Katrina Kaif : అలాంటివేమీ పట్టించుకోను!
ABN , Publish Date - Feb 25 , 2024 | 04:57 AM
బాలీవుడ్ నటిగా విపరీతమైన క్రేజ్ ఉన్న కథానాయిక కత్రినా కైఫ్. పెళ్లయ్యాక కూడా కత్రినా హవా ఏమాత్రం తగ్గలేదు. బ్రాండ్ అంబాసిడర్, నటి, ఇన్‌ఫ్లూయన్సర్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా....
బాలీవుడ్ నటిగా విపరీతమైన క్రేజ్ ఉన్న
కథానాయిక కత్రినా కైఫ్. పెళ్లయ్యాక కూడా కత్రినా హవా ఏమాత్రం తగ్గలేదు.
బ్రాండ్ అంబాసిడర్, నటి, ఇన్‌ఫ్లూయన్సర్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా....
ఆమె ఫాలోయింగ్ అదుర్స్. కత్రినా గురించి కొన్ని విశేషాలు...
ఇన్‌స్టాలో కత్రినా కైఫ్‌ను ఎనిమిది కోట్ల మంది ఫాలో అవుతున్నారంటే. ఆమె క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ సంఖ్య.. షుమారు మన రెండు తెలుగురాష్ర్టాల్లో ఉండే జన సంఖ్య అంత! ఇంతటి పాపులారిటీ ఒక్కరోజులో రాలేదు. ఎన్నో ఇబ్బందులు, వివాదాలు, బోయ్‌ఫ్రెండ్స్ సృష్టించిన సమస్యలను దాటి ప్రయాణించింది కత్రినా. అందుకే నిలబడింది. అసలు నటిగానే పనికిరావు అన్న స్థితి నుంచి మంచి నటి అనిపించుకునే స్థాయికి ఎదిగింది. ఇదే ఆమె సక్సెస్!
పదిహేడేళ్ల వయసులో ఇండస్ర్టీలోకి..
కత్రినా కైఫ్ అంటే మనదేశమే అనుకునేంతగా మారిపోయింది. వాస్తవానికి హాంగ్‌కాంగ్‌లో పుట్టి పెరిగిన బ్రిటీష్ యువతి కత్రినా. టీనేజ్‌లోనే ర్యాంప్‌వాక్ చేసింది. బాలీవుడ్ దర్శకుడు కైజద్ చూసి ‘బూమ్’ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా ఫ్లాపయ్యింది. ‘మల్లీశ్వరి’తో తెలుగువారికి పరిచయమైంది. కత్రినా అంటే స్కిన్‌షోనే తప్ప నటనే రాదని చాలామంది తేల్చి చెప్పారు. ఆమె ఏమీ పట్టించుకోలేదు. ‘సర్కార్’, ‘నమస్తే లండన్’, ‘వెల్‌కమ్’, ‘రేస్’లతో విజయకేతాన్ని ఎగరేసింది. ‘రాజ్‌నీతి’ చిత్రంతో నటిగా పేరు తెచ్చుకుంది. ‘తీస్‌మార్ ఖాన్’, ‘జిందగీ నా మిలేగీ దొబారా’, ‘ఏక్తా టైగర్’, ‘జబ్ తక్ హై జాన్’, ‘ధూమ్ 3’ .. మొన్నటి ‘టైగర్ 3’ వరకూ ఆమెకు దాదాపు మంచి విజయాలే దక్కాయి. ‘అప్పుడూ ఇప్పుడూ అంతే. ఎన్ని సవాళ్లు వచ్చినా ఎదుర్కొన్నా. నా వరకూ రిగ్రెట్ర్ లేవు. రిగ్రెట్ అనేది యూజ్‌లెస్ ఎమోషన్’ అంటుంది కత్రినా. ‘నన్ను నన్నుగా ఇష్టపడే విక్కీతో జీవితం పంచుకోవటం అదృష్టం’ అంటుందీమె.
ఎప్పుడూ ఇలానే ఉండదు..
