Share News

ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్‌ఐ వేధింపులు

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:54 PM

‘సార్‌.. మా కొడుకు పరిస్థితి బాగోలేదు. వాడి ఆరోగ్యం కోసం కష్టపడుతున్నా, కనికరించి వదిలేయండి సార్‌..

ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్‌ఐ వేధింపులు
చికిత్స పొందుతున్న రవీంద్ర

ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

సోషల్‌ మీడియాలో కన్నీటి పర్యంతం

కొడుకు ఆరోగ్యం బాగోలేదన్నా లెక్కచేయని ఎస్‌ఐ

రూ.20 వేల కోసం ముప్పుతిప్పలు

ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్‌

ఆళ్లగడ్డ, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): ‘సార్‌.. మా కొడుకు పరిస్థితి బాగోలేదు. వాడి ఆరోగ్యం కోసం కష్టపడుతున్నా, కనికరించి వదిలేయండి సార్‌.. డబ్బులు ఇవ్వలేను సార్‌..’ అన్నా కూడా ఆ ఎస్‌ఐ కనికరించలేదు. ఎస్‌ఐ హరిప్రసాద్‌ వేధింపులు తాళలేక ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ పురుగ మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన శనివారం ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను బాధితుడు ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీవీడియో ద్వారా వెల్లడించాడు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజు పల్లెకు చెందిన రవీంద్ర ట్రాక్టర్‌ నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. శుక్రవారం తన ట్రాక్టర్‌లో ఇసుక లోడు తీసుకుని వెళ్తుండగా కందుకూరు వద్ద ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్‌ఐ హరిప్రసాద్‌ అడ్డుకున్నాడు. ట్రాక్టర్‌కు సంబంఽధించి ఎలాంటి రికార్డులు లేవని పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. ట్రాక్టర్‌ను వదిలిపెట్టాలంటే రూ.20 వేలు డిమాండ్‌ చేశాడు. తనవద్ద అంత డబ్బులు లేవని కనీసం ఓ పూట అన్నం తినడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నానని ప్రాధేయపడ్డాడు. తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని, దయచేసి వదిలిపెట్టాలని వేడుకున్నా ఆ ఎస్‌ఐ కనికరించలేదు. దీంతో చేసేదేమీ లేక డ్రైవర్‌ రవీంద్ర స్నేహితులతో అప్పుతెచ్చి రూ.10వేలను ఎస్‌ఐ చెప్పిన (ఓ పెట్రోల్‌ బంకు యజమాని) వ్యక్తి ఫోన్‌పే ద్వారా వేశాడు. మిగిలిన రూ.10వేలు ఇచ్చేదాకా ట్రాక్టర్‌ను వదిలేది లేదని ఎస్‌ఐ హెచ్చరించాడు. తన కుమారుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నాడని వదిలేయండి సార్‌ అని ఏడ్చినా వదలని ఎస్‌ఐ చివరకు కేసు నమోదు చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన రవీంద్ర తనకు జరిగిన అన్యాయంపై సోషల్‌ మీడియాలో వీడియో ద్వారా వైరల్‌ చేసి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్‌ఐ హరిప్రసాద్‌ను సస్పెండ్‌ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్‌ఐ హైడ్రామా

పోలీసులు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేయడంతో ఎస్‌ఐ హరిప్రసాద్‌ హైడ్రామాకు తెరతీసినట్లు తెలిసింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ భార్య వద్దకు వెళ్లి ఎస్‌ఐ ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని, డబ్బులు కూడా డిమాండ్‌ చేయలేదని చెప్పించి వీడియో తీయించినట్లు చర్చసాగుతోంది. ఎస్‌ఐకు ఎలాంటి సంబంధం లేదని ట్రాక్టర్‌ డ్రైవర్‌ భార్యతో చెప్పించడం పలు విమర్శలకు తావిస్తోంది. హుందాగా వ్యవహరించాల్సిన పోలీసులు ఇలాంటి హైడ్రామాకు తెరలేపడం పోలీస్‌ శాఖలో చర్చకు దారితీసింది.

Updated Date - Apr 05 , 2025 | 11:54 PM