PM Modi : ‘మహాలక్ష్మి’తో మెట్రోకు దెబ్బ!
ABN , Publish Date - May 18 , 2024 | 06:15 AM
‘‘బస్సు ప్రయాణాన్ని (మహిళలకు) ఉచితం చేశారు. మెట్రోను ఖాళీ చేశారు. మరిప్పుడు మెట్రో ఎలా నడుస్తుంది? దేశం ఎలా ముందుకు సాగుతుంది?’’ ..అంటూ ప్రధాని మోదీ కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకంపై పరోక్ష విమర్శలు చేశారు!
ఎన్నికల కోసం ఖజానాను ఖాళీ చేసే హక్కు ఎవరికీ లేదు: మోదీ
న్యూఢిల్లీ, మే 17: ‘‘బస్సు ప్రయాణాన్ని (మహిళలకు) ఉచితం చేశారు. మెట్రోను ఖాళీ చేశారు. మరిప్పుడు మెట్రో ఎలా నడుస్తుంది? దేశం ఎలా ముందుకు సాగుతుంది?’’ ..అంటూ ప్రధాని మోదీ కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకంపై పరోక్ష విమర్శలు చేశారు! ఈ పథకం వల్ల ట్రాఫిక్‌కు, పర్యావరణానికీ ఇబ్బందులు కలుగుతాయని వ్యాఖ్యానించారు.
అసలు.. ఎన్నికల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసే హక్కు ఎవ్వరికీ లేదని ఆయన తేల్చిచెప్పారు. రేవంత్ సర్కారు ‘మహాలక్ష్మి’ పేరిట ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల హైదరాబాద్ మెట్రోకు నష్టాలు వస్తున్నందున 2026 తర్వాత మెట్రోను విక్రయించే యోచన ఉందని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ శంకర్ రామన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
‘ఇండియా టుడే’ ప్రతినిధి ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావనకు తేగా.. ‘‘ఒక నగరంలో మెట్రో రైళ్లు అందుబాటులోకి తెస్తారు. అంతలోనే.. ఎన్నికల్లో గెలవడం కోసం మహిళలకు ఉచిత బస్సు పథకం హామీ ఇస్తారు.
అంటే.. మెట్రో ప్రయాణికుల్లో 50 శాతాన్ని తగ్గించేసినట్టే’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఈ పథకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు 2019 నుంచి అమలుచేస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా.. ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల్లోని ‘మహాశక్తి’ కింద ఈ పథకం కూడా ఉండడం గమనార్హం.