Year-Ender 2024: యూట్యూబ్‌లో ఈ ఏడాది దుమ్ములేపిన వీడియోలివే..
ABN , Publish Date - Dec 17 , 2024 | 10:32 AM
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. ఆ వెంటనే వైరల్‌గా మారి మారు మూల గ్రామాలకు సైతం నిముషాల వ్యవధిలో పాకిపోతోంది. అతి పెద్ద ఆన్‌లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్ మొదటి స్థానంలో ఉందని చెప్పొచ్చు. ఇందులో నిత్యం వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా అనేక వీడియోలు తెగ సందడి చేశాయి. త్వరలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఈ ఏడాది బాగా వైరల్ అయిన టాప్ 10 వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. 2025 సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ ఏడాది చూస్తుండగానే చకచకా గడిచిపోయినట్లు అనిపించింది. అనేక సంతోషాలు, విషాదాలు, వింతలు, విశేషాలతో ఈ 12 నెలలు ముగిసిపోయాయి. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాదిలోనూ యూట్యూబ్‌లో అనేక కొత్త చానెళ్లు పుట్టకొచ్చాయి. అందులో అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ ఏడాదిలో వాటిలో బాగా వైరల్ అయిన వీడియోల గురించి ఇప్పుడు వరుసగా ఓ లక్కేద్దాం పదండి..
2024 ఏడాదిలో అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. వీటిలో కొన్ని వీడియోలు అత్యధిక వ్యూస్ సంపాదించుకున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న వీడియో గురించి చెప్పుకోవాల్సి వస్తే.. బేబీ షార్క్ డ్యాన్స్ వీడియో మొదటి స్థానంలో నిలిచింది.
1.బేబీ షార్క్ డ్యాన్స్
దక్షిణ కొరియాకు చెందిన పింక్‌ఫాంగ్ క్రియేటివ్ చానెల్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. చేపల బొమ్మలతో పాటూ పిల్లలను డాన్స్ చేస్తున్న ఈ వీడియో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో డిసెంబర్ 6వ తేదీనాటికి 15.37 బిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
2.డెస్పాసిటో
లూయిస్ ఫోన్సీ అనే యేూట్యూబ్ చానెల్‌లో షేర్ చేసిన స్పానిష్ పాటకు సంబంధించిన వీడియో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుని రెండో స్థానంలో నిలిచింది. 2017లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం 8.60 బిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ పాట లిరిక్స్‌తో పాటూ మ్యూజిక్ యువతను ఆకట్టుకోవడంతో వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.
3.జానీ జానీ ఎస్ పాపా
పిల్లలు పాడుకునే పాపులర్ పాట అయిన జానీ జానీ ఎస్ పాపా అనే వీడియో అధిక వ్యూస్ సంపాదించి మూడో స్థానంలో నిలిచింది. లూలూ కిడ్స్ అనే యూట్యూబ్ చానెల్‌లో ఈ వీడియోను 2016లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం 6.98 బిలియన్‌కి పైగా వ్యూస్ సంపాదించుకుని అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోందని చెప్పొచ్చు.
4. బాత్ సాంగ్
పిల్లలకు సంబంధించిన బాత్ సాంగ్ వీడియో నాలుగో స్థానంలో నిలిచింది. కోకోమెలన్ అనే యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేసిన ఈ వీడియో చిన్న పిల్లలను తెగ ఆకట్టుకుంటోంది. ఆ పాట పిల్లల శుభ్రతకు సంబంధించిన విషయాలు చెబుతూ మంచి లిరిక్స్‌తో ఉండడంతో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం 6.93 బిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
5. వీల్స్ ఆన్ ద బస్
కోకోమెలన్ యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేసిన వీల్స్ ఆన్ ద బస్ పాట పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను పిల్లలు పాడుకోవడంతో పాటూ డాన్స్ చేయడానికి కూడా ఈజీగా ఉండడంతో తెగ వైరల్ అవుతోంది. 2018లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం 6.93 బిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
6. సీ యూ ఎగైన్..
అమెరికన్ రాపర్ విజ్ ఖలీఫా పాడిన సీ యూ ఎగైన్ పాట ఈ ఏడాదిలో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. 2013లో మరణించి దివంగత నటుడు పాల్ వాకర్‌కు నివాళులు అర్పిస్తూ ఈ పాట పాడారు. 2015లో షేర్ చేసిన ఈ వీడియో.. ఇప్పటివరకూ 44 మిలియన్ల లైక్‌లు, 6.49 బిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
7. షేప్ ఆఫ్ యూ
యూకేకి చెందిన ఎడ్ షీరన్ అనే యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేసిన షేప్ ఆఫ్ యూ అనే పాట కూడా మిలియన్ల మందిని ఆకట్టుకుంది. మంచి సాహిత్యంతో పాటూ వీనులవిందైన సంగీతాన్ని అందించడంతో ఈ పాట ఎంతో మంది మనసు దోచుకుంది. 2017లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం 33 మిలియన్లకు పైగా లైక్‌లు, 6.37 బిలియన్లకు పైగా వ్యూస్‌ను సొతం చేసుకుంది.
8. ఏబీసీ ఆల్పాబెట్ సాంగ్
ChuChu TV అనే యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేసిన ఏబీసీ ఆల్పాబెట్ సాంగ్ పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఇంగ్లీష్ పదాలు నేర్పించడానికి సులువుగా ఉండడంతో బాగా వైరల్ అవుతోంది. ఈ పాట పిల్లలు పాడుకునేందుకూ బాగా ఉండడంతో అత్యధిక వ్యూస్ సంపాదించుకుంది. 2014లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం 6.14 బిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
9. అప్‌టౌన్ ఫంక్
Mark Ronson అనే యూట్యూబ్ చానెల్‌లో షేర్ చేసిన ఈ అప్‌టౌన్ ఫంక్ పాట వీడియో దుమ్ము రేపుతోందని చెప్పొచ్చు. డాన్స్ చేయడానికి అనువుగా ఉండే బీట్స్, ఆకట్టుకునే సంగీతంతో కూడిన ఈ సాంగ్ ఎంతో మంది మదిని దోచిందని చెప్పకనే చెప్పొచ్చు. తొమ్మిదేళ్ల క్రితం విడుదలైన ఈ పాట.. ఇప్పటి యువతనూ ఆకట్టుకుంటుందంటే.. ఈ పాటను ఏం రేంజ్‌లో కంపోజ్ చేశారో ఊహించుకోవచ్చు. 2014లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం 22 మిలియన్లకు పైగా లైక్‌లు, 5.41 బిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
10. గంగ్నమ్ స్టైల్
గంగ్నమ్ స్టైల్ ఒకప్పుడు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణ కొరియాకు చెందిన ఓ రాపర్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఈ వీడియో 2012లో సుమారు 30కి పైగా దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికీ ఈ వీడియో ట్రెండింగ్‌లోనే ఉండడం విశేషం. officialpsy అనే చానెల్‌లో 2012 జూలైలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం 29 మిలియన్లకు పైగా లైక్‌లు, 5.37 బిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.