Share News

Actor Rajaravindra Interview : వేషం చిన్నదైనా... పెద్దదైనా అదే ఉత్సుకత!

ABN , Publish Date - Apr 21 , 2024 | 04:18 AM

తెలుగు చలనచిత్ర రంగంలోని సీనియర్‌ నటుల్లో రాజా రవీంద్ర ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా అనేకమంది హీరోలకు మేనేజర్‌గా, నిర్మాతగా బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఆయన ప్రధానమైన

Actor Rajaravindra Interview : వేషం చిన్నదైనా... పెద్దదైనా అదే ఉత్సుకత!

తెలుగు చలనచిత్ర రంగంలోని సీనియర్‌ నటుల్లో రాజా రవీంద్ర ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా అనేకమంది హీరోలకు మేనేజర్‌గా, నిర్మాతగా బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఆయన ప్రధానమైన పాత్రలో నటించిన ‘సారంగదరియా’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాజారవీంద్రను ‘నవ్య’ పలుకరించింది.

‘సారంగదరియా’ ఎలా ఉండబోతోంది?

ఇది మన చుట్టూ ఉన్న సమాజంలోని కథ. దీనిలో పాత్రలన్నిటినీ మనం ప్రతిరోజూ చూస్తేనే ఉంటాం. ఒక మధ్యతరగతి తండ్రి... తాను ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచిన ముగ్గురు పిల్లలు మూడు చెడు మార్గాల్లోకి వెళితే, ఆ సమస్యను ఎలా పరిష్కరించాడనేదే ఈ కథ. చాలా హృద్యంగా ఉంటుంది. మన సమాజంలో వస్తున్న మార్పులకు అద్దం పడుతుంది. చాలా మంది తండ్రులు ఈ కథకు కనెక్ట్‌ అవుతారు. సన్నివేశాలన్నీ మనకు తెలిసినట్లే అనిపిస్తాయి. చాలాకాలం తర్వాత ఒక మంచి పాత్ర... ఒక ముఖ్యమైన పాత్రలో నటించాను.

ఇటీవల... మధ్యతరగతి వారికి సంబంధించిన కథలు తక్కువగా వస్తున్నాయి కదా!

ప్రేక్షకుల్లో 90శాతం మంది మధ్యతరగతివారే. కానీ వారిలో ఎక్కువమంది పాన్‌ ఇండియా ఆకర్షణలో పడ్డారు. సమాజంలోని వాస్తవికతకు దూరం అయిపోతున్నారు. భారీగా రకరకాల హంగులతో తీస్తేనే సినిమా చూస్తున్నారు. లోబడ్జెట్‌ సినిమాలు థియేటర్‌లో రిలీజ్‌ కావటం కష్టమవుతోంది. దీనికి ఓటీటీ కూడా ఒక కారణమే. ఓటీటీలో భారీ బడ్జెట్‌ చిత్రాలే కొంటున్నారు. దాంతో నిర్మాతలు కూడా వాటివైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మధ్యతరగతి వారికి సంబంధించిన కథలు తగ్గిపోతున్నాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కొన్నిసార్లు కంటెంట్‌ బలంగా ఉన్న కథలకు ఆదరణ లభిస్తోంది. ‘బలగం’లాంటివి ఆ కోవకు వస్తాయి.

నేటి సినిమాల్లో హీరో క్యారెక్టర్ల ప్రవర్తన పట్ల కూడా కొంత విమర్శ వినబడుతోంది?

‘అర్జున్‌రెడ్డి, డీజే టిల్లు’ లాంటి విజయవంతమైన సినిమాలను దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారనుకుంటున్నా! నా ఉద్దేశంలో సినిమాకు ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం వస్తారు. దీనిలోనే సందేశం కూడా ఉండాలి. మందును తీపి గుళికల్లో పెట్టి ఇచ్చినట్లు ఉంటే మంచిది. లేకపోతే ప్రేక్షకుడికి బోర్‌ కొడుతుంది. సోషల్‌ మీడియా వ్యాప్తి తర్వాత ఏకాగ్రతతో కూర్చుని ఎవరూ ఏ కంటెంట్‌ చూడటంలేదు. ఏకాగ్రత చెదురుతోందనే సమయానికి వారికో థ్రిల్‌, కొత్తదనం కావాలి. ఈ మధ్య ‘డీజే టిల్లు’ లాంటి సినిమాలు హిట్‌ కావటానికి కారణం... పాత్రల చిత్రీకరణలో కొత్తదనం. కొత్త తరాన్ని ఆకర్షించే డైలాగులు. ఇవి చురుక్కుమనిపించాలి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వాలి. అప్పుడే సినిమా హిట్‌ అవుతుంది.

