Share News

Manu Bhakar : ఆ ఒక్క గురి హ్యాట్రిక్‌ చేజారి..

ABN , Publish Date - Aug 04 , 2024 | 06:46 AM

సంచలన ప్రదర్శనతో రికార్డుల మోత మోగించిన యువ షూటర్‌ మను భాకర్‌ పారిస్‌ గేమ్స్‌ ప్రస్థానం ముగిసింది. శనివారం జరిగిన 25మీ. పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో అద్భుత పోరాటాన్ని కనబరచిన మను త్రుటిలో పతకాన్ని

Manu Bhakar : ఆ ఒక్క గురి హ్యాట్రిక్‌ చేజారి..

ఒక్క తూటా.. ఒకే ఒక్క తూటా మను భాకర్‌ చరిత్ర సృష్టించే అవకాశాన్ని చేజార్చింది. ఇప్పటికే రెండు పతకాలు సాధించిన మను 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లోనూ ఫైనల్‌కు వెళ్లడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. మూడో స్థానం కోసం జరిగిన షూటాఫ్‌లో మను మూడు షాట్లు మాత్రమే కొట్టగా.. ప్రత్యర్థి నాలుగు షాట్లతో ముందుకెళ్లింది. దీంతో లక్ష్య ఛేదనలో కొద్దిలో గురి తప్పిన ఈ హరియాణా షూటర్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయినా ఇప్పటికే రెండు పతకాలతో దేశ ఖ్యాతిని పెంచిన మనుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

మూడో పతకాన్ని త్రుటిలో కోల్పోయిన మను భాకర్‌

25మీ. పిస్టల్‌ ఈవెంట్‌లో నాలుగో స్థానంతో సరి

పారిస్‌: సంచలన ప్రదర్శనతో రికార్డుల మోత మోగించిన యువ షూటర్‌ మను భాకర్‌ పారిస్‌ గేమ్స్‌ ప్రస్థానం ముగిసింది. శనివారం జరిగిన 25మీ. పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో అద్భుత పోరాటాన్ని కనబరచిన మను త్రుటిలో పతకాన్ని చేజార్చుకుంది. 28 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో మూడు పతకాలతో చరిత్ర సృష్టిద్దామనుకున్న భాకర్‌ ఆశలకు బ్రేక్‌ పడినట్టయ్యింది. ఇప్పటికే మను మహిళల వ్యక్తిగత 10మీ. ఎయిర్‌ పిస్టల్‌తో పాటు మిక్స్‌డ్‌ టీమ్‌లో సరబ్‌జోత్‌తో కలిసి కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ పోటీలో కొరియా షూటర్‌ జిన్‌ యాంగ్‌ (37)కు స్వర్ణం, ఫ్రాన్స్‌కు చెందిన కమిలె జెద్రెజెస్కికి రజతం, వెరోనిక(హంగేరి)కు కాంస్యం దక్కింది. భారత్‌ నుంచి గతంలోనూ షూటర్లు జాయ్‌దీప్‌ కర్మాకర్‌ (2012), అభినవ్‌ బింద్రా (2016), అర్జున్‌ బబుతా (2024) నాలుగో స్థానంలో నిలిచిన వారిలో ఉన్నారు.

