Share News

Viral: రూ.6,015 కోట్లను చెత్తలో పారేసిన గర్ల్‌ఫ్రెండ్! జరిగిందేంటో తెలిస్తే..

ABN , Publish Date - Nov 26 , 2024 | 10:14 PM

ఓ యువతి పొరపాటున చేసిన పని ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు వేల కోట్లను దూరం చేసింది! బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Viral: రూ.6,015 కోట్లను చెత్తలో పారేసిన గర్ల్‌ఫ్రెండ్! జరిగిందేంటో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువతి పొరపాటున చేసిన పని ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు వేల కోట్లను దూరం చేసింది! బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది. వేల్స్‌లోని న్యూపోర్టు ప్రాంతానికి చెందిన జేమ్స్ హావెల్స్ 2009లోనే బిట్‌కాయిన్ మైనింగ్ చేసి ఏకంగా 8 వేల బిట్‌కాయిన్స్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రిప్టోలకు సంబంధించిన కీలక వివరాలను తన కంప్యూటర్‌లో దాచి పెట్టాడు. అక్కడి వరకూ బాగానే ఉన్నా ఆ తరువాతే అతడి లైఫ్ అనూహ్య మలుపు తిరిగింది (Viral).

Viral: ఇదేం ఐడియారా బాబూ! రోడ్డుపై గాల్లో తేలుతున్నట్టు ఇల్లు కడుతున్నారుగా!


ఓసారి జేమ్స్ కంప్యూటర్‌పై ఏదో పండ్ల జ్యూస్ వలకడంతో అది పాడైపోయింది. దీంతో, దాన్నుంచి హార్డ్‌డిస్క్‌ను వెలికి తీసి భద్రపరిచాడు. ఆ తరువాత దాన్ని ఓ బ్లాక్ కవర్‌లో పెట్టి ఓ మూలన వదిలేశాడు. అప్పట్లో క్రిప్టోకరెన్సీ శైశవ దశలో ఉండటంతో వాటి విలువ ఎంతో అతడికీ తెలీదు. ఇదిలా ఉంటే, ఇంట్లోని బ్లాక్ కవర్‌లో ఉన్న చెత్తను పారేయాలని జేమ్స్ అప్పట్లో తన గర్ల్‌ఫ్రెండ్‌కు పురమాయించాడు. ఆమె హార్డ్ డిస్క్ ఉన్న కవర్‌ను తీసుకుని చెత్తలో వేసింది. ఆ తరువాత మున్సిపాలిటీ వాళ్లు వచ్చి ఆ చెత్త మొత్తాన్ని తీసుకెళ్లి జనావాసాలకు దూరంగా ఉన్న ఓ ల్యాండ్ ఫిల్‌లో పడేశారు. ఇది జరిగి ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఆ తరువాత జేమ్స్, అతడి గ్లర్‌ఫ్రెండ్ కూడా విడిపోయారు.

ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ విలువ 80 వేల డాలర్లు దాటింది. భవిష్యత్తులో లక్ష డాలర్లు దాటిపోవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం, జేమ్స్ పోగొట్టుకున్న బిట్ కాయిన్ విలువ సుమారు రూ.6 వేల కోట్లు. భవిష్యత్తులో వీటి ధర మరింత పెరిగితే జేమ్స్ పోగొట్టుకున్న ఆస్తి విలువ బిలియన్ డాలర్లకు చేరుతుంది. దీంతో, తాను కోల్పోయిన సంపదను తలుచుకుని లబోదిబోమంటున్న జేమ్స్ వాటిని ఎలాగైనా సొంతం చేసుకునేందుకు ఇప్పటికే పలు ప్రయత్నాలు చేశాడు.

Viral: పెళ్లి వేదిక మీదే వరుడితో వధువు తెగదెంపులు! కారణం తెలిస్తే..


చెత్త ఉన్న ల్యాండ్ ఫిల్‌లో ఓ ప్రాంతాన్ని తవ్వితే ఎక్కడోక్కడ పోగొట్టుకున్న హార్డ్ డ్రైవ్ దొరుకుతుందని అతడి ఆశ. అతడు తవ్వితీయాల్సిన ప్రాంతంలో ఇప్పటికే లక్ష టన్నుల చెత్త వరకూ ఉంది. అయినా వెనక్కు తగ్గని జేమ్స్ స్థానిక నగర పాలక సంస్థకు దరఖాస్తు చేసుకున్నాడు. చెత్తను తవ్వితీసేందుకు అనుమతించాలన్నాడు. తన హార్డ్‌డ్రైవ్ దొరికి డబ్బు చేతికందితే అందులో పది శాతాన్ని సమాజానికి దానం చేస్తానని కూడా చెప్పాడు. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం ససేమిరా అన్నారు. ఆ ప్రాంతాన్ని తవ్వితే పర్యావరణానికి హాని జరుగుతుందని చెప్పారు. దీంతో, జేమ్స్ చివరి ప్రయత్నంగా కోర్టును ఆశ్రయించాడు. తనను అడ్డుకున్నందుకు 648 మిలియన్ డాలర్లను పరిహారంగా చెల్లించాలని దావా వేశాడు. ఈ పిటిషన్‌పై డిసెంబర్‌లో విచారణ జరగనుంది. మరోవైపు, జేమ్స్‌కు మద్దతు తెలిపేవారు కూడా సోషల్ మీడియాలో తమ గొంతు వినిపిస్తున్నారు. జేమ్స్‌కు కావాల్సిన అనుమతులు ఇస్తే అతడు దానం చేసే డబ్బుతో సమాజానికి మేలు జరుగుతుందని అంటున్నారు.

ఈ వ్యవహారంపై జేమ్స్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ కూడా స్పందించింది. ల్యాండ్ ఫిల్ తవ్వేందుకు ప్రభుత్వం జేమ్స్‌ను అనుమతించాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు చెప్పింది. కనీసం అప్పుడైనా అతడు సణగడం ఆపుతాడని, తనకు తలనొప్పి తప్పిపోతుందని వాపోయింది.

Read Latest and Viral News

Updated Date - Nov 26 , 2024 | 10:14 PM