RD Engineering Limited: పబ్లిక్ ఇష్యూకి ఆర్డీ ఇంజనీరింగ్
ABN , Publish Date - Mar 29 , 2025 | 07:25 AM
హైదరాబాద్‌కు చెందిన ఆర్డీ ఇంజనీరింగ్ లిమిటెడ్ రూ.580 కోట్ల పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి సీబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు తాజా ఈక్విటీ జారీ చేస్తోంది, అలాగే కంపెనీ కొన్ని కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటు కోసం నిధులను వినియోగించుకోనుంది

రూ.580 కోట్ల సమీకరణ లక్ష్యం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన ఆర్డీ ఇంజనీరింగ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వస్తోంది. ఐపీఓ ద్వారా రూ.580 కోట్ల సమీకరణకు అనుమతి కోరుతూ క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.500 కోట్ల తాజా ఈక్విటీ జారీ చేయనుండటంతో పాటు ప్రమోటర్ చంద్రశేఖర్ మోటూరుకు చెందిన రూ.80 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) పద్ధతిన విక్రయించాలని భావిస్తోంది. అంతేకాదు, ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.100 కోట్ల వరకు సమీకరించే ఆలోచన కూడా ఉంది. ఒకవేళ ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ ద్వారా నిధులు సమీకరిస్తే, ఐపీఓలో తాజా ఈక్విటీ జారీ సైజును తగ్గించుకోనుంది. తాజా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.279.6 కోట్లను తెలంగాణలోని సీతారాంపూర్‌లో 2 కొత్త తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు వినియోగించుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మరో రూ.44.8 కోట్లతో ఏపీలోని పరవాడలో కొత్త ఇంటిగ్రేటెడ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌నూ ఏర్పాటు చేయాలనుకుంటోంది. మరో రూ.65 కోట్లను రుణాలను తిరిగి చెల్లించేందుకు, మిగతా సొమ్మును వ్యాపార అవసరాల కోసం వినియోగించుకోవాలనుకుంటోంది.
సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన స్టడ్స్ యాక్సెసరీస్
ద్విచక్ర వాహన హెల్మెట్ల తయారీ సంస్థ స్టడ్స్ యాక్సెసరీస్ లిమిటెడ్ తమ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (సెబీ) సమర్పించింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా కంపెనీ నిధులు సమీకరించనుంది. ఇందుకోసం ఆఫర్ ఫర్ సేల్ విధానంలో 77,86,120 షేర్లను విక్రయించనుంది. ఒక్కో షేరు ముఖ విలువ రూ. 5గా ఉంటుంది. ఈ ఇష్యూకి ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థలు, బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.