Share News

Ratan Tata: రతన్ టాటా జీవితంలో థ్రిల్లింగ్ క్షణాలు! ఎన్నో ఏళ్ల కల నెరవేరిన వేళ..

ABN , Publish Date - Oct 10 , 2024 | 10:55 AM

వైమానిక రంగంలో విశేషాసక్తి కనబరిచిన ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా జీవితంలో యుద్ధ విమానాలు నడిపే అవకాశం దక్కడం ఓ మర్చిపోలేని ఘట్టంగా మిగిలిపోయింది. అదో థ్రలింగ్ అనుభవం అని రతన్ టాటా అప్పట్లో వ్యాఖ్యానించారు.

Ratan Tata: రతన్ టాటా జీవితంలో థ్రిల్లింగ్ క్షణాలు! ఎన్నో ఏళ్ల కల నెరవేరిన వేళ..

ఇంటర్నెట్ డెస్క్: టాటా సంస్థలను మునుపెన్నడూ చూడని రీతిలో అభివృద్ధి పథాన నడిపించిన రతన్ టాటా బుధవారం 86 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. వ్యాపారంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన రతన్ టాటాకు విమానయాన రంగం అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. స్వయంగా పైలట్ అయిన రతన్ టాటాకు విమానాలతో పాటు హెలికాఫ్టర్‌లను కూడా నడపగలరు. అయితే, 2007లో ఆయనకు ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం వచ్చింది. తన జీవితంలో అదో ఒళ్లుగగుర్పొడిచే అనుభవమని రతన్ టాటా అప్పట్లో అన్నారు.

Ratan Tata: రతన్ టాటా నిర్మించిన ఒకే ఒక సినిమా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్!


2007 ఫిబ్రవరిలో బెంగళూరు వేదికగా ఎయిరో ఇండియా షో జరిగింది. ఈ షోలో అమెరికాకు చెందిన రక్షణ రంగ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ కూడా పాల్గొని తన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా ఎఫ్-16ను నడపాలంటూ సంస్థ ఆహ్వానించడంతో రతన్ టాటా తొలిసారిగా యుద్ధ విమానాన్ని నడిపారు. అనుభవజ్ఞుడైన అమెరికా పైలట్ మార్గదర్శకత్వంలో కోపైలట్ రతన్ టాటా ఎఫ్-16లో గాల్లో దూసుకుపోయారు. దాదాపు అరగంట పాటు పూర్తిస్థాయిలో పైలట్‌గా విమానాన్ని నియంత్రిస్తూ ఎంజాయ్ చేశారు. యుద్ధ విమానం నడపడం ఒళ్లు గగుర్పొడిచే అనుభవం అని ఆయన ఆ తరువాత మీడియాకు తెలిపారు.

Ratan Tata: రతన్ టాటా విజయ రహస్యాలు ఇవే..

‘‘గగనతనంలో విహరిస్తున్నట్టు మానవ జీవితం ఎంత అల్పమైనదో స్ఫురణకు వస్తుంది. 500 అడుగుల ఎత్తులో మెరుపు వేగంతో ప్రయాణించాము. కమాండర్ నేతృత్వంలో కొన్ని సాహస విన్యాసాలు కూడా చేశాను. నమ్మశక్యం కానీ అనుభవం అది. ఒళ్లు గగుర్పొడిచే అనుభూతి’’ అని రతన్ టాటా చెప్పుకొచ్చారు. యుద్ధ విమానం నడుపుతూ రతన్ టాటా ఎంతో థ్రిల్ అయ్యారని ఎఫ్-16 కమాండర్ కూడా చెప్పుకొచ్చారు. ‘‘మా ప్రయాణంలో హైలైట్ అంటే.. 500 అడుగుల ఎత్తులో 600 నాట్‌ల వేగంతో దూసుకుపోవడమే. అసలు ఎఫ్-16 ఎంత వేగంగా వెళ్లగలదో తెలిసేది అప్పుడే’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఎయిర్ షో సందర్భంగా లాక్ హీడ్ మార్టిన్ రతన్ టాటాకు ఎఫ్-16 విమానానికి సంబంధించి ఓ చిన్న నమూనా బొమ్మను బహుమానంగా ఇచ్చింది.


Ratan Tata: రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా పలువురి సంతాపం

అయితే, ఎఫ్-16ను నడిపిన మరుసటి రోజే రతన్ టాటా మరో యుద్ధ విమానంలో విహరించారు. ఎఫ్-16 కంటే శక్తిమంతమైన ఎఫ్ -18 హార్నెట్ యుద్ధ విమానంలో ఆయన గగనతలంలో దూసుకుపోయారు. అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ కార్యకలాపాలకు ఎఫ్ - 18 అప్పట్లో కీలకంగా ఉండేది. వైమానిక రంగంపై విశేషాసక్తి కనబరిచే రతన్ టాటాకు వరుసగా రెండుసార్లు యుద్ధ విమానాల్లో విహరించే అవకాశం రావడంతో తన కల నేరవేరినట్టు భావించారట.

Read Latest and Viral News

Updated Date - Oct 10 , 2024 | 11:53 AM