Share News

Littles : ముంగిస విధేయత

ABN , Publish Date - May 08 , 2024 | 11:53 PM

ఒక ఊరిలో గోపాల్‌, మాధురి అనే జంట ఉండేది. వారికి ఓ కొడుకు పుట్టాడు. అతని పేరు శంకర్‌. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గోపాల్‌ వ్యవసాయం చేస్తాడు.

Littles : ముంగిస విధేయత

ఒక ఊరిలో గోపాల్‌, మాధురి అనే జంట ఉండేది. వారికి ఓ కొడుకు పుట్టాడు. అతని పేరు శంకర్‌. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గోపాల్‌ వ్యవసాయం చేస్తాడు. ప్రతి రోజూ చేనుకు వెళ్లేవాడు. ఉదయాన్నే చద్దన్నం కట్టించేది గోపాల్‌ భార్య. విచిత్రంగా వారింటికి ఒక రోజు ముంగిస వచ్చింది.

సాధారణంగా ముంగిసను ఎవరైనా తరిమికొడతారు. శంకర్‌ చిన్నపిల్లవాడు దాని దగ్గరకు వెళ్లాడు. అదీ ఏమనలేదు. దీంతో శంకర్‌, ముంగిస స్నేహితులయ్యారు.

‘కుక్కపిల్లతోనో, పిల్లితోనో ఆడుకోవాలి కానీ.. ఈ ముంగిస ఏంటీ?’ అని పక్కింటి జనాలు అన్నారు. అయితే శంకర్‌ పట్టించుకోలేదు. ఆ ముంగిస ప్రతిరోజు ఇంట్లో వచ్చి కూర్చునేది. ఆహారం తినేది. ఒక రోజు యధావిధిగా గోపాల్‌ చేనుకు వెళ్తూ ఆలస్యంగా వస్తానని వెళ్లాడు. తన భార్య సరేనంది. మాధురి పక్క ఇంటిలో గాజుల వ్యాపారం చేసే ఆమె వస్తే అక్కడికి వెళ్లిపోయింది.


పిల్లవాడిని ఊయలలో ఉంచి వెళ్లింది. ఆ ముంగిస ఇంట్లోనే కాపలా ఉంది. మాధురి పక్కింటికి వెళ్లి గాజులు తొడుక్కుని ఇంటికి వచ్చింది.

వచ్చి చూడగానే పిల్లవాడి ఊయల ముందు రక్తం. కచ్చితంగా ఇది ముంగిస పనే అనుకుంది మాధురి. పిల్లవాడిని చంపేసిందే అంటూ గట్టిగా అరిచింది. క్షణాల్లో కోపంతో కట్టె తీసుకుని ముంగిసను బాదింది. అది అక్కడికక్కడే రక్తం కక్కుకుని చచ్చింది. ఆలస్యంగా వస్తానన్న తన భర్త అప్పుడే ఇంటికి వచ్చాడు. ఏమైందని అడిగాడు. ‘మన పిల్లవాడు లేడు.

ఆ దొంగ ముంగిస కొరికేసింది. చచ్చిపోయాడు’ అంటూ దీర్ఘాలు తీసింది. గోపాల్‌ చేతిలో కట్టె ఉంది. అలానే ముందుకు వెళ్లాడు. ఊయల వెనకాల ఓ పాము చచ్చిపడి ఉంది. ఊయల్లో శంకర్‌ హాయిగా నిద్రపోతున్నాడు. గోపాల్‌కి తన ప్రాణాలు తిరిగి వచ్చాయని అనిపించింది.

తన భార్యను పిలిచాడు. అసలే మనది ఊరి చివరి ఇల్లు. ఒక పాము వస్తే.. దాంతో ఈ ముంగిస పోరాడింది. పామును చంపేసింది. ‘నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. విధేయతతో ఉండే ముంగిసను చంపేశావెందుకూ? నీకు మతి ఉందా?’

అంటూ తిట్టడం మొదలెట్టాడు గోపాల్‌. ‘ఒక పని చేసేముందు ఆలోచించకపోతే ఎలా? పిల్లవాడిని ఈ ముంగిస కాపాడింది. ఇంతటి విధేయత గల దీన్ని చంపేయటానికి మనసెలా వచ్చింది?’ అంటూ అరిచాడు. తన భార్య జరిగిన తప్పుకు బాధపడింది. ఆ తర్వాత ఆ రైతు కూడా బాధపడ్డాడు.

Updated Date - May 09 , 2024 | 02:14 AM