Gold Price Rise: గోల్డ్ మరో ఆల్‌టైం రికార్డు
ABN , Publish Date - Mar 29 , 2025 | 07:20 AM
పసిడి ధరలు ఢిల్లీ మార్కెట్లో సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి చేరాయి. 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛత గోల్డ్ ధర రూ.92,150గా పెరిగింది, అలాగే వెండి ధర కూడా రూ.1,03,000కి చేరింది

రూ.92,000 దాటిన 10 గ్రాముల ధర
ఒక్కరోజే రూ.1,100 పెరుగుదల
న్యూఢిల్లీ: పసిడి ధరలు సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠానికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం రూ.1,100 పెరిగి రూ.92,150కి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం కూడా అదే స్థాయిలో పెరిగి రూ.91,700కి చేరుకుంది. గోల్డ్ రేట్లు పెరగడం వరుసగా ఇది మూడో రోజు. కిలో వెండి సైతం రూ.1,300 పెరుగుదలతో రూ.1,03,000 ధర పలికింది. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. ఇంటర్నేషనల్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ 3,086.08 డాలర్లకు చేరగా.. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు రేటు సరికొత్త రికార్డు గరిష్ఠం 3,124.40 డాలర్లకు ఎగబాకింది. స్పాట్ సిల్వర్ 34.42 డాలర్లకు పెరగగా.. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు రేటు 35.33 డాలర్లకు చేరింది.
2024-25లో గోల్డ్ 35 శాతం అప్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి రోజున (2024 ఏప్రిల్ 1) రూ.68,420 పలికిన 10 గ్రాముల బంగారం.. గడిచిన ఏడాది కాలం లో రూ.23,730 (35 శాతం) పెరిగింది. ఫెడ్ రేట్ల తగ్గింపు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు తాజాగా ట్రంప్ సుంకాలు గోల్డ్ ర్యాలీకి కారణమయ్యాయి. ట్రంప్ సుంకాలతో మున్ముందు ఆర్థిక అనిశ్చితులు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి. ఇందుకుతోడు, అమెరికా మళ్లీ ఆర్థిక మాంద్యంలోకి జారుకోవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. ఇదే గనక జరిగితే, బంగారం, వెండి ధరలు మరింత ఎగబాకడం ఖాయమని బులియన్ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ గోల్డ్ 3,300 డాలర్లకు చేరుకోవచ్చన్న అంచనాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 3,300 డాలర్లకు చేరితే, దేశీయంగా తులం మేలిమి బంగారం రూ.లక్ష దాటే అవకాశాలున్నాయి.