షూటా్‌ఫలో తడబాటు

ఫైనల్‌లో భాగంగా స్టేజి1లో జరిగే మూడు సిరీ్‌సల్లో ఒక్కో షూటర్‌ 15 షాట్లు కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టేజి2 ఎలిమినేషన్‌లో 4-10 సిరీ్‌సలు జరుగుతాయి. అయితే పోటీని మను పేలవంగానే ఆరంభించినప్పటికీ క్రమక్రమంగా పర్ఫెక్ట్‌ షాట్లతో తన స్థానాలను మెరుగుపర్చుకుంటూ కొద్ది క్షణాలపాటు నెంబర్‌వన్‌గానూ నిలిచింది. కానీ అదే నిలకడను కొనసాగించలేక మూల్యం చెల్లించుకుంది. స్టేజి1 తొలి సిరీ్‌సలో ఐదు టార్గెట్లలో రెండు మాత్రమే కొట్టింది. కానీ వెంటనే పుంజుకుని తర్వాత రెండు సిరీ్‌సల్లో నాలుగేసి షాట్లతో మొత్తం 10 పాయింట్లతో రెండో స్థానానికి వెళ్లింది. ఆ తర్వాత ఎలిమినేషన్‌ రౌండ్‌లో భాకర్‌ ఐదో సిరీ్‌సను ఐదు షాట్లతో ముగించి భేష్‌ అనిపించుకుంది. ఏడో సిరీ్‌సలో రెండు వరుస షాట్లతో కాసేపు భాకర్‌ టాప్‌లోకి వెళ్లినా, ఆ తర్వాత మూడో షాట్‌ మిస్‌ అయింది. అటు జిన్‌ యాంగ్‌ మూడు వరుస షాట్లతో టాప్‌లోకి వెళ్లి భాకర్‌ను మూడో స్థానంలోకి నెట్టింది. ఇక ఎనిమిదో సిరీ్‌సలో మను రెండు షాట్లు మాత్రమే కొట్టగా, వెరోనిక మూడు షాట్లతో ఇద్దరూ 28 పాయింట్లతో మూడో స్థానంలో నిలవాల్సి వచ్చింది. వాస్తవానికి ఇక్కడ మను మరో షాట్‌ సరిగ్గా కొట్టి ఉంటే 29 పాయింట్లతో షూటాఫ్‌ ఆడాల్సి వచ్చేది కాదు. టాప్‌-3లోకి వెళ్లి కనీసం కాంస్యమైనా దక్కించుకునేది. షూటా్‌ఫలోనూ భాకర్‌ 3 షాట్లు, వెరోనిక 4 షాట్లు కొట్టడంతో భారత షూటర్‌కు నిరాశ తప్పలేదు.

మెరిసిన మహేశ్వరి

పురుషుల స్కీట్‌ ఈవెంట్‌లో అనంత్‌ జీత్‌ నరుకకు నిరాశే ఎదురైంది. రెండో రోజు క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో తను 24వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. అటు మహిళల స్కీట్‌ తొలి రోజు క్వాలిఫికేషన్‌లో మహేశ్వరి చౌహాన్‌ 71 పాయింట్లతో 8వ స్థానంతో ఆకట్టుకుంది. దీంతో ఫైనల్‌కు అర్హత సాధించే టాప్‌-6లో ఉండేందుకు తన అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరో షూటర్‌ రైజా ధిల్లాన్‌ 66 పాయింట్లతో 25వ స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం జరిగే మరో ఐదు రౌండ్లలో ఫైనలిస్టులు ఖరారవుతారు.

ఒత్తిడి లేదు..

కొద్దిలో పతకం మిస్‌ అయినందుకు షూటర్‌ మను భాకర్‌ భావోద్వేగానికి లోనైంది. ‘రెండు పతకాలు సాధించినప్పటికీ.. మూడో ఈవెంట్‌లో ఓటమి బాధ కలిగించింది. నాలుగో స్థానం అంత మంచిది కాదు’ అని కన్నీటిని ఆపుకొంటూ భాకర్‌ తెలిపింది. అయితే తానేమీ ఒత్తిడిలో బరిలోకి దిగలేదని స్పష్టం చేసింది. లాస్‌ ఏంజిల్స్‌లో తిరిగి సత్తా చూపుతానని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘మ్యాచ్‌ అయిపోయాక ఫలితం గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా కూర్చుని పోటీ ఫలితాన్ని విశ్లేషించుకోవాలని నా కోచ్‌ జస్పాల్‌ రాణా చెప్పాడు. నన్ను వాస్తవిక స్థితిలో ఉంచేందుకు ఆయన చేసిన ప్రయత్నం గొప్పది. మూడో పతకం కోసం నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. టోక్యో గేమ్స్‌లో ఆత్మవిశ్వాసంతో లేను. ప్రతీ దానికి భయపడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నాలో అనుభవంతో కూడిన మార్పు వచ్చింది. దీనికి నా కోచ్‌ రాణా కారణం’ అని మను పేర్కొంది.

Updated Date - Aug 04 , 2024 | 07:00 AM