Share News

చీరకట్టు విన్యాసాలకు ‘సిల్వర్‌ బటన్‌’

ABN , Publish Date - Nov 10 , 2024 | 08:08 AM

బార్‌టెండర్‌ ఉద్యోగానికి జెండర్‌తో పని లేదని నిరూపించి, తన వెరైటీ విన్యాసాలను ఎప్పటికప్పుడు యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశారు కవితా మేదర్‌. చీరకట్టులో ఆ ‘రికార్డు’ వీడియోలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే యూట్యూబ్‌ నుంచి ‘సిల్వర్‌ బటన్‌’ను సాధించిన ఏకైక మహిళా బార్‌టెండర్‌ విశేషాలే ఇవి...

చీరకట్టు విన్యాసాలకు ‘సిల్వర్‌ బటన్‌’

బార్‌టెండర్‌ ఉద్యోగానికి జెండర్‌తో పని లేదని నిరూపించి, తన వెరైటీ విన్యాసాలను ఎప్పటికప్పుడు యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశారు కవితా మేదర్‌. చీరకట్టులో ఆ ‘రికార్డు’ వీడియోలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే యూట్యూబ్‌ నుంచి ‘సిల్వర్‌ బటన్‌’ను సాధించిన ఏకైక మహిళా బార్‌టెండర్‌ విశేషాలే ఇవి...

కాక్‌టెయిల్‌ కలిపినంత సులువేం కాదు... మూడు గాజు బాటిళ్లను గాల్లోకి విసిరి, ఒకదాని తర్వాత మరొకటిని ఒడుపుగా పట్టుకోవడం. అంతేనా... తన చిన్నారిని ఎడమచేత్తో ఎత్తుకుని.. కుడిచేత్తో రెండు బాటిళ్లను ఎగరేయటం... మండే బాటిల్‌ను ఎగరేసి పట్టుకోవటం.. మోచేతి మీద టెక్నిక్‌గా నిలపడం కవితా మేదర్‌కు చిటికెలో పని.


book5.3.jpg
ఇలాంటి ‘ఫాస్టెస్ట్‌’ స్టంట్‌ మనదేశంలోనే కాదు... ప్రపంచంలోనే ఏ మహిళా చేయలేదు. అందుకే మూడేళ్ల క్రితమే ‘వరల్డ్‌ రికార్డ్‌’ సాధించింది. అంతకుముందు రెండు బాటిళ్లను నిమిషంలో 110 సార్లు గాల్లోకి ఎగరేసిన వరల్డ్‌ రికార్డు ఒకరి పేరు మీద ఉండేది. కవిత ఒక్క నిమిషంలోనే 122 సార్లు బాటిళ్లను ఎగరేసింది. అంటే ఆమె ఎంత వేగంగా, చురుగ్గా ఈ స్టంట్‌ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అనేక విన్యాసాలతో 2022లో ‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌ 9’ అవార్డును కూడా గెల్చుకుంది. సోషల్‌ మీడియాలో కవితా మేదర్‌ చేసే పోస్ట్‌లకు లక్షల మంది చూస్తున్నారు. లైకులు, కామెంట్లు చెప్పనక్కర్లేదు. ‘చిన్నారిని ఎత్తుకుని.. గాజు బాటిల్స్‌ గాల్లోకి ఎగరేయటం రిస్క్‌ కాదా?’ అని అడిగితే... ‘ఎనిమిదేళ్ల పాటు శిక్షణ తీసుకున్నా. అందుకే పిల్లవాడు ఉన్నా.. కచ్చితంగా ఎలా హ్యాండిల్‌ చేయాలో నాకు తెలుసు’ అంటుందామె.


సామాన్య రైతు బిడ్డ..