అయితే కథకు ప్రాధాన్యత పోయినట్లేనా? మన దగ్గర మంచి కథలు రావటంలేదనే వాదన ఉంది కదా!

మనకు మంచి కథలు రావటంలేదనేది పాక్షికంగా సత్యం. అయితే మంచి రైటర్స్‌ కొరత అయితే ఉంది. ఎందుకంటే గత 20 ఏళ్లుగా రైటర్సే డైరక్టర్స్‌గా మారిపోతున్నారు. ఒకప్పుడు రైటర్స్‌ వేరు. డైరక్టర్స్‌ వేరు. రచన వేరు. అన్నీ వేర్వేరు క్రాఫ్ట్స్‌. ఒక రచయిత రాసింది చదివి మనకు నచ్చినట్లు ఊహించుకోవచ్చు. అందరికీ నచ్చేలా కథను తెరకెక్కించేవాడే నిజమైన డైరక్టర్‌. కొందరికి రెండింటినీ సమర్థించే సామర్థ్యముంటుంది. లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. శ్రీదర్శి పన్నా, డైమండ్‌ రత్నబాబు, మచ్చ రవి లాంటి మంచి రైటర్స్‌ దర్శకత్వం మార్గంలోకి వెళ్లారు. నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఇంకో విషయం... మంచి కథలు దొరకకపోవటంవల్ల ప్రాజెక్ట్స్‌ టేకప్‌ చేయని దర్శకులు కూడా ఉన్నారు.

మీ దృష్టిలో ఓటీటీవల్ల చిత్ర నిర్మాణంలో ఎలాంటి సమస్యలు వచ్చాయి?

నా ఉద్దేశంలో సినిమాలు తీయాలా వద్దా అని కొందరు పెద్ద నిర్మాణ సంస్థలు సందిగ్థంలో పడటానికి ఓటీటీలే కారణం. ఓటీటీ రాకముందు బడ్జెట్‌లు కంట్రోల్‌లో ఉండేవి. అవి వచ్చాక ఒక దశలో ఆ కంపెనీలు సినిమాకు అయిన ఖర్చును చెల్లించి సినిమాలు కొనటం మొదలుపెట్టాయి. ఉదాహరణకు ఒక సినిమాకు 40 కోట్లు అయిందనుకొందాం. 40 కోట్లు పెట్టి ఒక ఓటీటీ కంపెనీ కొనేస్తే నిర్మాతకు థియేటర్స్‌ మీద.. ఇతర మార్కెట్ల మీద.. మిగిలిన మార్గాల ద్వారా వచ్చేది లాభమే కదా! దీంతో హీరోలు, డైరక్టర్లు రెమ్యూనిరేషన్స్‌ పెంచేశారు. ప్రొడక్షన్‌ కాస్ట్‌ కూడా పెరిగిపోయింది. ప్రస్తుతం ఎదురవుతున్న చిక్కేమిటంటే... ఓటీటీ కంపెనీలు భారీ బడ్జెట్‌ సినిమాలు మాత్రమే కొనటం మొదలుపెట్టాయి. వారిని ఆకర్షించాలంటే భారీ బడ్జెట్‌ చిత్రాలే తీయాలి. అయితే ఆ సినిమాకు అంత రికవరీ సామర్థ్యం ఉందా? లేదా? అనే ఆలోచన లేకుండా కొందరు సినిమాలు తీస్తున్నారు. హిట్‌ అయితే సరే... లేకపోతే మొత్తానికే మోసం వస్తోంది. వీటిని గమనించే చాలా కాలంగా నిర్మాణ రంగంలో ఉన్న నిర్మాతలు పక్కకు తప్పుకున్నారు. మీరు గమనిస్తే... ‘సురేష్‌ ప్రొడక్షన్స్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌’ వంటివారు సినిమాలు తీయటంలేదు. ఒకటి రెండేళ్లలో ఫలితాలు కనబడతాయి. చెరువుల్లో చేపలు తేలినట్లు చాలా మంది తేలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

కొన్నిసార్లు భారీ బడ్జెట్‌ సినిమాలు దెబ్బతింటున్నాయి. దీనికి ప్రేక్షకుల దగ్గరకు సినిమాను తీసుకువెళ్లకలేకపోవటం కూడా ఒక కారణమంటారా?

