CM Hemanth Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాస ప్రాంగణంలోకి ప్రవేశించిన ఈడీ అధికారులు
ABN , Publish Date - Jan 29 , 2024 | 11:43 AM
భూ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో మనీల్యాండరింగ్ కోణంలో ప్రశ్నించేందుకు తొమ్మిది సార్లు నోటీసులు పంపించినా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించకపోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. సీఎం పదవితో పాటు జేఎంఎం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: భూ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో మనీల్యాండరింగ్ కోణంలో ప్రశ్నించేందుకు తొమ్మిది సార్లు నోటీసులు పంపించినా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించకపోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. సీఎం పదవితో పాటు జేఎంఎం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడంతో షెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టి శనివారం రాత్రి ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జనవరి 27న సమన్లు జారీ చేసిన ఈడీ మనీలాండరింగ్ కేసులో జనవరి 29 లేదా జనవరి 31న విచారణను ధృవీకరించాలని కోరింది. అయితే ఈ సమన్లపై ఆయన స్పందించలేదు.
కాగా జనవరి 20న రాంచీలోని సోరెన్ అధికారిక నివాసానికి దర్యాప్తు అధికారులు వెళ్లి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. దాదాపు ఏడు గంటలపాటు ప్రశ్నించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు. ఆ రోజు విచారణ పూర్తికాకపోవడంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేశారు. కాగా భూకుంభ కోణం ఆరోపణలకు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.