‘ఇక్కడ విజయాలే ఉంటాయి. స్టార్సు నిలబడతారు. నా వరకూ ది బెస్ట్ అనిపించుకోవాలనుకుంటూ. ఇంకొకరిని ఫాలో అవ్వను. ఎనిమిదేళ్ల కితం వచ్చిన కథలు.. ఇప్పుడు వచ్చే కథలకు వ్యత్యాసం ఉంది. కాలం ఎప్పుడూ ఇలానే ఉండదంటే ఇదే’నంటుంది కత్రినా కైఫ్. ప్రతి పాత్రకూ హోమ్‌వర్క్ చేస్తుంది. ‘ఇక్కడ ఒక్కోసారి ఫార్ములానే నిలబడుతుంటాయి. అయితే మనకు ఇచ్చిన పాత్రలో ఎంత ఒదిగిపోయామన్నదే నటిగా సంతృప్తి’ అంటుందీమె. ‘సెట్స్‌లో నాచుట్టూ ఉండి నటించిన నటులంతా ఎంతో నేర్పించారు. ఎంతో మంది గురూస్ ఉన్నారు. నాలెడ్జ్, నటన, జీవితం తెలిసింది అంతా సెట్స్‌లోనే’ అంటుంది కత్రినా.
యోగానే బలం..
‘నటిగా స్లిమ్‌గా ఉండాలంటే పిజ్జా లాంటి ఆహారాన్ని తినలేను. ప్రతిరోజూ వర్కవుట్స్ చేస్తా. కనీసం రెండు గంటల పాటు జిమ్‌లో గడుపుతా. చదవటం, వ్యాయామాలే హ్యాపీనెస్ ఇస్తాయి. కొందరు జనాలు ఎమోషనల్‌గా ఇబ్బంది పెడతారు. మంచి ఆలోచనలు, మానసికంగా బలమైన స్థితిలో ఉండటానికి యోగానే ఎంతో సాయపడింది. యోగానే నా బలం. మనచుట్టూ ఎంతో నెగటివిటీ ఉంటుంది. మనతో పాటు కూడా నెగటివ్‌నెస్ ప్రయాణిస్తుంది. అలాంటివేమీ పట్టించుకోను. మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే యోగా తప్పనిసరి’ అంటూ కోట్ చేస్తుంది కత్రినా.
అదే నా డ్రీమ్..
విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకున్న కత్రినా తక్కువగా మీడియాముందుకు వస్తోంది. విదేశాలకు ట్రిప్స్ వెళ్లిన ఫొటోలను కూడా షేర్ చేయటం తగ్గించేసింది. విపరీతమైన క్రేజ్ ఉన్న ఇన్‌స్టాలోనూ ఎలాంటి పర్సనల్ డీటైల్స్ షేర్ చేయదు కత్రినా. కత్రినా అమ్మ చారిటబుల్ వర్క్స్ చేస్తుంది. ‘మా అమ్మనే నా బలం. ఆమెను చూసే జీవితం తెలుసుకున్నా. ఏడు మంది అక్కచెల్లెళ్లం. ఒక తమ్ముడు. అందరినీ పెంచి పోషించింది. ఆమె సంకల్పం గొప్పది’ అంటుంది కత్రినా. ‘అలియా భట్ యాంగ్జయిటీని ఓవర్‌కమ్ చేసింది. దీపికా పదుకోన్ డిప్రషన్‌లోంచి బయటికొచ్చింది. ఇక్కడ ఎవరి సమస్యలు వారివే. వాటినుంచి బయటకు రావాలి. వారి సంకల్పం మీదనే జీవితం ఆధారపడి ఉంటుంద’టుందీమె. ఇప్పటికే బ్యూటీ ఇండస్ర్టీలోకి ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగుపెట్టింది కత్రినా కైఫ్. స్ట్రగులింగ్ మదర్ రోల్స్ చేయాలనే ఆలోచన ఆమెకు ఉంది. నటిగా కొనసాగుతూనే.. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి.. సినిమాలు తీయాలనే డ్రీమ్ ఉందంటుంది కత్రినా కైఫ్.