Share News

Elon Musk: భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

ABN , Publish Date - Dec 06 , 2024 | 10:35 AM

నానాటికీ తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు కారణంగా సింగపూర్‌తొ పాటు పలు దేశాలు అంతరించిపోతాయని వార్నింగ్ ఇచ్చాడు.

Elon Musk: భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో జనాభా తగ్గుదలపై ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రముఖ టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ తాజాగా మరో హెచ్చరిక చేశారు. నానాటికీ తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు కారణంగా సింగపూర్‌తో పాటు పలు దేశాలు అంతరించిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గుదలపై నెట్టింట మరోసారి పెద్ద చర్చ మొదలైంది (Elon Musk).

నానాటికీ తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటుతో సింగపూర్‌ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గతేడాది ఈ రేటు 0.97కి పడిపోయింది. ఒకటికి దిగువకు ఈ రేటు చేరడం ఇదే తొలిసారి. అక్కడి మహిళలు సగటున ఒక్క సంతానానికీ జన్మనివ్వట్లేదని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి. జనభా సుస్థిరతకు కావాల్సిన 2.1 రేటుకంటే ఇది చాలా తక్కువ కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Elon Musk: భారత్‌లో ఒకే రోజులో 640 మిలియన్ ఓట్లు లెక్కించారు! మస్క్ ప్రశంసలు


సమాజంలో మార్పుల కారణంగా సింగపూర్‌లో సంతానోత్పత్తి రేటు పడిపోతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గర్భధారణకు అనుకూలమైన వయసులో (25 -34 ఏళ్లు) ఉన్న అనేక మంది మహిళలు ఒంటరిగా ఉండిపోతున్నారట. అంతేకాకుండా, 20ల్లో ఉన్న పెళ్లైన మహిళల్లో కూడా సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోయిందని తేలింది. 2023లో ఈ రేటు కాస్త పెరిగినప్పటికీ దీర్ఘకాలిక సరళి మాత్రం ఆందోళనకరంగానే ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

జనాభా తగ్గుదలతో ఎదురయ్యే సవాళ్లను సింగపూర్ ఆధునిక సాంకేతికతతో అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. జనాభా తగ్గుదలతో ఏర్పడుతున్న కార్మికుల కొరతను రోబోటిక్స్, ఆటోమేషన్ సాయంతో ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం, రోబోల వినియోగానికి సూచిక అయిన రోబోట్ డెన్సిటీలో సింగపూర్ రెండో స్థానంలో ఉంది. అక్కడ ప్రతి 10 వేల మంది కార్మికులకు 770 పారిశ్రామిక రోబోట్లు పనిచేస్తున్నాయి.

కాగా, మస్క్ కూడా రోబోటిక్స్ రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఒకే పనిని పలు మార్లు చేయాల్సి వచ్చే రిపిటీటివ్ టాస్కులు, ప్రమాదకరమైన పనులకు మనుషులను పోలి ఉండే రోబోల తయారీలో పెట్టుబడులు పెడుతున్నారు. జననాల సంఖ్య తగ్గుదలతో ఎదురయ్యే ఆర్థిక, సామాజిక సమస్యలను టెక్నాలజీతో కొంత వరకూ అధిగమించొచ్చని పరోక్షంగా ఆయన పేర్కొన్నారు.

Viral News: సోషల్ మీడియా నిషేధంపై ఎలాన్ మస్క్ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన ప్రధాని


ఇక సింగపూర్ భవితవ్యంపై ఎలాన్ మస్క్‌ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. జనాభా తగ్గుదలను తట్టుకునేందుకు సింగపూర్ ఎప్పటినుంచో భారీగా వలసలను ప్రోత్సహిస్తోందని నెటిజన్లు కామెంట్ చేశారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక అస్థిరత, జీతం లేకపోతే ఇల్లు గడవని పరిస్థితుల్లో అనేక మంది జీవించడం వంటివన్నీ యువతను పిల్లల్ని కనేందుకు జంకేలా చేస్తున్నాయని అంటున్నారు. నానాటికీ పోటీ, ఖర్చులు పెరుగుతున్న ఈ ప్రపంచంలో పిల్లలు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారని చెప్పుకొచ్చారు. కాగా, సింగపూర్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా, కొన్ని ఐరోపా దేశాలు జననాల రేటు తగ్గుదలతో ఆందోళన చెందుతున్నాయి.

Read latest and National News

Updated Date - Dec 06 , 2024 | 12:38 PM