Royal Challengers Bangalore: ఎన్నేళ్లో వేచిన విజయం
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:49 AM
ఐపీఎల్ 2025లో 17 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెపాక్ మైదానంలో చennai సూపర్ కింగ్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించి విజయం సాధించింది. రజత్ పటీదార్ 51 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు

17 ఏళ్ల తర్వాత చెపాక్‌లో మురిసిన బెంగళూరు
50 రన్స్ తేడాతో చెన్నై చిత్తు
రజత్ పటీదార్ హాఫ్ సెంచరీ
చెన్నై: ఒకటా.. రెండా ఏకంగా 17 ఏళ్ల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇక్కడి చెపాక్ మైదానంలో విజయం రుచి చూసింది. బ్యాటింగ్‌లో మెరుపులతో పాటు బౌలింగ్‌లోనూ అదరగొట్టిన ఆర్‌సీబీ శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో బెంగళూరు ఇక్కడ తొలిసారి గెలిచింది. అప్పటికి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయకపోవడం గమనార్హం. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51), సాల్ట్ (16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 32), విరాట్ (30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) రాణించారు. నూర్ అహ్మద్‌కు మూడు, పథిరనకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు చేసి ఓడింది. రచిన్ (41), ధోనీ (30 నాటౌట్), జడేజా (25) ఫర్వాలేదనిపించారు. హాజెల్‌వుడ్‌కు మూడు.. యష్, లివింగ్‌స్టోన్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా రజత్ పటీదార్ నిలిచాడు.
ఆది నుంచే తడబ్యాటు..: ఆర్‌సీబీ ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగిన చోట సీఎ్‌సకే బ్యాటర్లు తెగ కష్టపడ్డారు. అటు పేసర్లు, స్పిన్నర్లు సమష్టిగా రాణించి ఈ విజయంలో కీలకమయ్యారు. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ ఎలాంటి ప్రభావమూ చూపలేకపోయింది. ఓపెనర్ రచిన్ మాత్రం కాస్త నిలదొక్కుకోగా.. చివర్లో ధోనీ మెరుపులతో ఊరటనిచ్చాడు. పేసర్ హాజెల్‌వుడ్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ త్రిపాఠి (5), కెప్టెన్ రుతురాజ్ (0)లను వెనక్కి పంపి షాకిచ్చాడు. దీపక్ హుడా (4)ను భువనేశ్వర్ అవుట్ చేయడంతో జట్టు పవర్‌ప్లేలో 30/3 స్కోరుతో దయనీయంగా కనిపించింది. హిట్టింగ్ కోసం వచ్చిన సామ్ కర్రాన్ (8) చేసేదేమీ లేకపోయింది. ఈ దశలో రచిన్-దూబే జోడీ అడపాదడపా బౌండరీలతో ఆశలు రేపింది. అయితే 13వ ఓవర్‌లో పేసర్ యష్ ఈ ఇద్దరినీ బౌల్డ్ చేసి సీఎ్‌సకేకు ఓటమిని కళ్లముందుంచాడు. అప్పటికి స్కోరు 80/6. అశ్విన్ (11)ను స్పిన్నర్ లివింగ్‌స్టోన్ అవుట్ చేశాక 16వ ఓవర్‌లో ధోనీ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి సమీకరణం 29 బంతుల్లో 98 రన్స్‌గా ఉండడంతో చెపాక్‌లో ఆర్‌సీబీ విజయం ఖాయమైంది. జడేజా -ధోనీ మధ్య 8వ వికెట్‌కు అత్యధికంగా 31 పరుగులు జత చేరినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్‌లో 67 రన్స్ అవసరపడగా.. ధోనీ 6,6,4తో ఫ్యాన్స్‌లో కాస్త జోష్ నింపాడు.
