Share News

అక్రమార్కుల్లో అలజడి..!

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:52 PM

నంద్యాల మార్కెట్‌యార్డులోని ఓ కీలక అధికారి వివిధ రూపాల్లో చేస్తున్న అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన ‘పైసా వసూల్‌..’ కథనంతో ఆ శాఖ వర్గాలతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

అక్రమార్కుల్లో అలజడి..!

‘పైసా వసూల్‌’ కథనంతో కదలిక

కీలక అధికారిపై గతంలో ఏసీబీ కేసులు

ఉన్నతాధికారులను లెక్కచేయని వైనం..

పైరవీలతో మరోచోట అదనపు బాధ్యతలు

నంద్యాల, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): నంద్యాల మార్కెట్‌యార్డులోని ఓ కీలక అధికారి వివిధ రూపాల్లో చేస్తున్న అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన ‘పైసా వసూల్‌..’ కథనంతో ఆ శాఖ వర్గాలతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఆ అధికారి చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇదే క్రమంలో నాలుగు రోజుల క్రితం పైరవీలు చేసి.. నంద్యాలతో పాటు మరో మార్కెట్‌యార్డ్‌ అధికారిగా కూడా పోస్టింగ్‌ తెచ్చుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. వీటికితోడు సదరు అధికారిపై గతంలో రెండు ఏసీబీలు కేసులు కూడా ఉన్నాయి. పలుమార్లు నిధులు స్వాహా చేయడంతో ఏకంగా కమిషనర్‌ విచారణకు అదేశించారు. అప్పట్లో పలుకుబడితో షోకాజ్‌ నోటీసులతో సరిపెట్టారు. ఆ అధికారి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎక్కడ పనిచేసినా.. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న సమయంలోను ఏసీబీ వలకు చిక్కారని, ఆ తర్వాత రాష్ట్ర విభజన తరువాత పొరుగు జిల్లాకు బదిలీ అయ్యారు. అయితే అక్కడ ఆ అధికారి అక్రమాలు అధికం కావడంతో ఉన్నతాధికారులు నంద్యాల జిల్లాకు బదిలీ చేయించారు.

ఉన్నతాధికారులను లెక్కచేయని వైనం

వైసీపీ హయాంలో కడప జిల్లా నుంచి నంద్యాల జిల్లాకు ఇన్‌చార్జి అధికారిగా ఆ అధికారి ఆఆబదిలీ అయ్యారు. అయితే హోదా ఏదైనా మార్కెట్‌యార్డులో కీలక అధికారిగా పనిచేస్తున్నప్పుడు జిల్లాలోని మార్కెట్‌మార్డులకు అన్నింటికి కలిపి ఒక ఏడీ జిల్లా హెడ్‌గా ఉంటారు. అయితే సదరు అధికారి ఆయన్ను ఏమాత్రం లెక్కచేయడం లేదని తెలిసింది. ఆ అధికారి చేసే అవినీతి అక్రమాలను ఏమైనా ప్రశ్నిస్తే.. ఉన్నతాధికారి అన్న గౌరవం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించారనే విమర్శలున్నాయి. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులతో పరిచయాలు, అండదండలు ఉన్నాయంటూ చెబుతూ తన పబ్బం గడుపుకుంటున్నారు. వైసీపీ హయాంలో ఆమెపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా షోకాజ్‌ నోటీసు ఇచ్చి మమ అనిపించేశారు. వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఆ కీలక అధికారి ఇటీవల కర్నూలు జిల్లాలోని ఓ మార్కెట్‌ యార్డుకు ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. మంచి ఆదాయం వచ్చే మార్కెట్‌ యార్డుకు వివాదాస్పద అధికారిని కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ మార్కెట్‌ యార్డులో అసిస్టెంట్‌ కార్యదర్శిని కాదని ఉన్నతాధికారులు అవకాశం కల్పించడం ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇదిలా ఉండగా ఓ మార్కెట్‌ యార్డు కార్యదర్శిని గత ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాకు బదిలీ చేయించడంలోనూ వివాదాస్పద అధికారి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. మళ్లీ ఆయన పోస్టింగ్‌ తెచ్చుకునే క్రమంలో ఇప్పుడు ఇన్‌చార్జిగా వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అవినీతి అధికారుల్లో అలజడి

నంద్యాల మార్కెట్‌యార్డులోని ఓ కీలక అధికారిపై ప్రచురించిన ‘పైసా వసూల్‌..’ కథనం ఉమ్మడి జిల్లాలోని ఆ శాఖ వర్గాలతో పాటు అవినీతి అధికారుల్లో అలజడి రేపుతోంది. నంద్యాల, కర్నూలు యార్డుల్లో మాత్రమే కాదు. మిగిలిన మార్కెట్‌యార్డుల్లోనూ చాలా వరకు అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఆ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికైనా ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు స్పందించి మార్కెట్‌యార్డుల వారీగా లోతుగా విచారణ చేయిస్తే పలు అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Apr 05 , 2025 | 11:52 PM