ఉద్యోగాల భర్తీలో కోటాల రద్దు
ABN , Publish Date - Jul 22 , 2024 | 04:43 AM
బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర హింసాకాండకు దారి తీసిన రిజర్వేషన్లపై ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మహిళలు, వెనుకబడిన జిల్లాలకు ఇస్తున్న రిజర్వేషన్లను పూర్తిగా తొలగించటమేగాక..
విద్యార్థుల నిరసన నేపథ్యంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రిజర్వేషన్లు 56 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు
ఓపెన్ క్యాటగిరీలో 93% ఉద్యోగాలు
ఢాకా, అగర్తల, జూలై 21: బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర హింసాకాండకు దారి తీసిన రిజర్వేషన్లపై ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మహిళలు, వెనుకబడిన జిల్లాలకు ఇస్తున్న రిజర్వేషన్లను పూర్తిగా తొలగించటమేగాక.. సమరయోధుల కుటుంబీకులకు ఇస్తున్న 30ు రిజర్వేషన్‌ను 5 శాతానికి తగ్గించింది. మైనారిటీలకు, దివ్యాంగుల కోటాను కేవలం 2 శాతానికి పరిమితం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలలో 93ు ఖాళీలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని, మిగిలిన 7 శాతంలో 5ు సమర యోధుల కుటుంబాలకు, 2ు దేశంలోని మైనారిటీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని ఆదివారం తీర్పు చెప్పింది. కోటాల రద్దు కోసం విద్యార్థుల ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న విద్యార్థి సంఘాలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూనే, రిజరేషన్లను పూర్తిగా రద్దు చేసే వరకూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించాయి. మరోవైపు, దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని షేక్‌హసీనా ఆదివారం త్రివిధ దళాల అధిపతులతో సమీక్ష జరిపారు.
గతంలోనూ తీవ్ర వ్యతిరేకత
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 44 శాతం ఉద్యోగాలను ఓపెన్ క్యాటగిరీలో భర్తీ చేస్తుండగా, సమరయోధుల కుటుంబాలకు 30 శాతం, మహిళలకు 10 శాతం, వెనుకబడిన జిల్లాలకు 10 శాతం, మైనారిటీలకు 5 శాతం, దివ్యాంగులకు 1 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అయితే, స్వాతంత్య్ర సమరయోధుల కోటా రద్దు కోసం విద్యార్థులు 2018లో పెద్ద ఎత్తున ఉద్యమించారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధాన్ని నిర్వహించిన అవామీలీగ్ పార్టీ (ప్రస్తుత అధికారపక్షం) మద్దతుదారులకు అనుచిత లబ్ధి కలిగించటానికే సమరయోధుల కోటాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అన్ని కోటాలనూ తొలగించి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల భర్తీని చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అమలును నిలిపివేశారు. అయితే, గత నెలలో రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ హైకోర్టు తీర్పునివ్వటంతో మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండలో దాదాపు 103 మంది మరణించారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. సరిహద్దుల వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న బీఎ్‌సఎఫ్ హై అలర్ట్‌లో ఉంది. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ నుంచి 4,500 మంది భారత విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు.
బంగ్లా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తాం: మమత
కోల్‌కతా, జూలై 21: బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే శరణారుఽ్థలకు రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ బెంగాల్ సీఎం మమత ప్రకటించారు. ఆదివారం కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అమరవీరుల స్మారక దినోత్సవ మెగా ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై వారు విమర్శలు గుప్పించారు. బెదిరింపుల ద్వారా అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని జోస్యం చెప్పారు. కాగా, బంగ్లాదేశ్ శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తామన్న మమత ప్రకటనను కేంద్రం ఖండించింది. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. మమత ప్రకటన బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు పశ్చిమబెంగాల్ నుంచి ఝార్ఖండ్ దాకా ఆశ్రయం కల్పించి ఎన్నికల్లో గెలవాలన్న ఇండియా కూటమి కుట్రలో భాగమేనని బీజేపీ ఆరోపించింది. మరోవైపు, ‘‘బెంగాల్- హిందూస్థాన్ మధ్య సత్సంబంధాలనే కోరుకుంటున్నా’’ అంటూ మమత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టిస్తున్నాయి. ‘‘భారతదేశంలో పశ్చిమ బెంగాల్ భాగం కాదని మమతా బెనర్జీ భావిస్తున్నారా’’ అంటూ బీజేపీ నేత నళిన్ కోహ్లీ ప్రశ్నించారు.