రజత్, సాల్ట్ జోరు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్ సాల్ట్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. అలాగే బరిలోకి దిగిన ప్రతీ బ్యాటరూ బాదడమే లక్ష్యంగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ ఓపెనర్ విరాట్ మాత్రం షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు. అటు కెప్టెన్ రజత్ పటీదార్ మూడు క్యాచ్‌లను చెన్నై ఫీల్డర్లు వదిలేయడం ఆర్‌సీబీ భారీ స్కోరుకు కారణమైంది. ‘స్పిన్నర్ నూర్ అహ్మద్ మరోసారి ప్రభావం చూపాడు. తొలి ఓవర్‌లోనే సాల్ట్ రెండు ఫోర్లు, తర్వాతి ఓవర్‌లో 6,4,4తో ఎదురుదాడికి దిగాడు. ఐదో ఓవర్‌లో అతడిని స్పిన్నర్ నూర్ అహ్మద్ అవుట్ చేయగా తొలి వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత దేవ్‌దత్ సిక్సర్‌తో పవర్‌ప్లేలో జట్టు 56/1తో నిలిచింది. ఏడో ఓవర్‌లో పడిక్కళ్ 4,4,6తో 15 పరుగులు రాబట్టాడు. అశ్విన్ ఓవర్‌లో తను నిష్క్రమించాక బరిలోకి దిగిన పటీదార్ మరింత చెలరేగాడు. అయితే అతను 17 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సులువైన క్యాచ్‌ను లాంగా్‌ఫలో దీపక్ హుడా వదిలేయడం ఆర్‌సీబీకి కలిసివచ్చింది. అటు నెమ్మదిగా ఆడి ఒత్తిడికి లోనైన విరాట్‌ను నూర్ అహ్మద్ అవుట్ చేశాడు. 14వ ఓవర్‌లో రజత్ 6,4,4తో 15 రన్స్‌తో స్కోరు మళ్లీ వేగం పుంజుకుంది. లివింగ్‌స్టోన్ (10), జితేశ్ (12) స్వల్ప స్కోర్లకు వెనుదిరగ్గా, 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన పటీదార్ 19వ ఓవర్‌లో భారీ షాట్‌కు వెళ్లి పథిరనకు చిక్కాడు. ఈ ఓవర్‌లో వైడ్ రూపంలో ఓకే పరుగు రాగా క్రునాల్ కూడా డకౌటయ్యాడు. అయితే ఆఖరి ఓవర్‌లో టిమ్ డేవిడ్ (22 నాటౌట్) హ్యాట్రిక్ సిక్సర్లతో 19 రన్స్ అందించడంతో ఆర్‌సీబీ 190 రన్స్ దాటగలిగింది.
ధోనీ.. మరోసారి: ధోనీ మెరుపు స్టంపింగ్ మరోసారి ఫ్యాన్స్‌ను అబ్బురపరిచింది. ముంబైతో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ను అవుట్ చేసిన మాదిరే.. ఈసారి ఆర్‌సీబీపై ఓపెనర్ సాల్ట్ పనిబట్టాడు. వేగంగా ఆడుతున్న అతడిని స్పిన్నర్ నూర్ అహ్మద్ ఓవర్‌లో 0.16 సెకన్లలోనే స్టంప్ చేశాడు. వాస్తవానికి సాల్ట్ క్రీజులో నుంచి కాళ్లు తీసినట్టుగా కూడా కనిపించలేదు. కానీ రీప్లేలో మాత్రమే అతడి కాలు గాల్లోకి లేచినట్టు కనిపించడం గమనార్హం.
స్కోరుబోర్డు
బెంగళూరు: సాల్ట్ (స్టంప్డ్) ధోనీ (బి) నూర్ అహ్మద్ 32; విరాట్ (సి) రచిన్ (బి) నూర్ అహ్మద్ 31; పడిక్కళ్ (సి) రుతురాజ్ (బి) అశ్విన్ 27; పటీదార్ (సి) కర్రాన్ (బి) పథిరన 51; లివింగ్‌స్టోన్ (బి) నూర్ అహ్మద్ 10; జితేశ్ (సి) జడేజా (బి) ఖలీల్ 12; డేవిడ్ (నాటౌట్) 22; క్రునాల్ (సి) హుడా (బి) పథిరన 0; భువనేశ్వర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 196/7. వికెట్ల పతనం: 1-45, 2-76, 3-117, 4-145, 5-172, 6-176, 7-177. బౌలింగ్: ఖలీల్ 4-0-28-1; అశ్విన్ 2-0-22-1; కర్రాన్ 3-0-34-1; నూర్ అహ్మద్ 4-0-36-3; జడేజా 3-0-37-0; పథిరన 4-0-36-2.
చెన్నై: రచిన్ (బి) యశ్ దయాల్ 41, రాహుల్ త్రిపాఠి (సి) సాల్ట్ (బి) హాజెల్‌వుడ్ 5, రుతురాజ్ (సి) సబ్ బందగే (బి) హాజెల్‌వుడ్ 0, దీపక్ హుడా (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 4, కర్రాన్ (సి) క్రునాల్ (బి) లివింగ్‌స్టోన్ 8, శివమ్ దూబే (బి) యశ్ దయాల్ 19, జడేజా (సి) సాల్ట్ (బి) హాజెల్‌వుడ్ 25, అశ్విన్ (సి) సాల్ట్ (బి) లివింగ్‌స్టోన్ 11, ఽధోనీ (నాటౌట్) 30, నూర్ అహ్మద్ (నాటౌట్) 0 ; ఎక్స్‌ట్రాలు : 3 ; మొత్తం 20 ఓవర్లలో 146/8 ; వికెట్లపతనం : 1-8, 2-8, 3-26, 4-52, 5-75, 6-80, 7-99, 8-130 ; బౌలింగ్ : భువనేశ్వర్ 3-0-20-1, హాజెల్‌వుడ్ 4-0-21-3, యశ్ దయాల్ 3-0-18-2, లివింగ్‌స్టోన్ 4-0-28-2, సుయాష్ శర్మ 4-0-32-0, క్రునాల్ 2-0-26-0.