Share News

లెబనాన్‌పై భూతల దాడులకు సర్వం సిద్ధం!

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:28 AM

ఇజ్రాయెల్‌ పదాతి దళాలు లెబనాన్‌లోకి చొచ్చుకుపోయి.. భూతల దాడులకు సర్వం సిద్ధం చేస్తున్నాయి. సరిహద్దుల్లో వైమానిక దళాలు, పారాట్రూపర్లతోపాటు.. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) పదాతి దళాలు యుద్ధ ట్యాంకర్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు.

లెబనాన్‌పై భూతల దాడులకు సర్వం సిద్ధం!

  • సిరియా-లెబనాన్‌ సరిహద్దులపై భీకర దాడులు

  • కుప్పకూలిన అపార్ట్‌మెంట్‌.. 23 మంది మృతి

  • హిజ్బుల్లా వైమానిక దళ కమాండర్‌ సోరౌర్‌ కూడా

  • ఆయుధాల స్మగ్లింగ్‌ టన్నెళ్ల ధ్వంసం

  • హిజ్బుల్లా అంతమే మా లక్ష్యం: నెతన్యాహు

  • భారతీయులు.. వెనక్కి రండి: విదేశాంగ శాఖ

టెల్‌అవీవ్‌/న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: ఇజ్రాయెల్‌ పదాతి దళాలు లెబనాన్‌లోకి చొచ్చుకుపోయి.. భూతల దాడులకు సర్వం సిద్ధం చేస్తున్నాయి. సరిహద్దుల్లో వైమానిక దళాలు, పారాట్రూపర్లతోపాటు.. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) పదాతి దళాలు యుద్ధ ట్యాంకర్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఓ దశలో అమెరికా, ఫ్రాన్స్‌ చొరవతో చర్చల ప్రతిపాదన తెరపైకి వచ్చినా.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మాత్రం తమ దాడులు కొనసాగుతాయని గురువారం తేల్చిచెప్పారు. ఆ వెంటనే ఐడీఎఫ్‌ 7వ బ్రిగేడ్‌ భూతల దాడులపై సరిహద్దుల వద్ద విన్యాసాలు చేసింది. ‘నేషనల్‌ ల్యాండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌’ నేతృత్వంలో ఈ విన్యాసాలు జరిగాయి. మరోవైపు బీరుట్‌, ఇతర ప్రాంతాలపై ఐడీఎఫ్‌ వైమానిక దళం వరుసగా నాలుగో రోజు- గురువారం కూడా గగనతల దాడులను కొనసాగించింది. బీరుట్‌లోని అల్‌-ఖైమ్‌, పశ్చిమ అల్‌-బెక, మష్రా, మిదౌన్‌, అల్‌-మయాదీన్‌ పట్టణాలపై దాడులు జరిగాయి.

అల్‌-ఖైమ్‌లో జరిపిన దాడుల్లో ఓ అపార్ట్‌మెంట్‌ నేలమట్టమవ్వగా.. పలు దుకాణాలు, భవనాలు దెబ్బతిన్నట్లు లెబనాన్‌ వార్తాసంస్థలు తెలిపాయి. హిజ్బుల్లా ఎయిర్‌ యూనిట్‌ కమాండర్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ సోరౌర్‌ లక్ష్యంగా ఈ దాడుల్లో.. ఆయనతోపాటు నలుగురు మృతిచెందినట్లు పేర్కొన్నాయి. సిరియా-లెబనాన్‌ సరిహద్దుల్లోని బాల్బెక్‌పై జరిగిన దాడుల్లో 23 మంది సిరియా శరణార్థులు చనిపోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మృతుల్లో ప్రముఖ సిరియా గాయకుడు అహ్మద్‌ అల్‌-ఖాన్సా కుమారుడు ఉన్నట్లు తెలిపింది. ఈ పరిసరాల్లో.. ముఖ్యంగా బెకా లోయలో సిరియాకు చెందిన 7.8 లక్షల మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నట్లు వివరించింది. గడిచిన నాలుగు రోజుల్లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మరణాల సంఖ్య 630కి చేరినట్లు వెల్లడించింది.


కాగా.. అల్‌-అరబీ టీవీ చానల్‌ ప్రతినిధి రమీజ్‌ అల్‌-ఖాదీ గురువారం లైవ్‌లో ఉండగా.. అతని పైనుంచి ఓ క్షిపణి దూసుకెళ్లిన దృశ్యం నెట్టింట వైరల్‌గా మారింది. తాజా దాడుల్లో లెబనాన్‌-సిరియా మధ్య ఆయుధాల స్మగ్లింగ్‌ కోసం ఉగ్రవాదులు ఉపయోగించే సొరంగాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి(ఐరాస) సర్వసభ్య సమావేశాలకు న్యూయార్క్‌ బయలు దేరిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు.. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ.. హిజ్బుల్లా అంతమే తమ ధ్యేయమని పునరుద్ఘాటించారు. నెతన్యాహుకు మద్దతిస్తున్న విపక్ష నేతలు కూడా.. కాల్పుల విరమణకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని డిమాండ్‌ చేశారు.

ఒకవేళ అదే జరిగితే.. తాము సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగుతామని జేపీపీ చీఫ్‌ ఇతమార్‌ బెన్‌-గ్విర్‌ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇంకోవైపు.. లెబనాన్‌లోని భారతీయులు వెనక్కి రావాలని విదేశాంగ శాఖ కోరింది. లెబనాన్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం ఈ మేరకు వరుస ట్వీట్లు చేసింది. లెబనాన్‌లో 4 వేల మంది వరకు భారతీయులున్నట్లు వెల్లడించింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణను పాటించాలని భారత్‌కు చెందిన ఏడు వామపక్ష పార్టీలు-- సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌), ఏఐఎ్‌ఫబీ, ఆర్‌ఎ్‌సపీ డిమాండ్‌ చేశాయి. గురువారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయా పార్టీల ముఖ్య నేతలు ఈ తీర్మానంపై సంతకాలు చేశారు.

Updated Date - Sep 27 , 2024 | 03:28 AM