Share News

Smrika Chandrakar : కొలువు వదిలి, కూరగాయలు పండిస్తూ...

ABN , Publish Date - Jun 01 , 2024 | 04:50 AM

’చదువుకున్న యువతీయువకులు ఎవరైనా పట్నంలో ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడాలని కలలు కంటారు. కానీ ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన స్మరికా చంద్రాకర్‌, పట్నం ఉద్యోగాన్ని వదిలేసి, కూరగాయలను ’చదువుకున్న యువతీయువకులు ఎవరైనా పట్నంలో ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడాలని కలలు కంటారు. కానీ ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన స్మరికా చంద్రాకర్‌, పట్నం ఉద్యోగాన్ని వదిలేసి, కూరగాయలను

Smrika Chandrakar : కొలువు వదిలి, కూరగాయలు పండిస్తూ...

’చదువుకున్న యువతీయువకులు ఎవరైనా పట్నంలో ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడాలని కలలు కంటారు. కానీ ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన స్మరికా చంద్రాకర్‌, పట్నం ఉద్యోగాన్ని వదిలేసి, కూరగాయలను పండించడం కోసం ఊరి బాట పట్టింది. ఎకరానికి 55 టన్నుల టమాటాలు పండిస్తూ, 8 రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన స్మరికా స్ఫూర్తివంతమైన కథ ఇది.

పూణెలో ఐదేళ్ల పాటు టెలికాం సెక్టార్‌లో పని చేసిన స్మరికా, 2018లో రాయ్‌పూర్‌కు వెళ్లిపోయి, బాలింతలు, పిల్లల ఆరోగ్యభద్రతకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలో ఉద్యోగం చేసింది. ఆమె నాన్న, తాతయ్యలు ఆరు దశాబ్దాలుగా ఛత్తీస్‌ఘడ్‌, ధమ్తారి జిల్లాలోని చార్ముడియా గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్లనే చూస్తూ పెరిగిన స్మరికా, వాళ్ల అడుగు జాడల్లోనే నడవాలని అనుకుంది. కానీ ఎమ్‌బిఎ చదువు, ఆమెను పూణె వైపు పరుగులు పెట్టించింది. అయినా ఆమె వ్యవసాయం పట్ల ఆసక్తి కోల్పోలేదు. రాయ్‌పూర్‌లో ఉద్యోగం చేసే సమయంలో వారాంతాల్లో ఇంటికి వెళ్లిపోయి కుటుంబ వ్యవసాయ పద్ధతులను మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అప్పట్లో వాళ్ల కుటుంబం వరి పండిస్తూ ఉండేది. ఉద్యోగం మానేసి పూర్తిగా వ్యవసాయానికే అంకితమైపోదామని నిర్ణయించుకున్న స్మరికా వ్యవసాయ పద్ధతుల్లో తనదైన శైలిని కనబరచాలని అనుకుంది. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ... ‘‘ 2021లో పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయగలిగే ఆత్మవిశ్వాసాన్ని సాధించి, ఉద్యోగానికి రాజీనామా చేసి మా ఊరు వచ్చేశాను. అంతకంటే ముందు, 2018 నుంచి 2021 వరకూ, అధిక ధరల వల్ల వరి పంటతో మా కుటుంబానికి రాబడి తగ్గడాన్ని నేను గమనించాను. బదులుగా ఒకే పంటను పండిస్తే, వాతావరణం అనుకూలించకపోతే పంట మొత్తం ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి ఏ పంటను పండించాలా అని ఆలోచిస్తుండగా, నాన్న, దుర్గేష్‌ చంద్రాకర్‌, కూరగాయలను పండిద్దామని అనడంతో, వాటిని పండించడమే మేలని నిర్ణయించుకున్నాను’’ అంటూ వ్యవసాయంలో అడుగుపెట్టిన తొలినాళ్ల గురించి చెప్పుకొచ్చింది స్మరికా.

క్షుణ్ణంగా తెలుసుకుని...

