Share News

వజ్రధూళితో భూతాపానికి చెక్‌!

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:49 AM

కర్బన ఉద్గారాలకు చెక్‌ పెట్టాలంటే ఏం చేయాలన్న అంశంపై శాస్త్రజ్ఞులు చాలాకాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

వజ్రధూళితో భూతాపానికి చెక్‌!

జర్మనీ వాతావరణ శాస్త్రజ్ఞుల ప్రతిపాదన

కర్బన ఉద్గారాలకు చెక్‌ పెట్టాలంటే ఏం చేయాలన్న అంశంపై శాస్త్రజ్ఞులు చాలాకాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే.. జ్యూరిక్‌ (జర్మనీ)లోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అట్మాస్ఫియరిక్‌ అండ్‌ క్లైమేట్‌ సైన్స్‌’ శాస్త్రజ్ఞులు ‘స్ట్రాటోస్ఫియరిక్‌ ఏరోసాల్‌ ఇంజెక్షన్‌ (ఎస్‌ఏఐ)’ అనే విధానంపై రిసెర్చ్‌ చేశారు. అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే.. భూమిపై ఉండే స్ట్రాటో ఆవరణంలో రేణువులను వెదజల్లడం. అప్పుడు సూర్యకాంతి వాటిపై పడి ఎక్కువ భాగం పైకే ప్రతిఫలిస్తుంది. ఫలితంగా భానుడి తీక్షణత తగ్గి భూతాపం తగ్గుతుంది. ఇందుకు సల్ఫర్‌ డయాక్సైడ్‌ను ఉపయోగించాలనుకున్నారు. కానీ, దానివల్ల ఆమ్ల వర్షాలు కురిసే ముప్పుండడం, ఓజోన్‌ పొర దెబ్బతింటుందని తెలియడంతో.. మరో ఆరు రకాల పదార్థాలపై దృష్టి సారించారు. అవి.. వజ్రాల పొడి, క్యాల్సైట్‌, అల్యూమినియం, సిలికాన్‌ కార్బైడ్‌, అనటేజ్‌, రుటైల్‌. 45 ఏళ్లపాటు ఏటా స్ట్రాటో ఆవరణంలో ఈ పార్టికల్స్‌ను వెదజల్లితే దేని ప్రభావం ఎలా ఉంటుందో కంప్యూటర్‌ నమూనాల ద్వారా విశ్లేషించి, చివరికి వజ్రధూళే అన్నింటికన్నా ఉత్తమం అని తేల్చారు. దానివల్ల భూతాపం 1.6 డిగ్రీల మేర తగ్గిపోతుందని వారి విశ్లేషణలో వెల్లడైంది. కానీ.. దానికి అయ్యే ఖర్చు ఏకంగా ఏడాదికి 200 ట్రిలియన్‌ డాలర్లు. ఒక ట్రిలియన్‌ డాలర్‌ అంటేనే మన కరెన్సీలో దాదాపు రూ.84.4 లక్షల కోట్లు! ఇక 200 ట్రిలియన్‌ డాలర్లంటే ఎంత ఖర్చో ఊహించుకోండి!!

Updated Date - Dec 23 , 2024 | 03:49 AM