మధుమేహుల్లో నాలుగో వంతు భారత్‌లోనే
ABN , Publish Date - Nov 16 , 2024 | 04:27 AM
ప్రపంచానికి అతిపెద్ద సవాల్ విసురుతున్న సమస్యల్లో మధుమేహం ఒకటి. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 82.8 కోట్ల మంది డయాబెటి్‌సతో బాధపడుతున్నారని...
ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్లు.. భారత్‌లో 21.2 కోట్ల మంది బాధితులు
న్యూఢిల్లీ, నవంబరు 15: ప్రపంచానికి అతిపెద్ద సవాల్ విసురుతున్న సమస్యల్లో మధుమేహం ఒకటి. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 82.8 కోట్ల మంది డయాబెటి్‌సతో బాధపడుతున్నారని, ఇందులో నాలుగో వంతు మంది భారత్ (21.2 కోట్లు)లోనే ఉన్నారని ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ మధుమేహ దినోత్సవం (నవంబరు 14) సందర్భంగా ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం.. 1990 లెక్కలతో పోలిస్తే ఈ 82.8 కోట్ల సంఖ్య నాలుగు రెట్లు అధికం. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ఈ సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపించిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన నాన్ కమ్యూనబుల్ డిసీజ్ రిస్క్ ఫ్యాకర్టర్ కొలాబరేషన్ (ఎన్‌సీడీ-ఆర్‌ఐఎ్‌ససీ) పరిశోధకులు తెలిపారు.
1990-2022 మధ్యకాలంలో అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో మధుమేహ చికిత్స రేట్లు తక్కువగానే ఉన్నాయని, కేసులు మాత్రం ఎక్కువగా పెరిగాయని వారు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న 82.8 కోట్ల మందిలో ఒక్క భారత్‌లోనే 21.2 కోట్ల మంది ఉన్నారని, ఆ తర్వాత చైనాలో 14.8 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. అమెరికాలో 4.2 కోట్లు, పాకిస్థాన్‌లో 3.6 కోట్లు, బ్రెజిల్‌లో 2.2 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. 2022లో 30 ఏళ్లు పైబడిన బాధితుల్లో 44.5 కోట్ల మంది అసలు మధుమేహానికి చికిత్స తీసుకోలేదని, వారిలో 13.3 కోట్ల మంది భారత్‌లోనే ఉన్నారని వెల్లడించారు.