Share News

NRI: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో తెలంగాణ టెకీలకు ప్రాధాన్యత

ABN , Publish Date - Sep 01 , 2024 | 07:15 AM

ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తన ప్రథమ విదేశీ పర్యటనకు అమెరికాను ఎంచుకోగా అందులో తెలంగాణ ప్రవాసీయులకు పెద్దపీట వేయనున్నారు.

NRI: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో తెలంగాణ టెకీలకు ప్రాధాన్యత

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తన ప్రథమ విదేశీ పర్యటనకు అమెరికాను ఎంచుకోగా అందులో తెలంగాణ ప్రవాసీయులకు (NRI) పెద్దపీట వేయనున్నారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై గత కొంత కాలంగా జరుగుతున్న కసరత్తు ఎట్టకేలకు శుక్రవారం తుది రూపు దిద్దుకుంది. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకతో పాటు ఎన్నికలు సమీపిస్తున్న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకుని దీన్ని ఖరారు చేశారు.

NRI: జీడబ్ల్యూటీసీఎస్ స్వర్ణోత్సవాలు.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు


అమెరికాలో తెలుగు ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో నివసించే డల్లాస్‌లో ఆయన బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. పార్టీ ప్రవాసీ విభాగమైన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 8 నుండి మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న ఆయన 8న డల్లాస్‌లో బహిరంగ సభలో మాట్లాడుతారు. ఆ తర్వాత వాషింగ్టన్‌లో 9, 10 తేదీలలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు.

తమ పార్టీ అధికారంలో ఉన్న హైదరాబాద్, బెంగళురులతో పాటు మహారాష్ట్రలోని పుణె, ముంబయి, హర్యానలోని గురుగ్రామ్ సాంకేతిక నగరాల అభివృద్ధి దృష్ట్యా విభిన్న వర్గాల నుండి వ్యక్తమవుతున్న ఆసక్తి వలన తాము అనేక కార్యక్రమాలను రూపొందించినట్లుగా ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు, గాంధీ కుటుంబ సన్నిహితుడు శ్యాం పిట్రోడా శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ముఖాముఖీతో పాటు ప్రవాసీయులతో సమావేశమవుతారని, విందు ఉంటుందని అన్నారు.


అమెరికాలోని ఇతర నగరాలలో కూడా రాహుల్ గాంధీ సభలను ఏర్పాటు చేయాలనే తీవ్ర డిమాండ్ ఉన్నప్పటికీ సమయాభావం వలన డల్లాస్ నగరంలో మాత్రమే బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లుగా, వాషింగ్టన్‌లో ఎంపిక చేసిన వారితో భేటీలు ఉంటాయని తెలంగాణ పీసీసీ ఎన్నారై అమెరికా సెల్ కన్వీనర్, ఖమ్మం జిల్లాకు చెందిన యెలంరెడ్డి నరేందర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ డల్లాస్‌లో అడుగుపెట్టి తిరిగి వెళ్ళే వరకూ ప్రతి కార్యక్రమంలో తెలుగు ప్రవాసీయుల పాత్ర ఉంటుందని నరేందర్ వ్యాఖ్యానించారు. అమెరికాలో తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ప్రదీప్ సామెల (వరంగల్), రాజేశ్వర్ గంగసాని (జనగాం) మధు ఇరుగురు (మిర్యాలగూడ) పోలీసు చంద్రశేఖర్ (మక్తల్) లు రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నట్లుగా నరేందర్ వెల్లడించారు. గత సంవత్సరం మే నెలలో రాహుల్ గాంధీ ఆరు రోజులు అమెరికాలో పర్యటించి వెళ్ళగా ఈసారి అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రానున్నారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Sep 01 , 2024 | 07:15 AM