దీన్ని వాటర్ ఇంటాక్సికేషన్ లేదా హైపోనాట్రేమియా అని వైద్య పరిభాషలో పిలుస్తారు. తక్కువ వ్యవధిలో ఎక్కువగా నీరు తాగినప్పుడు శరీరంలో ఈ పరిస్థితి తలెత్తుతుంది. దీని వల్ల రక్తంలో సోడియం సాంద్రత తగ్గుతుంది. ఇది అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది.

వైద్యులు చెప్పే దాని ప్రకారం, శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌కు సోడియం కీలకం. కణాల లోపల, బయట ఉన్న ఫ్లూయిడ్స్ మధ్య సమతౌల్యాన్ని సోడియం నియంత్రిస్తుంది. అంతేకాకుండా, నాడీకణాల మధ్య సమాచార మార్పిడి, కండరాల పనితీరుకు సోడియం అవసరం. ఇక శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటి కిడ్నీలు తొలగిస్తుంటాయి. అయితే, కిడ్నీల సామర్థ్యానికి మించి నీరు తాగినప్పుడు శరీరంలో అదనంగా నీరు పేరుకుంటుంది. దీంతో, సోడియం సాంద్రత తగ్గిపోతుంది. ఇది చివరకు కణాల్లోకి చేరి అవి వాచేలా చేస్తుంది. ఫలితంగా కణాల పనితీరు చెడిపోతుంది. ఇది వివిధ అవయవాలపై ప్రభావం చూపిస్తుంది.


Turmeric water: ఉదయాన్నే పసుపు నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు!

వైద్యులు చెప్పే దాని ప్రకారం, కిడ్నీలు గంటకు 0.8 నుంచి ఒక లీటర్ నీటిని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. అంతకుమించి నీరు తాగితే నీరు పేరుకుని వివిధ శారీరక ద్రవాల సాంద్రత తగ్గుతుంది. ఇక మెదడు కణాల్లోకి ఈ అదనపు నీరు చెరినప్పుడు వాపు వచ్చి చివరకు ప్రణాంతకంగా మారొచ్చు. మెదడులో ఒత్తిడి పెరిగి సెరిబ్రెల్ ఎడిమాకు దారి తీస్తుంది. తలనొప్పి, ఫిట్స్‌తో మొదలై చివరకు కోమా, మరణం కూడా సంభవిస్తాయి.

వాటర్ ఇంటాక్సికేషన్ లక్షణాలు

వాంతులు, తలనొప్పి, తలతిరిగినట్టు ఉండటం, తికమకగా ఉండటం, అలసట, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో నీరు అదనంగా చేరిందేమోనని సందేహించాలని వైద్యులు చెబుతున్నారు. దీనితో పాటు పలుమార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం, మూత్రం రంగు పల్చబడటం వంటివి కూడా వాటర్ ఇంటాక్సికేషన్‌ను సూచిస్తాయి.

పురుషులు రోజుకు గరిష్ఠంగా 3.7 లీటర్ల నీరు తాగాలి. మహిళలు రోజుకు 2.7 లీటర్ల నీరు తాగాలి. అయితే, పొడి వాతావరణంలో ఉండే వారు, చెమట ఎక్కువగా పట్టేవారికి ఇంతకంటే ఎక్కువ నీరు అవసరం పడొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Read Latest and Health News

Updated Date - Oct 29 , 2024 | 09:19 AM