ఏ పంట పండాలన్నా భూసారం భేషుగ్గా ఉండాలి. మట్టిలో పోషకాల కొరత ఉండకూడదు. అలాగే మొక్కల మధ్య తగిన దూరం పాటించాలి. వీటి గురించిన లోతైన అవగాహన కోసం 20 ఎకరాల పొలంలో పంటలను సాగు చేసే ముందు వ్యవసాయ నిపుణులను కలిసి తగిన సూచనలు, సలహాలను పొందింది స్మరికా. నీటి వృథాను అరికట్టడం కోసం తుంపరి సేద్యాన్ని ఆశ్రయించింది. ఈ రకమైన సేద్యంతో ద్రవరూప ఎరువులు నేరుగా మొక్కల వేర్లలోకి చేరుకునే అదనపు ప్రయోజనం కూడా దక్కుతుంని ఆమె గ్రహించింది. తుంపరి సేద్యం చేసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను కూడా సద్వినియోగం చేసుకుంది. ‘‘పొలాన్ని దున్నిన తర్వాత, 12 ట్రాలీల ఆవు పేడను జోడించి కొన్ని రోజుల పాటు ఎండకు అలాగే వదిలేశాను. అలాగే భూసారాన్ని పెంచడం కోసం సూక్ష్మపోషకాలు, ఎంజైమ్‌లను కూడా జోడించాను. తర్వాత టమాటా మొక్కలను నాటడం కోసం బెడ్లను ఏర్పాటు చేసి మొక్కల మధ్య ఎడం ఉండేలా చూసుకున్నాం. వంకాయ మొక్కలను అంతర పంటగా కాకుండా విడిగా నాటాం. దాంతో మేం ఆశించిన ఫలితాలొచ్చాయి. మార్కెటింగ్‌లో స్మరికాకు ఆమె చదిని ఎమ్‌బిఎ కూడా ఎంతో బాగా తోడ్పడింది.

8 రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ...

కూరగాయలను అమ్మడం కోసం, పంట కోతకొచ్చే ముందే స్థానిక మండీలకు వెళ్లి, రైతులతో మాట్లాడి, దుకాణదారులు, వ్యాపారులతో ఒక నెట్‌వర్క్‌ తయారుచేసుకుంది. ‘‘మేం ఎకరానికి 55 టన్నుల చొప్పున 13 ఎకరాల్లో టమాటాలను పండించగలిగాం. బ్రోకర్లతో మాట్లాడి ముందుగానే ధరలను నిర్ణయించుకుంటూ ఉంటాను. తర్వాత కూరగాయలను ప్యాక్‌ చేసి బ్రోకర్ల దగ్గరకు చేరుస్తూ ఉంటాను. అలా మా కూరగాయలు స్థానికంగానే కాకుండా, భువనేశ్వర్‌; పాట్నా, కోల్‌కతా, గౌహతి, ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగుళూరు, విశాఖపట్నాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. టమాటో, వంకాయలను కోసిన తర్వాత, ఎరువులు, వెర్మికంపోస్ట్‌లను కలిపి నేలను అలాగే మూడు నెలల పాటు ఏ పంటా వేయకుండా వదిలేస్తాం. అలా వదిలేయడం వల్ల భూమి తిరిగి సారవంతమై రెండో పంటకు సిద్ధమవుతుంది. ఈ ఏడాది సొరకాయలు, దోసకాయలను పండించాలని అనుకుంటున్నాం. ఈ పంటల తర్వాత మళ్లీ టమాటాలు, వంకాయలను పండిస్తాం. హార్టికల్చర్‌లో భాగంగా మా 20 ఎకరాల భూమిని 35 ఎకరాలకు విస్తరించాలన్నదే నా లక్ష్యం’’ అంటూ ఉత్సాహంగా చెప్పుకొస్తోంది స్మరికా.

గ్రామీణులకు ఉపాథి కల్పిస్తూ...

స్మరికా కూరగాయల తోటల్లో కూరగాయలు కోయడానికీ, వాటిని ప్యాక్‌ చేయడానికీ, లోడ్‌ చేయడానికి 70 మంది పని చేస్తూ ఉంటారు. వాళ్ల గురించి ప్రస్థావిస్తూ.... ‘‘కూరగాయలను పండించడం వల్ల, మా గ్రామంలో ఉపాథి అవకాశాలు పెరిగాయి. దాంతో ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లే బాధ తప్పింది. పీక్‌ సీజన్‌లో నేను ఇంకా ఎక్కువ మందికి ఉపాథి కల్పిస్తూ ఉంటాను.’’ అని చెప్పుకొచ్చింది స్మరికా. స్మరికా తండ్రి, తాత, అమ్మమ్మలు కూడా స్మరికాను చూసి ఎంతో గర్వపడుతున్నారు. ‘‘నిజానికి మా గ్రామస్థులందరికీ కూడా ఇది గర్వించదగిన విషయం. స్మరికా మంచి రైతే కాదు, మంచి వ్యాపారవేత్త కూడా’’ అని గర్వంతో పొంగిపోతూ చెప్తున్నాడు స్మరిక తండ్రి దుర్గేష్‌.

Updated Date - Jun 01 , 2024 | 04:50 AM