Supreme CJI: సక్సెస్ అంటే ఇదీ.. పోగొట్టుకున్న చోటే సాధించారు..జస్టిస్ ఖన్నా రియల్ స్టోరీ
ABN , Publish Date - Nov 11 , 2024 | 03:50 PM
2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులైనప్పుడు.. మొదటి రోజున మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా గతంలో సేవలు అందించిన కోర్టు రూంలోనే విధులు నిర్వర్తించారు.
ఢిల్లీ: సుప్రీం కొత్త సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను ప్రకటించగానే ఆయన పేరు దేశమంతా మార్మోగిపోయింది. అయితే, జస్టిస్ ఖన్నా ఈ ఘనతను అంత తేలికగా సాధించలేదు. ఈ పదవిని చేపట్టడానికి ఆయన కుటుంబం 47 ఏళ్ల పాటు ఎదురుచూసింది. ఎందుకంటే, జస్టిస్ ఖన్నా పినతండ్రి జస్టిస్ హన్స్ రాజ్ ఖన్నా కూడా సుప్రీం న్యాయమూర్తిగా ఎంతో కాలం సేవలందించారు. అయితే, భారత ప్రధాన న్యాయమూర్తి పదవి తృటిలో ఆయన చేజారింది.
సీజేఐ రేసులో ఉన్నప్పటికీ..
1912లో జన్మించిన జస్టిస్ హన్స్ రాజ్ ఖన్నా అమృత్‌సర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1952లో జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులైన ఆయన ఆ తర్వాత ఢిల్లీ, పంజాబ్ హైకోర్టులకు న్యాయమూర్తి అయ్యారు. 1971లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.1977లో భారత ప్రధాన న్యాయమూర్తి పదవి రేసులో ఉన్నారు. అనూహ్యంగా ఆయనకు ఆ పదవి దక్కకపోగా.. న్యాయమూర్తి పదవికి సైతం జస్టిస్ హన్స్ రాజ్ ఖన్నా రాజీనామా చేశారు.
ఆ తీర్పు అంతా మార్చేసింది..
1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. 1976లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏడీఎం జబల్‌పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసును విచారించింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును తాత్కాలికంగా నిలిపివేయవచ్చని తీర్పు చెప్పింది. ఆ 4:1 తీర్పులో జస్టిస్ ఖన్నా మాత్రమే భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. మెజారిటీలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఏఎన్ రే, జస్టిస్ ఎంహెచ్ బేగ్, జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ పీఎన్ భగవతి ఉన్నారు. తీర్పు వెలువడిన తొమ్మిది నెలల తర్వాత, అత్యున్నత పదవి వరుసలో ఉన్న జస్టిస్ ఖన్నాను పక్కనబెట్టి జస్టిస్ బేగ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. వెంటనే జస్టిస్ ఖన్నా రాజీనామా చేశారు.1999లో ఆయనకు పద్మవిభూషణ్ లభించింది. 95 ఏళ్ల వయసులో 2008లో ఆయన మరణించారు.
ఆయన కల నిజం చేసేందుకు లా చదివి..
సీఏ అవ్వాల్సిన జస్టిస్ సంజీవ్ ఖన్నా తన పినతండ్రి స్పూర్తితో న్యాయవాద వఈత్తిలోకి అడుగుపెట్టారు. నిరాడంబరత, క్రమశిక్షణ వంటి విషయాలను ఆయన నుంచే పునికి పుచ్చుకున్నారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులైనప్పుడు.. మొదటి రోజున తన అంకుల్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా గతంలో సేవలు అందించిన కోర్టు రూంలోనే విధులు నిర్వర్తించారు. ఇప్పటికీ జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నాకు చెందిన తీర్పు కాపీలు, నోట్సులు, రిజిస్టర్లు తన వద్ద ఉన్నాయని.. రిటైరయ్యాక వాటిని సుప్రీంకోర్టు లైబ్రరీకి అందిస్తానని తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Rushikonda : రుషికొండ ఫైళ్లు మాయం!
AP Assembly Session: ఏపీ వార్షిక బడ్జెట్ ఎంతో తెలుసా
Read Latest AP News And Telugu News