Doctors Protest: భద్రత లేకుండా.. డ్యూటీ చేయం.. వైద్యుల నిరసనలతో దేశవ్యాప్తంగా ఓపీడీ సేవల్లో అంతరాయం
ABN , Publish Date - Aug 13 , 2024 | 11:43 AM
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్‌లో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనకు నిరసనగా, హాస్పిటల్స్‌లో భద్రతపై సోమవారం దేశవ్యాప్త ఆందోళనలకు దిగిన వైద్యులు మంగళవారం కూడా కొనసాగిస్తున్నారు. హాస్పిటల్స్ వద్ద సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్‌లో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనకు నిరసనగా, హాస్పిటల్స్‌లో భద్రతపై సోమవారం దేశవ్యాప్త ఆందోళనలకు దిగిన వైద్యులు మంగళవారం కూడా కొనసాగిస్తున్నారు. హాస్పిటల్స్ వద్ద సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
‘నో సేఫ్టీ.. నో డ్యూటీ’ అంటూ నినాదాలు చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా విధులకు తిరిగి హాజరయ్యేందుకు నిరాకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. దీంతో పలు నగరాల్లో ఓపీ సేవలకు అంతరాయం ఏర్పడింది. కాగా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA) ఎంపిక చేసిన సేవలకు దూరంగా ఉంటామని సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో వైద్యురాలి హత్య చరిత్ర అత్యంత అవమానకరమైన ఘటన అని, వైద్యులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు అసోసియేషన్ ఒక లేఖ కూడా రాసింది.
డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలి హత్య ఘటనకు బాధ్యులైన అధికారులు అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, ఈ కేసులో సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని అని కూడా విజ్ఞప్తి చేసింది. కాగా వైద్యుల ఆందోళన తీవ్ర కోల్‌కతా నగరంలో ఎక్కువగా ఉంది. దీంతో నగరంలోని చాలా ఆసుపత్రులలో చికిత్స సేవలు దెబ్బతిన్నాయి. నిరసనల కారణంగా పలువురు రోగులు, వారి బంధువులు అసౌకర్యానికి గురవుతున్నామని చెబుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో ఓపీడీ గది తలుపులు బద్దలు..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీలో వైద్యులు నిరసనకు దిగడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నిరసన తెలుపుతున్న వైద్యులు ఇవాళ ఉదయం గుమిగూడి సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అయితే చికిత్స అందించాలని రోగులు, వారి బంధువులు డిమాండ్ చేశారు. దీంతో అక్కడి ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. కొందరు రోగుల బంధువులు వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ మూసి ఉన్న ఓపీడీ గది తలుపులు బద్దలుకొట్టారు.
అసలేం జరిగింది?
కోల్‌కతాలోని ప్రభుత్వం ఆస్పత్రి అయిన ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై గత గురువారం రాత్రి హత్యాచారం జరిగింది. 32 ఏళ్ల వైద్యురాలిపై దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో బాధితురాలి కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు. అంతేకాదు ఎడమ కాలు, మెడ, కుడి చేయి, ఉంగరపు వేలు, పెదవులపై కూడా గాయాలు అయినట్టు నిర్ధారణ అయ్యింది.