సోషల్‌ మీడియా ఒక గేమ్‌ ఛేంజర్‌ రోల్‌ను పోషిస్తోంది. పట్టణ ప్రాంతాలే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే నా ఉద్దేశంలో సోషల్‌ మీడియాకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? అనే విషయంలో చాలా మంది నిర్మాతలకు సరైన అవగాహన లేదు. ఉదాహరణకు ఒక సినిమా విడుదలకు ముందు కొన్ని కోట్ల రూపాయలతో మార్కెటింగ్‌ చేస్తున్నారు. ఈ మార్కెటింగ్‌వల్ల ఎంత లాభముంది? ఎంత మందికి సినిమా గురించి తెలుస్తోంది? అనే విషయంపై శాస్త్రీయ అంచనాలేవీ లేవు. ఎక్కువ మంది నిర్మాతలు మార్కెటింగ్‌ స్టాఫ్‌పైనే ఆధారపడతారు. ఒక సినిమా ప్రమోషన్‌ ఒక కాలేజీలో చేశారనుకుందాం. అది హిట్‌ అయితే అందరూ కాలేజీలకు వెళ్లిపోతారు. ఒక గేమ్‌షోకు వెళ్తే ప్రేక్షకులకు దగ్గరవుతామని ఎవరో చెబుతారు. ప్రమోషన్‌కు అక్కడకు వెళ్లిపోతారు. ఒకప్పుడు సీరియల్స్‌లో గెస్ట్‌ ఆర్టి్‌స్టలుగా వెళ్లేవారు. ఇలా ఒక కచ్చితమైన వ్యూహం లేకుండా మార్కెటింగ్‌ చేయటంవల్ల ప్రయోజనం ఉండదు. నా ఉద్దేశంలో ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. దీనిపై ప్రొడ్యుసర్స్‌ కౌన్సిల్‌, ప్రొడ్యుసర్స్‌ గిల్డ్‌ వంటివి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది.

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నిర్మాతలు మార్కెటింగ్‌ విషయంలో అజాగ్రత్తగా ఉంటారంటారా?

ఉండరు. కానీ సినిమా విడుదలయ్యే టెన్షన్‌లో ఉంటారు. ఒకేసారి వంద పనులు చూసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇతరులపై ఎక్కువ ఆధారపడతారు. ఎక్కడో తప్పు జరుగుతోందని తెలుస్తుంది. సినిమా ఫలితం వచ్చిన తర్వాత ఇక ఈ విషయాన్ని పట్టించుకోరు. రిలాక్స్‌ అయిపోతారు. నా ఉద్దేశంలో ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు. అందరు నిర్మాతలు కలిసికట్టుగా కూర్చుని చర్చించాలి. అప్పుడే ఒక పరిష్కారం దొరుకుతుంది.

ప్రతి రోజూ కొత్తదే...

వేషం చిన్నదైనా.. పెద్దదైనా.. నాకు ఒకే విధమైన ఎక్సైట్‌మెంట్‌ ఉంటుంది. ఎందుకంటే వేసే పాత్ర కొత్తగా ఉంటుంది. పని చేసే టీమ్‌ కొత్తదే అయి ఉంటుంది. దాంతో చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇంట్లో కూర్చుంటే ఈ ఉత్సాహం ఉండదు. అందుకే నిజమైన నటుడు చచ్చేదాకా నటిద్దామనే అనుకుంటాడు.

పైరసీ రాక్షసి...

పైరసీ కొన్ని వేల కోట్ల వ్యాపారం. మన పురాణాల్లో ఒక రాక్షసికి ఒక రక్తపు బొట్టు కింద చిందినా... ఆ రక్తపు బొట్టు నుంచి మళ్లీ పుట్టే అవకాశం బ్రహ్మ ప్రసాదిస్తాడు. అప్పుడు ఆ రాక్షసి ఎవరికీ లొంగదు. పైరసీ కూడా అలాంటిదే! ఎప్పటికప్పుడు దీనిపై పోరాటం చేస్తూనే ఉండాలి. కొత్త సినిమాలు వచ్చిన వెంటనే ఇంతకు ముందు వెబ్‌సైట్లలో పెట్టేవారు. ఇప్పుడు లింక్స్‌ వాట్సప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల ద్వారా అందరికీ చేరిపోతున్నాయి. ఈ మధ్య ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమానే తీసుకోండి. విపరీతంగా పైరసీ అయింది. పైరసీ లింక్‌ అందుబాటులోకి వచ్చేస్తే ప్రేక్షకుడు థియేటర్‌కు రాడు. కలెక్షన్లు పడిపోతాయి. ఫోన్‌లో సినిమాలు చూసే సౌలభ్యం వచ్చిన తర్వాత దీనిని అరికట్టడానికి కొత్త మార్గాలు అన్వేషించాలి. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ దీనిపై పోరాటానికి ఒక సెల్‌ను కూడా ఏర్పాటు చేసింది. కానీ పెద్దగా ఫలితం ఉన్నట్లు అనిపించటం లేదు.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Apr 21 , 2024 | 04:18 AM