Share News

Smriti Irani: అమేథి నుంచి పోటీ చేయండి.. రాహుల్‌కు కేంద్ర మంత్రి సవాల్

ABN , Publish Date - Feb 19 , 2024 | 06:18 PM

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాలు చేశారు. అమేథీ ప్రజలు ఎప్పుడో రాహుల్‌ను మరిచిపోయారని చెప్పారు.

Smriti Irani: అమేథి నుంచి పోటీ చేయండి.. రాహుల్‌కు కేంద్ర మంత్రి సవాల్

లక్నో: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) సవాలు చేశారు. అమేథీ ప్రజలు ఎప్పుడో రాహుల్‌ను మరిచిపోయారని చెప్పారు. ప్రస్తుతం అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గానికి స్మృతి ఇరానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జరిగిన 'జన్ సంవాద్' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాహుల్ సైతం 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో భాగంగా అమేథీ చేరుకున్నారు.


''2019లో ఆయన (రాహుల్) అమేథీని విడిచిపెట్టారు. ఈరోజు ఆయనను అమేథీ విడిచిపెట్టేసింది. ఆయనకు అంత ధీమా ఉండుంటే అమేథీని విడిచి వయనాడ్ (రాహుల్ నియోజకవర్గం)కు వెళ్లి ఉండేవారు కాదు. అమేథీ నుంచి ఆయనను పోటీ చేయనీయండి చూద్దాం'' అని స్మృతి ఇరానీ అన్నారు. రాహుల్‌ గాంధీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అమేథీలోని ఖాళీ రోడ్లే చెబుతాయంటూ ఛలోక్తి విసిరారు.


ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉన్నప్పటికీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ 55,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. యూపీలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు గెలుచుకుంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే రాయబరేలి నుంచి గెలిచారు. రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిని చవిచూడగా, కేరళలోని వయనాడ్‌లో గెలిచారు.

Updated Date - Feb 19 , 2024 | 06:18 PM