Mamata Banerjee: ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తున్న కేంద్రం.. దీదీ ఫైర్
ABN , Publish Date - Feb 18 , 2024 | 06:00 PM
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ బెంగాల్ ప్రజల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసిందని అన్నారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతాబెనర్జీ (Mamata Banerjee) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ బెంగాల్ ప్రజల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసిందని అన్నారు. దీంతో బ్యాంకు అకౌంట్ల ద్వారా ప్రభుత్వం అందించే సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందకుండా చేసిందని చెప్పారు.
బీర్బూమ్ జిల్లాలో ఆదివారంనాడు జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఆధార్ కార్డులను వాళ్లు (కేంద్రం) డీయాక్టివేట్ చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చాలా జిల్లాల్లో ఆథార్ కార్డులను డీయాక్టివేట్ చేశారని చెప్పారు. ఇందువల్ల బ్యాంకుల ద్వారా లక్ష్మీ భండార్ ప్రయోజనాలు, ఉచిత రేషన్ ఎన్నికల ముందు ప్రజలకు అందకుండా చేస్తోందన్నారు. అయితే, ఆధార్ కార్డులు లేకపోయినా పథకాల లబ్దిదారులకు తాము చెల్లింపులు జరుతామని భరోసా ఇచ్చారు. ఒక్క లబ్దిదారుడిని కూడా నష్టపోనీయమని చెప్పారు. హర్యానా, పంజాబ్ రైతులు జరుపుతున్న ఆందోళనలపై మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్‌లోని రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం లేదన్నారు. ''రైతుల నిరసనలకు నేను సెల్యూట్ చేస్తున్నారు. వారిపై దాడులను ఖండిస్తున్నాను'' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.