కర్ణాటకలోని బెటాదూర్‌ అనే గ్రామానికి చెందిన కవితకు వింత ఆలోచన కలిగింది. బార్‌ టెండింగ్‌లో ఎక్స్‌పర్ట్‌ కావాలనుకుంది. అయితే ఓ సామాన్య రైతు బిడ్డకు అది అంత సులువుకాదని గ్రహించింది. ఆమె మామ ఈ కోర్సును పుణేలో ఆఫర్‌ చేస్తున్నారని చెప్పడంతో పట్టుదలగా పుణేకు వెళ్లి ‘ఫ్లెయిర్‌ మేనియా బార్‌టెండింగ్‌ అకాడమి’ (ఎఫ్‌ఎంబీఏ)లో చేరింది. మిక్సింగ్‌తో పాటు కాక్‌టైల్స్‌ చేయటం నేర్చుకుంది. అక్కడే గాల్లోకి బాటిళ్లను విసిరేస్తూ పట్టుకోవటం.. మండే గాజు బాటిల్‌ను చేతి మీద బ్యాలెన్స్‌ చేయటమనే విన్యాసాలను నేర్చుకుంది. రోజుకు ఎనిమిది గంటలు ప్రాక్టీస్‌ చేసేది. బార్లలో డిమ్‌లైట్స్‌ ఉంటాయి కాబట్టి, అర్ధరాత్రి పూట ఇంట్లోనే డిమ్‌లైట్‌ వెలుగులో ఆమె ప్రాక్టీస్‌ చేసేది.


book5.jpg

అలా చేస్తున్నప్పుడు సీసాలు కాళ్ల మీద పడి చాలాసార్లు గాయాలయ్యాయి. అయినా కూడా లెక్క చేయలేదు. సీసాలను గాల్లోకి లాఘవంగా విసరడం వల్ల భుజాలు, చేతులు నొప్పి పెడుతున్నా సాధన మాత్రం ఆపలేదు. బార్‌లో బ్లెండ్‌ చేసి కాక్‌ టెయిల్‌ను సర్వీస్‌ చేయటంలో ఈమె స్టయిలే వేరు. నెట్‌లో ఎన్నో విషయాలు ఈ కళ గురించి వెతికి తన ప్రతిభకు మెరుగులు దిద్దింది. ‘‘పాడటం, నాట్యంలానే బార్‌ టెండింగ్‌ కోర్సు కూడా ఒకటి. ఇదొక కెరీర్‌. దీన్ని మహిళలు ఎందుకు నేర్చుకోకూడదు? అనే ఆలోచనతో ఇందులోకి దిగాను’’ అంటోంది కవిత.


book5.4.jpg

కవితా మేదర్‌ ప్రస్తుతం అదే ఇన్‌స్టిట్యూట్‌ ప్రధాన ఫ్లెయిర్‌ ఇన్‌స్ట్రక్టర్‌. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు గాల్లోకి బాటిల్స్‌ ఎగరేసే విద్యను నేర్పుతుంది. ముఖ్యంగా వర్క్‌షాప్స్‌ నిర్వహించి మిక్సాలజీ ఫండమెంటల్స్‌తో పాటు కాక్‌టైల్స్‌ తయారు చేయటంలో టెక్నిక్స్‌ను నేర్పిస్తారీమె. ఈమె ప్రతిభ వల్ల 3 లక్షలకు పైగా సబ్‌స్క్రయిబర్లు ఇన్‌స్టిట్యూట్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు సబ్‌స్క్రయిబర్లు వచ్చారు. ఇటీవలే ‘సిల్వర్‌ బటన్‌’ ఆమె అందుకుంది. ఈ కృషిలో ఆమె భర్త సహకారం ఉంది. ప్రతిరోజూ కవిత సాధన చేస్తుంటే ఆమె చంటిబిడ్డ చప్పట్లు కొడుతూ ఆనందిస్తుంటాడు. ఇదే ఆమె వీడియోల్లో చాలామందికి నచ్చే విషయం. మొత్తానికి బార్‌ టెండింగ్‌ మిక్సాలజీ కోర్సు చేసినపుడు తనపై వచ్చిన విమర్శలను తిప్పికొడుతూ... అనేక అవార్డులు అందుకుని ‘ప్రపంచంలోనే ఇలా మరొకరు విన్యాసం చేయలేరు’ అనే స్థాయికి ఎదిగిందీ బార్‌ టెండింగ్‌ క్వీన్‌.

Updated Date - Nov 10 , 2024 | 08:08 AM