కీలక నిర్ణయాలన్నీ తొలి 100 రోజుల్లోనే
ABN , Publish Date - Apr 01 , 2024 | 04:12 AM
రాబోయే లోక్‌సభ ఎన్నికలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాదని, ‘వికసిత్ భారత్’ నిర్మాణం కోసం జరుగుతున్నవని ప్రధాని మోదీ అన్నారు.
దేశ ప్రగతి కోసం వచ్చే ఐదేళ్లకు రోడ్‌మ్యాప్ సిద్ధం: మోదీ
ప్రజలు ఇప్పటి వరకు ట్రైలరే చూశారు
దేశంలో అసలు అభివృద్ధి ముందుంది
మాది అవినీతిపై పోరాటం.. విపక్షాలది
అవినీతిపరులను కాపాడే యత్నం
చౌధరి చరణ్‌సింగ్‌కు ఇండియా
కూటమి సరైన గౌరవం ఇవ్వలేదు
కాంగ్రెస్, ఎస్‌పీ నేతలు ఇంటింటికీ
వెళ్లి క్షమాపణ చెప్పాలి: ప్రధాని మోదీ
మేరఠ్, మార్చి 31: రాబోయే లోక్‌సభ ఎన్నికలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాదని, ‘వికసిత్ భారత్’ నిర్మాణం కోసం జరుగుతున్నవని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రచారం ప్రారంభించారు. మూడోసారి అధికారం చేపట్టడానికి తమ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి వచ్చే ఐదేళ్లకు సంబంధించిన రోడ్‌మ్యా్‌పను సిద్ధం చేస్తోందని తెలిపారు. మొదటి 100 రోజుల్లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై శరవేగంగా పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. దేశ ప్రజలు గత పదేళ్లలో ట్రైలర్‌ను మాత్రమే చూశారని, అసలు అభివృద్ధి ముందుందని చెప్పారు. 2024 ఎన్నికల తీర్పుతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించేందుకు దోహదం చేయనుందన్నారు. ఈ సందర్భంగా మేరట్‌లో నిర్వహించిన మెగా ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని విపక్షాలపై విరుచుకుపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా తాము తీసుకుంటున్న చర్యలతో కొందరు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల కొందరు ఇండియా కూటమి నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నారని ఆరోపించారు.
ఈ ఎన్నికలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్డీయేకు, అవినీతిపరులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న మరో వర్గానికి మధ్య సాగుతున్నాయన్నారు. ‘భ్రష్ఠాచార్ హఠావో’ అని తాము పిలుపునిస్తుంటే వారు మాత్రం ‘భ్రష్ఠాచారీ బచావో’ అని అంటున్నాయని దుయ్యబట్టారు. గత పదేళ్లలో తాము తీసుకున్న చర్యల ఫలితంగానే నేడు అవినీతిపరులు జైల్లో ఉన్నారని తెలిపారు. అవినీతిపరులపై విచారణ జరపడమే కాకుండా ప్రజల నుంచి వారు దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకే ఇప్పిస్తున్నామని వెల్లడించారు. పేదరికంలో జీవించిన తనకు ప్రతి పేదవాడి బాధ, కష్టాలు తెలుసని, అందుకే పేదల ప్రతి సమస్యను పరిష్కరించేందుకు పథకాలు రూపొందించినట్లు చెప్పారు. చౌధరి చరణ్‌సింగ్ వంటి విప్లవ వీరులను దేశానికి అందించిన విప్లవాల పురిటిగడ్డ మేరట్ అని మోదీ కొనియాడారు. రైతులను ద్వేషించే ఇండియా కూటమి చౌధరి చరణ్‌సింగ్‌కు సరైన గౌరవం కూడా ఇవ్వలేదని విమర్శించారు. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా విపక్ష నేతలు ఏం చేశారో దేశం మొత్తం చూసిందన్నారు. భారతరత్న అవార్డు గురించి మాట్లాడేందుకు మా సోదరుడు జయంత్ చౌధరి లేచినప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో పాటు ఆయన్ను కించపరిచేందుకు కూడా యత్నించారని మోదీ గుర్తుచేశారు.
ఎన్నికల బాండ్ల రద్దుపై విపక్షాలు పశ్చాత్తాప పడతాయ్
న్యూఢిల్లీ, మార్చి 31: తమ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల విధానాన్ని మోదీ సమర్థించుకున్నారు. ఈ బాండ్లే పెద్ద కుంభకోణమని విపక్షాలు విమర్శిస్తుండగా మోదీ మాత్రం వీటి ద్వారా పారదర్శకత పెరిగిందని అన్నారు. 2014కు ముందు ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టేవారో ఎవరికీ తెలిసేది కాదని, ఇప్పుడు ఎన్నికల బాండ్ల పుణ్యమా అని అన్ని వివరాలు అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. వీటిని రద్దు చేయించిన విపక్షాలు అనంతర కాలంలో పశ్చాత్తాపడుతాయన్నారు. ఆదివారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.